Chiranjeevi: హీరోలు సైతం ఫైట్ చేయడానికి భయపడే విలన్.. ఇప్పుడేమైపోయినట్టు..!
October 16, 2021 / 01:46 PM IST
|Follow Us
తెలుగు ఇండస్ట్రీలో చిరంజీవి అప్పుడప్పుడే సుప్రీమ్ హీరో స్థాయి నుంచి మెగాస్టార్‌గా ఎదుగుతున్న రోజులవి. అలాంటి సమయంలో వచ్చింది పసివాడి ప్రాణం. మలయాళం సినిమాకు రీమేక్‌గా చిరంజీవికి బాగా కలిసొచ్చిన కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం ఆంధ్రదేశంలో అఖండ విజయం సాధించింది. అప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులను చెరిపేసి కొత్త ఇండస్ట్రీ హిట్‌గా అవతరించింది. చిరంజీవి, విజయశాంతి కెమిస్ట్రీ.. బాలనటి సుజీత పర్ఫార్మెన్స్.. ప్రతినాయకుడిగా రఘువరన్ విలనిజం అన్నీ కలిపి పసివాడి ప్రాణం సినిమాను బ్లాక్‌బస్టర్‌గా నిలబెట్టాయి. ఈ సినిమాలో చిరంజీవి బ్రేక్ డాన్సుల్ని ఆనాటి ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోలేరు.
అప్పటి వరకు డ్యాన్స్ అంటే ఏదో తూతూ మంత్రంగా హీరోలు చేస్తున్న రోజుల్లో తెలుగు ఆడియన్స్ చూడని భంగిమలను చూపించాడు మెగాస్టార్. 1987లో విడుదలైన పసివాడి ప్రాణం చిత్రం అప్పట్లోనే 4.8 కోట్ల షేర్ వసూలు చేసి పరిశ్రమను ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇక ఈ సినిమాలో రఘువరన్‌తో పాటు విలనిజాన్ని అద్భుతంగా పండించి.. కిరాయి హంతకుడిగా నటించిన వ్యక్తి బాబూ ఆంటోనీ. కేరళ రాష్ట్రానికి చెందిన ఈయన.. పసివాడి ప్రాణంతో పాటు జేబు దొంగ, శ్రతువు, మిత్రుడు, నిప్పురవ్వ, లారీ డ్రైవర్, ఏకలవ్యుడు, త్రినేత్రుడి వంటి సినిమాలతో తెలుగు వారికి బాగా దగ్గరయ్యారు ఆంటోనీ. హీరోలతో సమానంగా ఫైట్స్ చేసిన ఈయన.. రియల్ లైఫ్‌లో మార్షల్ ఆర్ట్స్ బ్లాక్ బెల్డ్ హోల్డర్.
శిరంబు అనే మలయాళ చిత్రంలో అడుగుపెట్టిన ఆంటోనీ తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విలన్‌గా దాదాపు 160 సినిమాల్లో నటించి మెప్పించారు. ఈయన తెలుగులో నటించిన చివరి సినిమా సునీల్ హీరోగా వచ్చిన కృష్ణాష్టమి. ఆ తర్వాత తెలుగు తెరకు దూరమైనా తమిళ్, మలయాళం భాషల్లో మాత్రం ఇంకా నటిస్తూనే వున్నాడు ఆంటోనీ. ఇటీవల అక్షయ్ కుమార్ హీరోగా నటించిన లక్ష్మీబాంబ్ సినిమాలో నటించిన ఆయన.. క్రియేటివ్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న పోన్నియన్ సెల్వన్ చిత్రంలో కూడా నటించబోతున్నాడు.