Veera Simha Reddy Review: వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
January 12, 2023 / 09:11 AM IST
|Follow Us
Cast & Crew
నందమూరి బాలకృష్ణ (Hero)
శ్రుతిహాసన్, హాని రోజ్ (Heroine)
దునియా విజయ్ (Cast)
గోపీచంద్ మలినేని (Director)
నవీన్ ఎర్నేని - రవిశంకర్ (Producer)
తమన్ (Music)
రిషి పంజాబీ (Cinematography)
“అఖండ” ఘన విజయం అనంతరం నందమూరి బాలకృష్ణ టైటిల్ పాత్రలో తెరకెక్కిన చిత్రం “వీరసింహారెడ్డి”. “క్రాక్”తో క్రేజీ హిట్ అందుకున్న గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ట్రైలర్ కూడా మాస్ ఆడియన్స్ కు మంచి ఫీస్ట్ లా ఉంటుందనే ఆశలు రేకెత్తించింది. మరి ఈ ఫ్యాక్షన్ సినిమా ఆడియన్స్ ను ఏమేరకు అలరించిందో చూద్దాం..!!
కథ: ఇస్తాంబుల్ లో రాయలసీమ వంటకాలు వండే హోటల్ బిజినెస్ మరియు ఆటోమొబైల్ బిజినెస్ చేస్తూ.. తల్లితో కలిసి సంతోషంగా బ్రతుకుతుంటాడు జయ సింహా రెడ్డి (బాలకృష్ణ). తొలిచూపులోనే ఇష్టపడిన ఈష (శ్రుతిహాసన్) తల్లిదండ్రులతో పెళ్లి సంబంధం మాట్లాడడం కోసం కర్నూలు లోని పులిచర్ల గ్రామ పెద్ద, తండ్రి అయిన వీర సింహా రెడ్డి (రెండో బాలకృష్ణ) ఇస్తాంబుల్ వస్తాడు.
ఎప్పట్నుంచో వీరసింహారెడ్డిని చంపడం కోసం ప్లాన్ చేస్తున్న ప్రతాప్ రెడ్డి (దునియా విజయ్) కూడా తన గ్యాంగ్ తో ఇస్తాంబుల్ వెళ్ళి.. అక్కడ వీరసింహారెడ్డితో తలపడతాడు.
అనంతరం ఏం జరిగింది? వీరసింహారెడ్డి-ప్రతాప్ రెడ్డిల నడుమ వైరం ఏమిటి? అందుకు కారణం ఎవరు? ఈ కథలో భానుమతి (వరలక్ష్మి శరత్ కుమార్) పాత్ర ఏమిటి? వంటి ప్రశ్నలకు సమాధానమే “వీరసింహారెడ్డి” కథాంశం.
నటీనటుల పనితీరు: తండ్రిగా, కొడుకుగా ద్విపాత్రాభినయంలో బాలకృష్ణ జీవించేశాడు. జయ సింహా రెడ్డిగా యంగ్ గా కనిపించడానికి కాస్త ఇబ్బందిపడినా.. వీరసింహారెడ్డిగా మాత్రం వెండితెరపై వీరంగం ఆడేశాడు బాలయ్య. ముఖ్యంగా వీరసింహారెడ్డిగా బాలయ్య చేసిన యాక్షన్ సీన్స్ & డైలాగులు మాస్ ఆడియన్స్ & బాలయ్య ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్. ఇస్తాంబుల్ లో యాక్షన్ సీక్వెన్స్ కాస్త అతి అయినప్పటికీ.. ఎమోషన్ తో సదరు సీన్ ను నెట్టుకొచ్చాడు బాలయ్య.
వరలక్ష్మీ శరత్ కుమార్ కు తన టాలెంట్ ను పూర్తిస్థాయిలో ప్రదర్శించే పాత్ర లభించింది. భానుమతి క్యారెక్టర్ కు ఆమె ప్రాణప్రతిష్ట చేసింది.
