Prema Pusthakam: ‘ప్రేమ పుస్తకం’ దర్శకుడు అకాల మరణం.. ఆ దర్శకుడు ఎవరి కొడుకంటే..!
January 5, 2023 / 12:03 PM IST
|Follow Us
అన్నీ మనం అనుకున్నట్టు జరిగితే దాన్ని జీవితం అని ఎందుకంటారు?.. మన స్టోరీని మనమే అందంగా రాసుకున్నా కానీ దానికి పైవాడు స్క్రీన్ప్లే మరోలా ఉంటుంది.. కొద్ది రోజుల్లో కల నెరవేరుతుంది అనగా అంతలోనే అంతు చిక్కని విషాదం అలుముకుంటుంది.. తెరమీద జనాలను అలరించే స్టార్ల జీవితాల్లో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు వాళ్లు కూడా మనలాంటి మనుషులే కదా అనిపిస్తుంటుంది.. అలాంటి ఓ విషాదమైన సంఘటన ప్రముఖ నటులు, రచయిత గొల్లపూడి మారుతీ రావు జీవితంలోనూ జరిగింది.
ఆయనకు ముగ్గురు కుమారులు.. ఇద్దరు కొడుకులకు సినిమాలపై ఆసక్తి లేదు కానీ మూడవ కొడుకు శ్రీనివాస రావుకి మాత్రం దర్శకత్వం అంటే చాలా ఇష్టం.. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు, కోడి రామకృష్ణ వంటి అగ్ర దర్శకుల వద్ద దర్శకత్వ శాఖలో అనుభవం సంపాదించిన తర్వాత ‘ప్రేమ పుస్తకం’ అనే చిత్రంతో శ్రీనివాస రావు దర్శకుడిగా పరిచయమయ్యారు.ఇప్పుడు తమిళనాట చక్రం తిప్పుతున్న తల అజిత్ కుమార్ ఈ మూవీతోనే తెలుగులో ఎంట్రీ ఇచ్చారు.
ఈ సినిమా గొల్లపూడి కథ, మాటలు ఇవ్వడం విశేషం.. శ్రీనివాస్ విశాఖపట్నంలో షూటింగ్ ఏర్పాటు చేశారు. బీచ్లో ఓ రాయిమీద, కథానాయికపై ఓ సన్నివేశాన్ని షూట్ చేయడానికి సిద్ధమవుతున్న క్రమంలో ఓ పెద్ద అల వచ్చింది. అలతో పాటు శ్రీనివాస్ రెప్పపాటుతో కనిపించలేదు. కొంతసేపటి తర్వాత శవమై కనిపించారు. ఊహించని ఈ పరిణామంతో యూనిట్ అంతా షాక్ అయ్యారు. గొల్లపూడి గారికి ఈ విషయం ఎలా చెప్పాలో ఎవరికీ అర్థం కాలేదు..
కొంత సేపటికి పోస్ట్ మార్టం కూడా అయిపోయిందని తెలియడంతో గొల్లపూడి శోకసంద్రంలో మునిగిపోయారు. శ్రీనివాస్ చనిపోయే నాటికి వివాహం జరిగి 9 నెలలయ్యింది.. ఆ ఘటన నుండి కోలుకోవడానికి చాలా సమయం పట్టిందాయనకి. కొంతకాలం తర్వాత ‘ప్రేమ పుస్తకం’ సినిమాని ఆయనే పూర్తి చేశారు. శ్రీనివాస్ రావు పేరు మీద ఫౌండేషన్ స్థాపించి ప్రతిభావంతులైన నటులకు పురస్కారాలను అందించారు. 2019 డిసెంబర్ 12న గొల్లపూడి అనారోగ్యంతో కన్నుమూశారు..