60 సంవత్సరాల ‘శ్రీకృష్ణార్జునయుద్ధము’ గురించి ఆసక్తికర విషయాలు..!
January 9, 2023 / 08:10 PM IST
|Follow Us
నటరత్న ఎన్టీఆర్, నటసామ్రాట్ ఏఎన్నార్.. ఇద్దరూ తెలుగు చలనచిత్ర పరిశ్రమకి రెండు కళ్లు లాంటి వారు.. అలాంటి మహానటులిద్దరూ కలిసి నటిస్తే.. ప్రేక్షకాభిమానులకు రెండు కళ్లు చాలవు.. వీరిద్దరూ కలిసి పలు మల్టీస్టారర్ చిత్రాల్లో నటించారు.. ఎన్టీఆర్ పౌరాణిక, జానపదాల్లో ఊపు ఊపుతుండగా.. అక్కినేని సాంఘికాల్లో రాణిస్తున్న టైం అది.. అప్పుడు కె.వి.రెడ్డి దర్శకత్వంలో ‘శ్రీకృష్ణార్జునయుద్ధము’ చిత్రంలో కలిసి నటించారు.. ఎన్టీఆర్ శ్రీకృష్ణుడిగా, ఏఎన్నార్ అర్జునుడిగా నటించి ఆబాలగోపాలాన్నీ అలరించారు..
జయంతి పిక్చరు బ్యానర్ మీద కె.వి. రెడ్డి దర్శక నిర్మాతగా వ్యవహరించారు.. పింగళి మాటలు, పాటలు రాశారు.. స్వాములవారి వేషంలో ద్వారకకు వచ్చిన అర్జునుడికి.. అర్జునుడి దశ నామాలలో మొదటి అక్షరాలన్నిటినీ కలిపి ‘అజిబీధపఫావిశ్వేసకి’ అని పేరు పెట్టారంటేనే పింగళి వారి రచనా చాతుర్యం దానిలోని చమత్కారం అర్థం చేసుకోవచ్చు.. పెండ్యాల నాగేశ్వర రావు సంగీతమందించారు.. ఈ చిత్రానికి కమల్ ఘోష్ సినిమాటోగ్రాఫర్ కానీ ట్రిక్స్‌ను రవికాంత్ నగాయిచ్ సమకూర్చారు..
ఎన్టీఆర్ – ఏఎన్నార్ ఇద్దరిలో ఎవరి పేరు ముందు వెయ్యాలో తెలియక కె.వి.రెడ్డి ఏం చేశారంటే..
సినిమాలోని అన్ని పాటలూ, పద్యాలు ప్రేక్షకాదరణ పొందాయి.. ఇప్పటికీ వినిపిస్తుంటాయి కూడా.. ‘గయోపాఖ్యానం’ లోని పద్యాలను, ‘పారిజాతాపహరణం’ లోని పద్యాన్ని అవసరమైన చోట వాడడం జరిగింది.. ఇక టైటిల్స్ విషయానికొస్తే.. ఎన్టీఆర్ – ఏఎన్నార్ ఇద్దరిలో ఎవరి పేరు ముందు వేయాలో అర్థంకాక.. తారాగణం అని పడగానే.. శ్రీకృష్ణుడు, అర్జునుడు, సుభద్రల పాత్రలను చూపించి.. తర్వాత ఇతర నటీనటుల పేర్లు వేశారు.. లెెజెండరీ డైరెక్టర్‌గా పేరొందిన సింగీతం శ్రీనివాసరావు సహాయ దర్శకుడిగా పని చేశారు.. 13 కేంద్రాలలో శత దినోత్సవం, షిఫ్టుల వారీగా మరో రెండు కేంద్రాలు.. మొత్తం మీద 15 కేంద్రాలలో 100 రోజులు ప్రదర్శింపబడింది..
ఎన్టీఆర్ నటనదే పైచేయి..
తెరమీద శ్రీకృష్ణుడిగా ఎన్టీఆర్‌ని చూడగానే జనాలు హారతులిచ్చి, టెంకాయలు కొట్టేవారు.. ఎలా చూసుకున్నా సినిమాలో తారక రాముని నటనే పైచేయిగా సాగింది.. అందుకే సినిమా చూసిన తర్వాత ఏఎన్నార్ భార్య అన్నపూర్ణ.. ‘ఇక మీదట పౌరాణికాల్లో ఎన్టీఆర్ గారితో కలిసి నటించకండి’ అని చెప్పారట.. కారణాలేవైనా కానీ తర్వాత 14 సంవత్సరాల పాటు వీరిద్దరూ కలిసి నటించలేదు.. 1977లో ఎన్టీఆర్ దర్శకత్వం వహించిన ‘చాణక్య చంద్రగుప్త’ లో కలిసి నటించారు.. 1963 సంవత్సరం నటరత్నకు బాగా కలిసొచ్చింది.. ఆ ఏడాది విడుదలైన ‘లవకుశ’, ‘నర్తనశాల’ ‘బందిపోటు’ చిత్రాలు భారీ విజయాలు సాధించాయి..