Khadgam Movie: అవార్డుల పంట పండించిన 20 ఏళ్ల కృష్ణవంశీ ‘ఖడ్గం’ గురించి ఆసక్తికర విషయాలు..!
November 29, 2022 / 02:38 PM IST
|Follow Us
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ.. కెరీర్ స్టార్టింగ్ ‘గులాబి’ నుండి విభిన్నకథాంశాలతో సినిమాలు చేస్తూ.. తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన మార్క్ క్రియేట్ చేసుకున్నారు. ‘నిన్నేపెళ్లాడతా’, ‘సింధూరం’, ‘చంద్రలేఖ’, ‘అంతపురం’.. ఇలా లవ్, ఫ్యామిలీ, నక్సలిజం, ఫ్యాక్షన్ లాంటి బ్యాక్‌డ్రాప్‌లతో చిత్రాలు తెరకెక్కించి ఆకట్టుకున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌కి స్ట్రాంగ్ పిల్లర్ వేసిన ఫిలిం ‘మురారి’.. సూపర్ నేచురల్ ఫ్యామిలీ డ్రామాగా వచ్చిన ఈ మూవీ తర్వాత.. దేశ భక్తి కధాంశంతో ‘ఖడ్గం’ తీశారు. కృష్ణవంశీ చేసిన అత్యుత్తమ దేశ భక్తి చిత్రాల్లో ఒకటిగా నిలిచింది ‘ఖడ్గం’..
మాస్ మహారాజా రవితేజ, వెర్సటైల్ యాక్టర్ ప్రకాష్ రాజ్, జూబ్లీ స్టార్ శ్రీకాంత్ లాంటి హీరోలు కనిపించిన మల్టీస్టారర్ ఇది. సంగీత, సోనాలీ బింద్రే, కిమ్ శర్మ ఫీమేల్ లీడ్స్.. ఉత్తేజ్, బ్రహ్మాజీ, షఫీ, ఆహుతి ప్రసాద్, పావలా శ్యామల, రఘుబాబు, ఎమ్.ఎస్.నారాయణ కీలకపాత్రల్లో నటించారు. కార్తికేయ క్రియేషన్స్ బ్యానర్ మీద సుంకర మధు మురళి నిర్మించిన ‘ఖడ్గం’ 2002 నవంబర్ 29న రిలీజ్ అయింది. 2022 నవంబర్ 29 నాటికి విజయవంతంగా 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం..
‘ఒక్క ఛాన్స్’ అంటూ అమాయకంగా అడిగిన సీతా మహాలక్ష్మీ..
దేశ భక్తి, లవ్, ప్యాషన్, ఎమోషన్స్ అన్నిటినీ బ్యాలెన్స్ చేస్తూ.. ఆద్యంతం ఆకట్టుకునేలా.. అందరికీ కనెక్ట్ అయ్యేలా.. నిజ జీవితంలో మన చుట్టూ ఉండే మనుషుల్లాంటి క్యారెక్టర్లతో కృష్ణవంశీ రూపొందించిన ‘ఖడ్గం’ సూపర్ హిట్ అయింది. సినిమా అవకాశాల కోసం ప్రయత్నించే కోటి (రవితేజ), డ్రైవర్‌గా పనిచేసే అంజాద్ (ప్రకాష్ రాజ్), సిన్సియర్ అండ్ కేపబులిటీ గల పోలీస్ ఆఫీసర్ రాధ కృష్ణ (శ్రీకాంత్) పాత్రలతో ప్రేక్షకులు లీనమైపోతారు.
‘ఒక్క ఛాన్స్’ అంటూ అమాయకంగా అడిగిన సీతా మహాలక్ష్మిని అంత త్వరగా మరచిపోలేం. రాధ కృష్ణ, స్వాతి (సోనాలీ బింద్రే)ల లవ్ ట్రాక్ హైలెట్. పూజా (కిమ్ శర్మ), అంజాద్లది మరో కథ.. మిగతా రోల్స్ అన్నీ ఆకట్టుకుంటాయి.. షఫీ విలనిజంతో పాటు రఘుబాబు, పృథ్వీ కనిపించేది కాసేపే అయినా అలరిస్తారు. ఈ మూవీలోని థర్టీ ఇయర్స్ డైలాగ్‌తోనే 30 ఇయర్స్ పృథ్వీగా మారిపోయాడాయన..
రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్.. పాటలు, బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా బాగా ఇచ్చాడు. ‘గోవిందా.. గోవిందా’.. ‘మేమే ఇండియన్స్’, ‘నువ్వు, నువ్వు’, ‘ముసుగు వెయ్యొద్దు మనసు మీద’, ‘అల్లరి అల్లరి చూపులతో’.. సాంగ్స్ అన్నీ సూపర్ డూపర్ సక్సెస్ అయ్యాయి.. ముఖ్యంగా ‘నువ్వు నువ్వు’ అంటూ సాగే ఫీల్ గుడ్ మెలోడీ పాటలో శ్రీకాంత్, సోనాలీ బింద్రేల కెమిస్ట్రీ కిరాక్ ఉంటుంది. ఇప్పటికీ యూత్ ఫేవరెట్ సాంగ్ ఇది. ఇక నేపథ్య సంగీతంతో రోమాలు నిక్కబొడుచుకునేలా చేశాడు దేవి..
టెక్నీషియన్స్..
పాపులర్ రైటర్ కమ్ యాక్టర్ ఉత్తేజ్ ఈ చిత్రానికి మాటలు రాశారు. సినిమా ఇండస్ట్రీ గురించి, హిందు, ముస్లింల ఐకమత్యం గురించి. దేశ భక్తితో పాటు పాకిస్థాన్ మీద ఆగ్రహాన్ని చూపించే సన్నివేశాల్లోనూ ఆయన సంభాషణలు హృదయానికి హత్తుకుంటాయి. భూపతి సినిమాటోగ్రఫీ, ఎ. శ్రీకర ప్రసాద్ ఎడిటింగ్, పి. రంగారావు ఆర్ట్ వర్క్ హైలెట్ అయ్యాయి.
అవార్డులు..
‘ఖడ్గం’ మొత్తం 5 నంది అవార్డులు.. 3 ఫిలిం ఫేర్ అవార్డులు అందుకుంది.. అలాగే హిందీలో అక్షయ్ కుమార్, అజయ్ దేవ్‌గణ్ లాంటి స్టార్లతో ‘ఇన్సాన్’ పేరుతో రీమేక్ అయింది. జాతీయ సమైక్యతా చిత్రంగా సరోజినీ దేవి అవార్డు (నిర్మాత మధు మురళి), ఉత్తమ దర్శకుడు, ఉత్తమ కళా దర్శకుడు (పి. రంగారావు ), ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ (కిషోర్), స్పెషల్ జ్యూరీ అవార్డ్ (రవితేజ) కేటగిరీల్లో నందులు వరించాయి.. బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ (సంగీత), బెస్ట్ విలన్ (షఫీ) కేటగిరీల్లో ఫిలింఫేర్ అవార్డులు వచ్చాయి..