Archana: తెలుగు కథలు వస్తుండేవి.. నేనే వద్దనుకున్నా: అర్చన
June 22, 2022 / 01:05 PM IST
|Follow Us
ఓ హీరోయిన్ 25 ఏళ్ల తర్వాత ఇండస్ట్రీకి వస్తోంది అనగానే.. ఠక్కున అర్చననే కదా అని అడిగేస్తారు మూవీ బఫ్స్. అంతగా ఆమె గురించి, ఆమె నటించిన సినిమా గురించి ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. రీఎంట్రీలో మంచి అమ్మ పాత్రలు, వదిన పాత్రలు, అత్త పాత్రలు చేస్తారేమో అని కోరుకునేవాళ్లూ ఉన్నారు. కానీ ఆమె ప్రేమకథలు చేస్తాను అని చెప్పి షాక్ ఇచ్చారు. ఇప్పుడు ఆమె కామెంట్స్ వైరల్‌గా మారాయి. అర్చన సినిమాల్లో నటనకు దూరంగా ఉన్నా… సినిమాకు ఎప్పుడూ దూరంగా లేరు.
వివిధ చలనచిత్రోత్సవాల్లో మన దేశం తరఫున ప్రతినిధిగా హాజరవుతున్నారు. ఇప్పుడు కథ నచ్చి ‘చోర్ బజార్’ చేశారు. ఆ సినిమా ఈ నెల 24న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘‘కథానాయికల కెరీర్ చిన్నది. ఓ దశ దాటాక నాయికగా నటించిన హీరోల సరసనే అక్క, వదిన, అమ్మ పాత్రలు చేయాలి. వాళ్లకు సొంత ఆలోచనలు, కోరికలు, లక్ష్యాలు ఉండవా. ఈ కోణంలో సినిమాల్లో పాత్రలు సృష్టిస్తే బాగుంటుంది’’ అన్నారు.
నేను మొదటి నుండీ కథా బలమున్న చిత్రాల్లోనే నటించాను. ఓ దశ తర్వాత ఆడవాళ్లకు సరైన పాత్రలు దొరకలేదు. నా దర్శకులు, గురువులు నన్ను ఓ స్థాయిలో పెట్టారు. దానికోసం వాళ్లెంతో కష్టపడ్డారు. అలాంటప్పుడు ఆ స్థాయిని నేనెలా పాడుచేసుకుంటా. అందుకే మంచి కథ దొరికినప్పుడే తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో చేస్తూ వచ్చా. అలా అని తెలుగుకు నేనేమీ దూరంగా లేను. తరచుగా తెలుగు కథలు వస్తుండేవి. అయితే నచ్చక నేనే వద్దనుకున్నా.
అలా చాలా పెద్ద సినిమాలే వదులుకున్నాను అని చెప్పారు అర్చన. బెంగాళీ, మరాఠీ భాషల్లో మహిళలకు వైవిధ్యమైన పాత్రలు ఎక్కువగా దక్కుతున్నాయి. అక్కడ నా వయసున్న నాయికలు ఇంకా లవ్ స్టోరీల్లో నటిస్తున్నారు. కొంతమంది అయితే బోల్డ్ సీన్స్‌లో కూడా చేస్తున్నారు. మంచి కథలు దొరికితే నాకూ అలాంటి పాత్రలు చేయాలని ఉంది. అర్చన అంటే గర్ల్ నెక్స్ట్ డోర్ అనే ఇమేజ్ ఉంది. దాన్ని కొనసాగిస్తూనే అన్ని రకాల సినిమాలు చేయాలని ఉంది.