ఇప్పుడంటే పాన్ ఇండియన్ స్టార్స్, పాన్ ఇండియా సినిమాలు అంటూ మాట్లాడుకుంటున్నాం. నిజానికి మొట్టమొదటి పాన్ ఇండియా హీరో, స్టార్ గురించి చెప్పుకోవాలి అంటే కమల్ హాసన్ గురించి చెప్పుకోవాలి. ఈ పేరు గురించి ఎన్ని ఇంట్రొడక్షన్లు ఇచ్చినా తక్కువే. ఎంత పొగిడినా తక్కువే..! ఆరు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో టాప్ పొజిషన్లో కొనసాగుతున్న స్టార్ హీరోల్లో ఈయన కూడా ఒకరు. కాకపోతే ఈయనకి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. నటనతో మాయ చేస్తాడు. ఎంతో మంది నటీనటులకు స్ఫూర్తిగా నిలిచారు.
ఎన్నో ఛాలెంజింగ్ రోల్స్ ప్లే చేశారు. ఎటువంటి పాత్రలో అయినా పరకాయ ప్రవేశం చేసి ప్రేక్షకులను రంజింపగల గొప్ప నటుడు. కమల్ హాసన్ మన ఇండియా గర్వించదగ్గ నటుల్లో ప్రథమస్థానంలో ఉంటారు అనడం అతిశయోక్తి అనిపించుకోదు. ఇండియన్ సినిమాకి కొత్త కొత్త టెక్నిక్స్ నేర్పించిన వారిలో కూడా కమల్ ఉంటారు.
స్టార్ ఇమేజ్ ఉంది కదా అని ఓ మూస ధోరణిలో సినిమాలు చేసి జనాలను థియేటర్ కు రప్పించాలి, అలా తన స్టార్ ఇమేజ్ కాపాడుకోవాలి అని ఈయన ఎప్పుడూ అనుకోలేదు. అందుకే మనం ఈయన గురించి ఇంత గొప్పగా మాట్లాడుకుంటున్నాం. ఎవరైనా యాక్టింగ్ బాగా చేశారు అంటే బయట కూడా కమల్ హాసన్ లా యాక్ట్ చేశావ్ అంటుంటాం.ఆయన గొప్పతనం గురించి చెప్పడానికి అదొక్కమాట సరిపోతుంది. ఇదిలా ఉండగా.. కమల్ హాసన్ గురించి మనకు తెలియని గొప్ప విషయాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం రండి :
1) నవంబర్ 7, 1954లో తమిళనాడు రాష్ట్రం రామనాథపురం జిల్లాలోని పరమక్కుడి లో శ్రీనివాసన్, రాజ్య లక్ష్మి దంపతులకు నాలుగో సంతానంగా కమల్ జన్మించారు. ఈయనఅసలు పేరు పార్థసారథి శ్రీనివాసన్..!
2) 4 ఏళ్ళ వయసులోనే నటించడం ప్రారంభించారు. ‘కలత్తూర్ కన్నమ్మ’ అనే చిత్రంతో ఈయన తెరంగేట్రం చేశారు. అంతేకాదు మొదటి చిత్రంతోనే ఈయన ప్రెసిడెంట్ మెడల్ అందుకోవడం విశేషంగా చెప్పుకోవాలి.
3) ఆ తర్వాత కూడా ఎం.జి.రామచంద్రన్,శివాజీ గణేషన్,నాగేష్,జెమినీ గణేష్ వంటి వారు నిర్మించిన చిత్రాల్లో బాల నటుడుగా నటించారు.
4) కమల్ హాసన్ లో నటుడు మాత్రమే కాదు డైరెక్టర్, స్క్రిప్ట్ రైటర్, ప్రొడ్యూసర్, ప్లే బ్యాక్ సింగర్, లిరిసిస్ట్, కొరియోగ్రాఫర్, డ్యాన్స్ మాస్టర్ కూడా ఉన్నారు.
5) కమల్ హాసన్ తమిళ్ తో పాటు తెలుగు, ఇంగ్లీష్, మలయాళం,హిందీ, కన్నడ, బెంగాలీ, ఫ్రెంచ్ భాషాలను కూడా మాట్లాడగలరు.
6) తమిళ్ తో పాటు తెలుగు,హిందీ, మలయాళం, కన్నడ, బెంగాలీ వంటి 6 భాషల్లో సినిమాలు చేసి.. 5 భాషల్లో సిల్వర్ జూబ్లీ సినిమాలను అందించిన నటుడిగా కమల్ హాసన్ నిలిచారు.
7) కమల్ హాసన్ నటించిన 7 చిత్రాలు ఆస్కార్ నామినేషన్స్ కు పంపబడ్డాయి.
8) తన అభిమాన సంఘాలను సమాజానికి సేవ చేసే సేవా సంస్థలుగా మార్చిన మొట్ట మొదటి నటుడు కమల్ హాసన్. తన అభిమానుల ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.ఆయన పుట్టిన రోజున ఆయన అభిమానులంతా రాష్ట్ర వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు.
9) 1990 వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం కమల్ హసన్ ను పద్మశ్రీ బిరుదుతో గౌరవించింది 2005 వ సంవత్సరంలో మద్రాసు లోని సత్యభామ విశ్వవిద్యాలయం కమల్ కు గౌరవ డాక్టరేటు ప్రదానం చేసింది. 2014లో కేంద్రప్రభుత్వం పద్మ భూషణ్ పురస్కారాన్ని కూడా ప్రకటించింది.
10) కమల్ హాసన్ 19 ఫిలింఫేర్ అవార్డులను అందుకున్నారు. 2000వ సంవత్సరంలో ఫిలింఫేర్ కమిటీకి ఈయన ‘ఇక పై తనకి అవార్డు ఇవ్వొద్దు’ అంటూ ఓ లేఖ రాయడం కూడా జరిగింది.
11) 1988 నుండీ 1998 వరకు అత్యధిక పారితోషికం తీసుకునే నటుడిగా రికార్డుకెక్కారు. మొదటి రూ.1 కోటి రూపాయల పారితోషికం అందుకున్న హీరోగా కూడా ఇతను రికార్డులకెక్కాడు.
12) కమల్ హాసన్ ట్యాక్స్ కరెక్ట్ గా చెల్లిస్తున్నారు అనే కారణంతో ఈయన్ని ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ కూడా సత్కరించడం జరిగింది.
13) కమల్ హాసన్ తన అవయవాలు అన్నిటినీ డొనేట్ చేశారు అన్న విషయం బహుశా తక్కువ మందికే తెలిసుండొచ్చు.