Nambi Narayanan: చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
August 3, 2022 / 02:30 PM IST
|Follow Us
‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’…. మాధవన్ ప్రధాన పాత్రలో రూపొందిన మూవీ. ఈ చిత్రాన్ని ఆయనే డైరెక్ట్ చేయడం కూడా జరిగింది. ఈ చిత్రానికి ఆయన ఓ నిర్మాతగా కూడా వ్యవహరించడం చెప్పుకోదగ్గ విషయం.జూలై 1న ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ అయ్యింది. కానీ బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ ఆశించిన స్థాయిలో పెర్ఫార్మ్ చేయలేదు. అయితే ఓటీటీలో రిలీజ్ అయ్యాక చాలా మంది ఈ మూవీని ఇష్టపడినట్లు సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.హీరో మాధవన్ పై కూడా ప్రశంసలు కురిపించారు. నంబి నారాయణన్ గారు ఎదుర్కొన్న పరిస్థితులు చూసి చాలా మంది కన్నీళ్లు పెట్టుకున్నట్టు కూడా సోషల్ మీడియాలో పేర్కొన్నారు నెటిజన్లు. ఇస్రో సైంటిస్ట్ గా ఉంటూ దేశానికి ఎంతో సేవ చేసిన నంబి నారాయణన్ గారిని ఎందుకు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు? ఆయన చేసిన నేరం ఏంటి? ఆయన కుటుంబం ఎలా సఫర్ అయ్యింది వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం రండి :
1) నంబి నారాయణన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి. 1941 డిసెంబర్ 12న తమిళనాడులో ఆయన జన్మించారు.వీరి తల్లిదంద్రులు కొబ్బరి పీచు వ్యాపారం చేసేవారు. ఐదుగురు బాలికల తర్వాత నంబి నారాయణన్ గారు పుట్టాడు. అందరికంటే చిన్నవాడైన నారాయణన్.. బాగా చదువుకునే వాడు. ఇంజనీరింగ్ పూర్తయ్యాక.. లోకల్ గా ఉండే షుగర్ ఫ్యాక్టరీలో ఆయన పనిచేశారు.
2) 1966లో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)లో నంబి నారాయణన్ చేరడం జరిగింది. తర్వాత అమెరికాలోని ప్రిన్స్టన్ యూనివర్సీటీలో రాకెట్ ప్రొపల్షన్ సిస్టమ్స్ చదివేందుకు ఆయన స్కాలర్షిప్ కూడా పొందారు.
3) ఈయనకు నాసాలో ఉద్యోగ వచ్చినప్పటికీ.. ఇస్రోలోనే చేరారు.ఈయనకి దేశభక్తి ఎక్కువగా ఉండడమే అందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవాలి. ఇక ఇస్రోలో విక్రమ్ సారాబాయి, సతీష్ ధావన్, అబ్దుల్ కలాం లాంటి ప్రఖ్యాత శాస్త్రవేత్తలతో కలిసి నంబి నారాయణన్ పనిచేశారు.
4) మన దేశానికి చెందిన రాకెట్లను అభివృద్ది చేసే ప్రాజెక్ట్‌లో నారాయణన్ చాలా ముఖ్య పాత్ర పోషించారు. ఈ క్రమంలో ప్యూయల్ టెక్నాలజీని ఇస్రోకు అందించాలని భావించారు. ఆ ఆలోచనల నుంచి పుట్టిందే ‘క్రయోజెనిక్ ఇంజిన్స్’.
5) ఇలాంటి టెక్నాలజీ మనకు అప్పట్లో అందుబాటులో లేదు. ఈ నేపథ్యంలో రష్యాతో రూ.235 కోట్లకు డీల్ ఫిక్స్ చేసుకుని ఈ టెక్నాలజీని దిగుమతి చేసుకోవాలనుకున్నారు. ఇందుకోసం ఆ దేశ ప్రధానులను సంప్రదించడం కూడా జరిగింది. సరిగ్గా ఇదే టైంలో ఎవ్వరూ ఊహించని విధంగా నంబి నారాయణన్ని పోలీసులు అరెస్ట్ చేశారు.1994 నవంబర్ 30న నంబిని కేరళ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది.
6) దానికి సరిగ్గా నెల రోజుల ముందు వీసా గడువు ముగిసిన తర్వాత కూడా భారత్‌లోనే ఉన్నారంటూ మాల్దీవులకు చెందిన మహిళ మరియమ్ రషీదా, ఫయూజియ్యా హసన్ లను పోలీసులు అరెస్టు చేశారు. వారిని విచారించగా ఆ మహిళలిద్దరు భారత రాకెట్ సాంకేతిక విషయాలను పాకిస్తాన్‌కు చేరవేస్తున్నారనే షాకింగ్ విషయం బయటపడింది.
