Ugram Review In Telugu: ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!

  • May 5, 2023 / 05:00 PM IST

Cast & Crew

  • అల్లరి నరేశ్ (Hero)
  • మిర్ణా మీనన్‌ (Heroine)
  • శత్రు (Cast)
  • విజయ్‌ కనకమేడల (Director)
  • సాహు గారపాటి, హరీష్‌ పెద్ది (Producer)
  • శ్రీచరణ్‌ పాకాల (Music)
  • సిద్ధార్థ్ జె (Cinematography)

“నాంది, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం” చిత్రాలతో నటుడిగా తన ఉనికిని చాటుకున్న అల్లరి నరేష్ నటించిన తాజా చిత్రం “ఉగ్రం”. ఇప్పటివరకు కామెడీ లేదా సీరియస్ పాత్రల్లో కనిపించిన నరేష్.. మొదటిసారి ఫుల్ లెంగ్త్ యాక్షన్ రోల్లో నటించిన ఈ చిత్రం నేడు (మే 5) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రంతో నరేష్ తన సక్సెస్ స్ట్రీక్ ను కంటిన్యూ చేశాడో లేదో చూద్దాం..!!

కథ: చాలా సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ శివ కుమార్ (అల్లరి నరేష్). కుటుంబం కంటే ఉద్యోగ ధర్మానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండడంతో.. భార్య (మిర్ణా మీనన్) అతడ్ని వదిలేసి వెళ్లిపోవడానికి సిద్ధమవుతుంది. భార్యాపిల్లల్ని ఇంటి దగ్గర దింపడానికి బయలుదేరిన శివకుమార్ ఒక యాక్సిడెంట్ కారణంగా వాళ్ళకు దూరమవుతాడు.

అసలు శివకుమార్ ఎలాంటి కేసుల మీద పని చేస్తున్నాడు? మిస్ అయిన భార్యాపిల్లలు ఏమయ్యారు? వంటి ప్రశ్నలకు సమాధానమే “ఉగ్రం”.

నటీనటుల పనితీరు: అల్లరి నరేష్ మొదటిసారి ఒక ఫుల్ లెంగ్త్ యాక్షన్ రోల్లో నటించి.. నటుడిగా తన స్థాయిని ఘనంగా చాటుకున్నాడు. ఇప్పటివరకూ కామెడీ లేదా సీనియర్ రోల్స్ లో మాత్రమే నరేష్ ను చూసిన ఆడియన్స్ కు ఇది చాలా కొత్తగా కనిపించే పాత్ర ఇది. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ లో నరేష్ కళ్ళల్లోని ఇంటెన్సిటీ ఆశ్చర్యపరుస్తుంది. అలాగే ఎమోషనల్ సీన్స్ లోనూ ఆకట్టుకున్నాడు.

మిర్ణా పాత్ర ఈ సినిమాలో మిస్ ఫిట్. కానీ.. ఆమె లుక్స్ తో మాత్రం అలరించింది. నటిగానూ పర్వాలేదనిపించుకుంది. ఇంద్రజ, శరత్ లు తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు.

సాంకేతికవర్గం పనితీరు: సినిమాటోగ్రాఫర్ సిద్ధార్ధ్ జాదవ్ పనితనాన్ని మెచ్చుకోవాలి. కథలో కంటే అతడి కెమెరా పనితనంలోనే ఎక్కువ ఇంటెన్సిటీ కనబడింది. ముఖ్యంగా యాక్షన్ బ్లాక్స్ ను అతడు తెరకెక్కించిన విధానం బాగుంది. రియాలిటీకి దగ్గరగా యాక్షన్ సీన్స్ ను కంపోజ్ చేసుకున్నాడు.

శ్రీచరణ్ పాకాల నేపధ్య సంగీతం కొన్ని సన్నివేశాలను బాగా ఎలివేట్ చేయడంతోపాటు.. ఫస్టాఫ్ లో ఆడియన్స్ బాగా ఇన్వాల్వ్ అయ్యేలా చేసింది.

దర్శకుడు విజయ్ కనకమేడల ఎంచుకున్న మూల కథ బాగున్నా.. ఆ కథను నడిపిన విధానం మాత్రం ఆకట్టుకోలేకపోయింది. ముఖ్యంగా.. చాలా సీరియస్ సినిమాలో అనవసరంగా ప్రేమకథను, పాటలను ఇరికించడం పెద్ద మైనస్ గా మారింది. ఈ చిత్రానికి అసలు పాటలు కానీ, కామెడీ ట్రాక్ లు కానీ అవసరం లేదు. “ఖైధీ” తరహాలో సీరియస్ & సిన్సియర్ ఫిలిమ్ గా “ఉగ్రం”ను తెరకెక్కించి ఉంటే నరేష్ కెరీర్ లో ఒక కలికితురాయిగా నిలిచేది.

కానీ.. కమర్షియాలిటీ కోసం సదరు అనవసరమైన అంశాలను ఇరికించడంతో.. అవి సినిమాకి మైనస్ గా మారి, ఆడియన్స్ కు బోర్ కొట్టించాయి. సో, దర్శకుడిగా, కథకుడిగా విజయ్ బొటాబోటి మార్కులు సంపాదించుకున్నాడు.

విశ్లేషణ: అల్లరి నరేష్ సినిమా అంటే ఇలా ఉండాలి అని ఎక్స్ పెక్టేషన్స్ లేకుండా, ఓపెన్ మైండ్ తో వెళ్తే కచ్చితంగా ఆకట్టుకునే చిత్రం “ఉగ్రం”. కట్టిపడేసే నరేష్ నటన, శ్రీచరణ్ పాకాల నేపధ్య సంగీతం కోసం ఈ చిత్రాన్ని కచ్చితంగా ఒకసారి చూడొచ్చు. సెకండాఫ్ & క్లైమాక్స్ విషయంలో ఇంకాస్త ప్రోపర్ గా వర్క్ చేసి ఉంటే సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచేది.

రేటింగ్: 2.5/5

Rating

2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus