Rishab Shetty: ‘కాంతారా’ హీరో రిషబ్ శెట్టి గురించి 10 ఆసక్తికర విషయాలు..!
October 19, 2022 / 12:21 PM IST
|Follow Us
కన్నడ సినిమా ఇండస్ట్రీ అంటే ఎందుకో జనాల్లో ఓ చిన్న చూపు ఉండేది. అందుకు కారణం కూడా లేకపోలేదు. వాళ్ళు ఎక్కువగా రీమేక్ సినిమాలే చేస్తుంటారు. రైట్స్ కొనుగోలు చేసుకోకుండా సినిమాలు రీమేక్ చేసుకునే వెసులుబాటు వారికి ఉంది. అలా అని వాళ్ళ సినిమాలు మిగిలిన వాళ్ళు ఫ్రీగా రీమేక్ చేయడానికి వీలు లేదు. వాళ్ళు రీమేక్ చేసే సినిమాలు కూడా తక్కువ బడ్జెట్ లోనే తీసేస్తారు.
పైగా ఒరిజినల్ లో ఉన్న నటీనటులను, గ్రాఫిక్స్ ను వాడేసుకుని తక్కువలోనే సినిమా తీసేస్తారు. అవి చూసి ఒకప్పుడు స్పూఫ్ లు అంటూ అవహేళన చేసేవి మిగిలిన పరిశ్రమలు. కొంతలో కొంత ఉపేంద్ర సినిమాలకు క్రేజ్ ఉండేది కానీ అక్కడి స్టార్ హీరో అయిన పునీత్ రాజ్ కుమార్, శివ రాజ్ కుమార్ ల డబ్బింగ్ సినిమాలు కూడా తెలుగులో అంతగా ఆడేవి కావు.
అయితే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ‘కె.జి.ఎఫ్'(సిరీస్) కన్నడ సినీ రంగంలో చాలా పద్దతులను మార్చింది. సౌత్ లో రూపొందే ఏ సినిమా అయినా సరే ఇది ఇండియన్ సినిమా అనుకునేలా సాయపడింది. ఈ ఏడాది ‘కె.జి.ఎఫ్2’ ‘777 చార్లీ’ ‘విక్రాంత్ రోణ’ వంటి కన్నడ సినిమాలు రిలీజ్ అయ్యి సూపర్ హిట్ సాధించాయి. తాజాగా మరో సినిమా ‘కాంతారా’ కూడా 4 రోజుల క్రితం రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ చిత్రం హీరో, దర్శకుడు అయిన రిషబ్ శెట్టి మొహం జనాలకు ఏమాత్రం తెలీదు.
అయినా సరే సినిమాలో అద్భుతంగా నటించాడు , అంతకంటే ఎక్కువగా సినిమాని బాగా తీశాడు. మేకింగ్ విషయంలో అసలు ఈ సినిమాకి పేరు పెట్టనవసరం లేదు. నటన కంటే ముఖ్యంగా డైరెక్షన్ ఇంత బాగా చేయడం అంటే మాటలు కాదు. సరే ఏమీ సాధించకుండా ఉంటే జనాలు ఎవ్వరినీ పట్టించుకోరు. అదే సక్సెస్ అయిన వ్యక్తి గురించి వద్దన్నా గూగుల్ ను అడిగి మరీ తెలుసుకుంటారు. ఇప్పుడు రిషబ్ శెట్టి గురించి తెలుసుకోవడానికి కూడా జనాలు గూగుల్ తల్లిని తెగ ఇబ్బంది పెట్టేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు ప్రేక్షకులకు ఏమాత్రం పరిచయం లేని ఈ రిషబ్ శెట్టి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం రండి :
1) రిషబ్ శెట్టి అసలు పేరు ప్రశాంత్ శెట్టి. కర్ణాటకలోని కుందాపూర్లో ఇతను జన్మించాడు. 1983 జూలై 7న ఇతను జన్మించాడు.
2) ఇతను హిందూ కుటుంబానికి చెందిన వ్యక్తే. రిషబ్ శెట్టి తండ్రి పేరు భాస్కర్ శెట్టి, తల్లి పేరు లక్ష్మీ శెట్టి. ఇతనికి ఓ సోదరుడు కూడా ఉన్నాడు. అతని పేరు ప్రవీణ్ శెట్టి.
3) రిషబ్ శెట్టి ఫిలిం డైరెక్షన్లో డిప్లొమో చేశాడు. మొదట్లో ఇతను కన్నడ దర్శకుడు ఎ.ఎం.ఆర్ రమేష్ వద్ద అసిస్టెంట్ గా పనిచేశాడు. అతను తెరకెక్కించిన ‘సైనైడ్’ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు.
4) అంతేకాకుండా పలు టీవీ సిరీస్ లకు కూడా ఇతను పనిచేసేవాడు. ఆ టైంలో ఇతని వద్ద డబ్బులు పెద్దగా ఉండేవి కాదట. ఇంట్లో వాళ్ళు ఈ పని మానేసి మంచి జాబ్ లో జాయిన్ అవ్వు అని సలహాలు ఇచ్చినా ప్యాషన్ కొద్దీ ఇతను సినిమా ఫీల్డ్ లో ఉండిపోయాడట.
5) 2010 లో ఇతను నటుడిగా మారాడు. ‘నామ్ ఓరీలీ ఒండినా’ చిత్రంలో క్రెడిట్ లేని రోల్ ప్లే చేశాడు. ఆ తర్వాత రక్షిత్ శెట్టి నటించిన ‘తుగ్లక్’ లో కూడా నటించాడు.
6) ఇలా చిన్న చితకా పాత్రలు చేసేది నామమాత్రంగానే..! కానీ ఇతనికి దర్శకత్వం పైనే మోజు ఎక్కువగా ఉండేది.ఓ పక్క సినిమాల్లో నటిస్తూనే మరో పక్క ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాడు. 2015 లో ఇతనికి రక్షిత్ శెట్టి అవకాశం ఇచ్చాడు.
7) ఇతని డైరెక్షన్లో వచ్చిన మొదటి సినిమా ‘రిక్కీ’ 2016 లో రిలీజ్ అయ్యింది. ఈ చిత్రంలో హరిప్రియ హీరోయిన్ గా నటించింది. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ పర్వాలేదు అనిపించింది.
8) ఆ తర్వాత చేసిన ‘కిరిక్ పార్టీ’ అయితే సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది.అప్పటి నుండి ఇతను వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని రాలేదు. ఈ చిత్రంలో కూడా రక్షిత్ శెట్టి హీరో కాగా, రష్మిక మందన ఈ మూవీతో సినీ రంగ ప్రవేశం చేసింది. ఇప్పుడు ఆమె నేషనల్ క్రష్ గా అవతరించిన సంగతి తెలిసిందే. అలాగే నటుడిగా రిషబ్ కు ‘బెల్ బాటమ్’ అనే చిత్రం మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ మూవీలో అతను చాలా బాగా నటించాడు. ఈ చిత్రానికి సీక్వెల్ కూడా రూపొందుతుంది.
9) రిషబ్ శెట్టి డైరెక్ట్ చేసిన మూడో చిత్రం ‘సర్కారి హిరియ ప్రాథమిక షాలే కాసరగోడు’. 2018 లో వచ్చిన ఈ చిత్రానికి ‘ఉత్తమ బాలల చిత్రం’ కేటగిరిలో రిషబ్ కు నేషనల్ అవార్డుని తెచ్చిపెట్టింది. ఈ మూవీకి నిర్మాత కూడా అతనే..!అంతేకాదు రిషబ్ కు ఫిలిం ఫేర్ అవార్డు, ఐఫా అవార్డు, సైమా అవార్డు కూడా లభించింది.
10) రిషబ్ ఓ తెలుగు సినిమాలో కూడా నటించాడు అన్న సంగతి ఎక్కువ మందికి తెలిసుండదు. ఈ ఏడాది తాప్సి ప్రధాన పాత్రలో వచ్చిన ‘మిషన్ ఇంపాజిబుల్’ చిత్రంలో ఖలీల్ పాత్రలో చిన్న కేమియో ఇచ్చాడు.
11) ఇక రిషబ్ కు 2017 లో పెళ్లయింది. ఇతని భార్య పేరు ప్రగతి శెట్టి. ఈ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.
12) రిషబ్ ప్రస్తుతం నిర్మాతగా ఒక సినిమా, దర్శకుడిగా రెండు సినిమాలు చేస్తున్నాడు. ఆల్రెడీ ఆ ప్రాజెక్టులను అధికారికంగా ప్రకటించాడు. అయితే ప్రస్తుతం ‘కాంతారా’ సక్సెస్ ను అతను ఎంజాయ్ చేస్తున్నాడు. రూ.16 కోట్లతో ఈ చిత్రాన్ని ‘కె.జి.ఎఫ్’ నిర్మాతలైన ‘హోంబేలె’ వారు నిర్మించగా ఒక్క కర్ణాటకలోనే రూ.100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.