‘బొబ్బిలి రాజా’ సినిమా గురించి మనకు తెలియని నిజాలు..!
September 14, 2020 / 08:31 PM IST
|Follow Us
విక్టరీ వెంకటేష్ కెరీర్లో ఆల్ టైం హిట్ గా నిలిచింది ‘బొబ్బిలి రాజా’ చిత్రం. ఇదొక క్లాసిక్. 1990 సెప్టెంబర్ 14న ఈ చిత్రం విడుదలయ్యింది. బి.గోపాల్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం విడుదలయ్యి ఈరోజుతో 30 ఏళ్ళు పూర్తికావస్తోంది. అయితే ఈ చిత్రం గురించి కొన్ని విషయాలు బహుశా చాలా మందికి తెలియకపోయి ఉండచ్చు. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం రండి :
నిజానికి ఒక అడవిలో ఉండే ఓ హీరో. ఆ అడవి అందాలను ఎంజాయ్ చెయ్యడానికి .. టూర్ అంటూ వచ్చిన ఓ హీరోయిన్. అక్కడ హీరోయిన్ తో హీరోకి ప్రేమాయణం. సెకండ్ హాఫ్ లో ఓ ఫ్లాష్ బ్యాక్. ఇలా కథ విషయంలో పెద్దగా కొత్తదనం కనిపించదు. ఎందుకంటే.. అప్పటికే చిరంజీవి ‘అడవి దొంగ’ సినిమా వచ్చింది. దాని కథ కూడా ఇంచు మించు ఇలానే ఉంటుంది. అయితే దీనికి మరిన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి.. హీరోయిన్ గ్లామర్, పాటలు,మంత్రి అత్త అహంకారం వంటివి జోడించి కమర్షియల్ గా ప్రెజెంట్ చేశారు బి.గోపాల్.
ముందుగా ఈ చిత్రంలో హీరోయిన్ గా రాధను తీసుకోవాలి అని అనుకున్నారట. అలా తీసుకుంటే.. వెంటనే జనాలు ‘అడవి దొంగ’ ను గుర్తు చేసుకుంటారు అని నిర్మాతలలో ఒకరైన సురేష్ బాబు అనుమానం వ్యక్తం చేశారట. నిజమే ఓ కొత్త హీరోయిన్ అయితేనే బెటర్ అని నిర్మాత రామానాయుడు గారు భావించి… బాలీవుడ్ నుండీ దివ్య భారతి ని దింపారు. ఆమె గ్లామర్ ఈ చిత్రానికి బాగా ప్లస్ అయ్యిందనే చెప్పాలి.
ఈ చిత్రంలో అత్యంత కీలకమైన అత్త పాత్ర కోసం ముందుగా శారద గారిని అనుకున్నారట. కానీ ఆమె ఇంత అహంకారం కలిగిన పాత్రకు సూట్ అవ్వదని భావించి ‘అత్తకు యముడు అమ్మాయికి మొగుడు’ రిఫరెన్స్ తో వాణిశ్రీ ని ఎంచుకున్నారట.’రాష్ట్రాన్నయినా రాసిస్తాను కానీ – నా కూతుర్ని మాత్రం నీకిచ్చి పెళ్లి చెయ్యను’ అంటూ ఆమె పలికిన డైలాగ్ సినిమాకే హైలెట్ గా నిలిచింది.
ఇక ‘అయ్యో అయ్యో అయ్యయ్యో’… అంటూ వెంకీ పలికిన డైలాగ్ అలాగే ‘బలపం పట్టి’ పాటలు అయితే మాస్ కు విపరీతంగా నచ్చేసాయి.ఇక ఇళయరాజా గారి సంగీతం, క్లైమాక్స్ లో వచ్చే ట్రైన్ ఫైట్.. సినిమాని నెక్స్ట్ లెవెల్లో నిలబెట్టింది.
వెంకీ కెరీర్లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘బొబ్బిలిరాజా’ ను రామానాయుడు గారు .. తన పెద్ద మనవడు రానాతో రీమేక్ చేయిస్తే బాగుంటుంది అని సురేష్ బాబు గారికి పదే పదే చెప్పేవారట.రానాకు కూడా ‘బొబ్బిలి రాజా’ రీమేక్ చెయ్యాలని బలంగా ఉందట. అయితే ఆ కోరిక తీరాలంటే.. స్క్రిప్ట్ ఓ రేంజ్లో ఉండాలి. మరి ఆ స్థాయిలో స్క్రిప్ట్ ను రెడీ చేసే దర్శకుడు ఎక్కడున్నాడో..!