మలయాళ నటి హనీ రోజ్.. ఫస్టాఫ్ లో నటనతో, సెకండాఫ్ లో గ్లామర్ తో అలరించింది. కన్నడ నటుడు దునియా విజయ్ సింగిల్ ఎక్స్ ప్రెషన్ తో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. అతడి విలనిజం కూడా పెద్దగా పండలేదు.
శ్రుతిహాసన్ రెండు పాటలు, మూడు సన్నివేశాలకు పరిమితం అయిపోయింది. బాలయ్యతో కెమిస్ట్రీ పెద్దగా వర్కవుటవ్వలేదు.
సాంకేతికవర్గం పనితీరు: తమన్ ఈ సినిమాకి సెకండ్ హీరో ని చెప్పాలి. చాలా పేలవమైన సన్నివేశాలను కూడా తనదైన బ్యాగ్రౌండ్ స్కోర్ తో ఎలివేట్ చేశాడు. ఇక యాక్షన్ సీన్స్ కి తమన్ నేపధ్య సంగీతం తొడవ్వడంతో.. థియేటర్లలో పూనకాలే. పాటలు కూడా పర్వాలేదు అనేలా ఉన్నాయి.
రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ కంపోజ్ చేసిన యాక్షన్ బ్లాక్స్ మాస్ ఆడియన్స్ మెచ్చే విధంగా ఉన్నాయి. ముఖ్యంగా పెళ్లిల పందిరిలో ఫైట్ సీన్స్ & మైన్ లో కుర్చీ ఫైట్ సీన్ హైలైట్స్ గా నిలుస్తాయి.
సాయిమాధవ్ బుర్రా మాటలు చాలా పదునుగా ఉన్నాయి. కొన్ని చోట్ల ప్రాసల కోసం ప్రాకులాడిన.. రాజకీయంగా అపోజిషన్ మీద వేసిన పంచ్ డైలాగులకు మాత్రం థియేటర్ రెస్పాన్స్ అదిరిపోయింది. సదరు సన్నివేశం మరియు డైలాగుల విషయంలో రాజకీయ రచ్చ జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా “వాళ్ళు ప్రజలు ఎంచుకున్న వెధవలు” అనే డైలాగ్ చర్చలకు దారి తీసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
రిషి పంజాబీ సినిమాటోగ్రఫీ వర్క్ & ప్రొడక్షన్ డిజైన్ చాలా లావిష్ గా ఉన్నాయి. సినిమాకు అవసరమైన దాని కంటే ఎక్కువగానే ఖర్చు చేశారని అర్ధమవుతుంది.
గోపీచంద్ మలినేని దర్శకుడిగా యాక్షన్ సీన్స్ & హీరో ఎలివేషన్స్ తో తన సత్తా ఘనంగానే చాటుకున్నాడు కానీ కథకుడిగా మాత్రం చతికిలపడ్డాడు. ఎంత 80ల నాటి కథ అయినప్పటికీ.. ఎమోషన్ ఎలివేట్ చేయడం అనేది ముఖ్యం. ఆ విషయంలో మాత్రం గోపీచంద్ విఫలమయ్యాడు. బాలకృష్ణ చనిపోయే సన్నివేశం కానీ, వరలక్ష్మీ క్యారెక్టర్ జస్టిఫికేషన్ కానీ సరిగా ఎలివేట్ చేయలేకపోయాడు. అలాగే సిస్టర్ సెంటిమెంట్ ను మూల కథగా మలిచిన విధానం ఆకట్టుకోలేకపోయింది.
విశ్లేషణ: బాలయ్య నటన, తమన్ బీజీయమ్ కోసం సంక్రాంతి సెలవుల్లో సరదాగా కుటుంబంతో కలిసి చూడాల్సిన సినిమా ‘వీరసింహారెడ్డి’. బాలయ్య ఫ్యాన్స్ & యాక్షన్ సీన్స్ ఎంజాయ్ చేసే ఆడియన్స్ కు ఈ చిత్రం ఫుల్ మీల్స్.
రేటింగ్: 3/5
Rating
3
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus