మొదటి పాన్ ఇండియా ‘శాంతి క్రాంతి’ గురించి తెలుసా?
May 5, 2022 / 02:52 PM IST
|Follow Us
పాన్ ఇండియా… ఇప్పుడు ఇదో ఇంట్రెస్టింగ్ పదం. నేటి తరం సినిమా గోయర్స్ అయితే ‘పాన్ ఇండియా’ సినిమాలు మా తరంలోనే వచ్చాయి అని అనుకుంటుండొచ్చు. అయితే పాన్ ఇండియా హీరోలు వచ్చింది ఇప్పుడు కాదు. సుమారు 20 ఏళ్ల క్రితమే వచ్చారు అని తెలుసా? అంతేకాదు పాన్ ఇండియా సినిమాలు కూడా అప్పటి నుండే ఉన్నాయి. అలాంటి ఓ సినిమా గురించి ఈ రోజు చూద్దాం. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా మేం చెప్పేది నిజమే.
1990ల కాలంలో భారీ యాక్షన్ సినిమాలు ఎక్కువగా వచ్చేవి. మాస్ హీరోల నుండి ఈ సినిమా ఏడాదికి ఒకటి పక్కా అని అనుకునేవారు. ఆ సమయంలోనే కన్నడ హీరో/డైరక్టర్ వి.రవిచంద్రన్ ‘శాంతి క్రాంతి’ అనే సినిమా ప్లాన్ చేశారు. అప్పుడు దీనికి పాన్ ఇండియా అనే పేరు లేదు కానీ.. ఇది కచ్చితంగా పాన్ ఇండియా ప్రాజెక్టే. ఎందుకంటే ఈ సినిమాను తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ఏక కాలంలో రూపొందించారు. అయితే ఆ నాలుగు భాషలకు ముగ్గురు హీరోలు. ఇద్దరు హీరోయిన్లు.
కన్నడలో వి.రవిచంద్రన్… తెలుగులో నాగార్జున… తమిళ, హిందీలో రజనీకాంత్ హీరోలుగా వి.రవించంద్రన్ ఈ సినిమా తెరకెక్కించారు. నాలుగు భాషల్లో వేర్వేరుగా ఏకకాలంలో షూటింగ్ చేశారు. అన్ని భాషల్లో జుహీ చావ్లా, ఖుష్బూనే హీరోయిన్లు. సినిమా ప్రారంభం అయితే ఘనంగా సాగింది, ఆ తర్వాత షూటింగ్లో కూడా బలంగానే ఖర్చు పెట్టారు. సొంత నిర్మాణ సంస్థ కాబట్టి ఆ విషయంలో ఎక్కడా వెనకడుగు వేయలేదు రవిచంద్రన్.
అయితే సినిమా ఓ దశకొచ్చిన తర్వాత బడ్జెట్ ఇబ్బందులు పడ్డాయి. ‘చినతంబి’ (తెలుగులో ‘చంటి’) సినిమాను కన్నడలో ‘రామాచారి’గా తెరకెక్కించి విడుదల చేసి మంచి విజయం అందుకున్నారు. ఆ డబ్బులతోనే ‘శాంతి క్రాంతి’ని తిరిగి పూర్తి చేశారు. అలా చాలా ఇబ్బందులు పడుతూ పూర్తి చేసిన ఆ సినిమా బాక్సాఫీసు దగ్గర దారుణ పరాజయం పాలైంది. నాలుగు భాషల్లోనూ ఇదే పరిస్థితి. కొన్ని సన్నివేశాల్లో నేలవిడిచి సాము చేయడంతో ఆ ఫలితం వచ్చింది అని అప్పటి సినీ గోయర్స్ అంటుంటారు.
అన్నట్లు ‘కేజీయఫ్’లో రాకీ భాయ్ కథను చెప్పిన అనంత్ నాగ్ ‘శాంతి క్రాంతి’ మెయిన్ విలన్. ఆ లెక్కన పాన్ ఇండియా భారతీయ సినిమాకు, సౌత్ సినిమాకు కొత్తేం కాదు. ఇప్పుడు దాన్ని ఓ పదంగా పెట్టుకొని హైప్ తీసుకొస్తున్నారు. ఇప్పటి సినిమాల్ని తక్కువ చేయడం లేదు కానీ, ఇంతకుముందే వచ్చాయి అని చెబుతున్నామంతే.