సూర్యకాంతం.. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ నటి.. ఆమె కేవలం నటి మాత్రమే కాదు, మంచి మనసున్న వ్యక్తి.. తెలుగు తెరకు గయ్యాళి అత్త పాత్రలను పరిచయం చేసిన విలక్షణ నటి.. పోషించే పాత్ర ఏదైనా తన సహజమైన నటనతో ఆ పాత్రకు వన్నె తేవడమే కాదు, ఆమె తప్ప మరోనటి ఆ పాత్ర చెయ్యలేరు అన్నంతగా ఇమిడిపోయేవారు. అక్టోబర్ 28న సుర్యకాంతం 98వ జయంతి. ఈ సందర్భంగా ఆమె బాల్యం, సినీ జీవితాన్ని గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు చూద్దాం..
1924 అక్టోబరు 28న కాకినాడ సమీపంలోని వెంకట కృష్ణరాయపురంలో జన్మించారు సూర్యకాంతం. చిన్నతనంలో బాగా అల్లరి చేసేవారట. దాంతో అల్లరి అమ్మాయిగా ముద్ర పడిపోయారు. కాకినాడలో కాలేజీ చదివే రోజుల్లో హ్యాపీ క్లబ్లో వేసేవారు. అప్పుడే ఆమెకు అంజలి, ఆదినారాయణరావు, ఎస్వీ రంగారావు లాంటి ప్రముఖులతో పరిచయం ఏర్పడడంతో సినీ రంగంపై మక్కువ కలిగింది. చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించిన కొత్తలో చిన్న చిన్న పాత్రలు చేశారు. వరద ప్రవాహంలా డైలాగులు చెప్పగలగడం ఆమెకున్న వరం..
1950లో ఎన్టీఆర్, ఏఎన్నార్ హీరోలుగా ఎల్వీ ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన ‘సంసారం’ సినిమా సూర్యకాంతం కెరీర్ను మలుపు తిప్పింది. ఆ చిత్రం ఆమెను కయ్యాలమారిగా..గయ్యాళి గంపగా నిలబెట్టింది. అక్కడి నుంచి ఒకటా, రెండో ఎన్నో అవకాశాలు క్యూ కట్టాయి. సూర్యకాంతం కోసమే క్యారెక్టర్స్ క్రియేట్ చేయడం, డైలాగులు రాయడం చేసేవారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి ప్రముఖ నటులిద్దరు హీరోలుగా నటించిన సినిమాలో ఆమె పాత్ర పేరుతోనే ‘గుండమ్మ కథ’ తీశారంటే సూర్యకాంతం స్థాయి అర్థం చేసుకోవచ్చు.
తాను తింటూ నలుగురికి పెట్టడం ఆమెలోని గొప్ప లక్షణాల్లో ఒకటని సూర్యకాంతం గురించి తెలిసిన వారు చెబుతుండేవారు. సినిమాలో ‘అత్తరికాన్ని’ చెలాయించి ప్రేక్షకుల గుండెలపై చెరగని ముద్ర వేసుకున్నారామె. ఒకే రకం పాత్రల్ని ఎక్కువ సినిమాల్లో నటించిన నటి ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క సూర్యకాంతమే. దాదాపు 750పైగా సినిమాల్లో ఎన్నో గుర్తుండిపోయే పాత్రల్లో ఒదిగిపోయారు సూర్యకాంతం. మనుషుల్ని స్థాయితో సంబంధం లేకుండా అభిమానించేవారు. పండుగలు, పబ్బాలు వస్తే వర్కర్స్కు బోనస్ ఇచ్చే విశాల హృదయం సూర్యకాంతం సొంతం.
సినిమాల్లో ఆమె వేసేవి గయ్యాళి అత్త వేషాలే అయినా.. వ్యక్తిగతంగా ఆమె చాలా సౌమ్యురాలు. చక్కని మాటతీరుతో అందరినీ ఆప్యాయంగా పలకరించేవారు. మరణించడానికి కొద్ది రోజుల ముందు కూడా సావిత్రి స్మారక అవార్డు అందుకున్నారామె.. చివరగా నటించిన సినిమా ‘ఎస్.పి.పరశురాం’. సూర్యకాంతం 1994 డిసెంబర్ 18న తన 70వ ఏట స్వర్గస్తులయ్యారు.
ఆమె శారీరకంగా మనమధ్య లేకపోయినా.. తన అసమాన నటనతో పోషించిన ఎన్నో మరపురాని పాత్రల రూపంలో ప్రేక్షకుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచే ఉంటారు. ఒక నటిగా వేరెవ్వరూ భర్తీ చేయలేని స్థానాన్ని సంపాదించుకున్నారామె. దటీజ్ సూర్యకాంతం..
Most Recommended Video
ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!