7) మరియమ్ రషీదా, ఫయూజియ్యా హసన్ లకు ఇస్త్రోలో పని చేస్తున్న శాస్త్రవేత్తలు సహకరిస్తున్నారని మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ మహిళలు వేసిన వలలో నంబి నారాయణన్ కూడా ఉన్నారని కేరళ పోలీసులు అభియోగాలు మోపారు.
8) అంతే ఆయన పై దేశ ద్రోహం కేసు పెట్టి.. ఆయన్ని 50 రోజులు జైల్లో పెట్టి విచారణ పేరుతో నరకం చూపించారు. దేశం గర్వించదగ్గ సైంటిస్ట్ అంటూ రాసుకొచ్చిన మీడియానే ఆయన్ని దేశద్రోహి అంటూ గూఢచారి, దేశద్రోహి అంటూ టైటిల్స్ పెట్టి రాసుకొచ్చింది. ఆయన కుటుంబాన్ని కూడా జనాలు టార్గెట్ చేసి రాళ్లు విసరడం వంటివి చేసి చుక్కలు చూపించారు. ఛాన్స్ దొరికిన ప్రతీసారి ఆయన ఇంటిపై దాడి చేస్తూనే వచ్చారు.
9) దేశం కోసం భారీగా జీతం వచ్చే నాసా ఆఫర్‌ని కూడా నంబి వదులుకున్నారు. అలాంటిది తనని అరెస్ట్ చేయడం ఏంటి అనే కన్ఫ్యూజన్ కు నంబి వెళ్లిపోయారు. కేరళ పోలీసులు ఇతన్ని చిత్ర హింసలు పెట్టారు. అయినా ఆయన చేయని నేరం ఒప్పుకోలేదు.
10) నంబి అరెస్ట్ అయిన నెల రోజుల తర్వాత.. ఈ కేసు కేరళ ఇంటలిజెన్స్ బ్యూరో నుంచి సీబీఐకు బదిలీ అయ్యింది. 1995 జనవరి 19న నంబికి బెయిల్ మంజూరయ్యింది. సీబీఐ వారి విచారణలో నంబి నారాయణన్ ఎలాంటి తప్పు చేయలేదని బయటపడింది.
11) నంబి కేసు విషయంలో 1996 ఏప్రిల్‌లో కేరళ హైకోర్టుకు సీబీఐ తమ నివేదిక సమర్పించడం జరిగింది. ఇస్రోకు చెందిన సమాచారం పాకిస్తాన్‌కు వెళ్లినట్లు ఆధారాలు లేవు. అవి వట్టి అభియోగాలు అని తేలిపోయింది. దీంతో నంబి నారాయణన్‌తో పాటు మరో ఐదుగురికి కోర్టు క్లీన్చిట్ ఇవ్వడం జరిగింది. తర్వాత నంబి నారాయణన్ తిరిగి ఇస్రోలో చేరారు.
12) సీబీఐ ఈ కేసును మూసివేసినప్పటికీ.. అప్పటి కేరళ ప్రభుత్వం మళ్లీ తెరిచి విచారించాలని ప్రయత్నించింది. ఇందుకోసం..1998లో సుప్రీంకోర్టు మెట్లు ఎక్కింది కూడా.! కానీ దేశ అత్యున్నత న్యాయస్థానం వారి ప్రపోజల్ ను తిరస్కరించింది.
13) నంబి పై అక్రమంగా కేసు బనాయించి,అరెస్ట్ చేసి వేధించినందుకు గాను కేరళ ప్రభుత్వం పై ఆయన కేసు వేశారు.ఈ క్రమంలో నారాయణన్‌కు రూ.50 లక్షల రూపాయలు పరిహారంగా చెల్లించాలని సుప్రీంకోర్టు 2018లో ఆదేశించింది. తమ తప్పు తెలుసుకున్న కేరళ ప్రభుత్వం కోర్టు ఆదేశించిన దానికంటే రూ.1.3 కోట్లు అదనంగా ఇస్తామని 2019లో ప్రకటించింది. 2019లో భారత ప్రభుత్వం నారాయణన్ని ‘పద్మభూషణ్’తో సత్కరించడం జరిగింది.
14) అయితే నంబి నారాయణన్‌పై కుట్ర పన్నిందెవరనే విషయాలు ఇప్పటికీ మిస్టరీగానే ఉండటం గమనార్హం.
15) దీని వెనుక ఏదో రాజకీయ కుట్ర ఉండనే అనుమానాలు ఇప్పటికీ వ్యక్తమవుతూనే ఉన్నాయి.