టాలీవుడ్ లో ఉన్న అగ్ర నిర్మాణ సంస్థల్లో యూవీ క్రియేషన్స్ ఒకటి. ఈ బ్యానర్ లో భారీ బడ్జెట్ సినిమాలను నిర్మిస్తుంటారు. ప్రభాస్ హీరోగా ‘సాహో’ లాంటి భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రాన్ని నిర్మించింది వీళ్లే. ప్రస్తుతం ‘రాధేశ్యామ్’ అనే మరో భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూలైలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. అయితే ఈ సినిమా తరువాత యూవీ క్రియేషన్స్ నిర్మాతలు పూర్తిగా రూటు మార్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ‘రాధేశ్యామ్’ తరువాత కొన్నాళ్లు భారీ బడ్జెట్ సినిమాలు ఆపేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
ప్రస్తుతం యూవీ క్రియేషన్స్ చేపట్టిన ప్రాజెక్ట్స్ చూస్తుంటే.. మరో రెండేళ్ల పాటు వీళ్ల నుండి భారీ బడ్జెట్ సినిమా వచ్చే ఛాన్స్ లేదనిపిస్తుంది. అనుష్క ప్రధాన పాత్రలో ఓ సినిమా ప్లాన్ చేశారు ఈ నిర్మాతలు. నవీన్ పోలిశెట్టి నటిస్తోన్న ఈ సినిమాను మీడియం బడ్జెట్ లో తెరకెక్కించనున్నారు. అలానే గోపీచంద్ హీరోగా దర్శకుడు మారుతి రూపొందిస్తోన్న ‘పక్కా కమర్షియల్’ సినిమాను గీతాఆర్ట్స్ 2 తో కలిసి నిర్మిస్తున్నారు. ఇది కూడా మీడియం బడ్జెట్ సినిమానే.
ఈ సినిమాలతో పాటు సంతోష్ శోభన్ హీరోగా ‘ఏక్ మినీ కథ’ అనే సినిమా చేస్తున్నారు. ఇదొక లో బడ్జెట్ సినిమా అని తెలుస్తోంది. అలానే లైన్ లో నితిన్, కార్తికేయ లాంటి హీరోలున్నారు. ఈ ఇద్దరు హీరోలతో చేసే సినిమాలు మోస్తరు బడ్జెట్ తో నిర్మించనున్నారు. ఈ విధంగా చూస్తుంటే యూవీ క్రియేషన్స్ నుండి ‘రాధేశ్యామ్’ తరువాత కొన్నాళ్లపాటు భారీ సినిమాలు రావనిపిస్తుంది. ‘రాధేశ్యామ్’ గనుక భారీ వసూళ్లను రాబడితే ఆలోచన మార్చుకుంటారేమో చూడాలి!