Kushi: అంత ఈజీ కాదు కానీ బాగా చేశారు: పరుచూరి మార్కు రివ్యూ
October 16, 2023 / 11:33 PM IST
|Follow Us
తెలిసిన కథనే కొత్తగా చూపిస్తే జనాలు చూస్తార అనడానికి తాజా నిదర్శనం ‘ఖుషి’. విజయ్ దేవరకొండ – సమంత ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకుడు. ఈ సినిమా సెప్టెంబరు మొదట్లో వచ్చి మంచి టాకే తెచ్చుకుంది. అయితే వసూళ్ల విషయంలో ఓ ప్రాంతంలో నిరాశజనకమైన ఫలితాలు సాధించింది అని టాక్. ఆ విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నా… సినిమా గురించి పరుచూరి గోపాలకృష్ణ ఏం చెబుతారు అనే ప్రశ్నకు తెరపడింది.
తెలుగు సినిమాలకు లాస్ట్ రివ్యూలు ఇవ్వడం ఆయన ప్రత్యేకత. సినిమా థియేటర్లలో, ఓటీటీల్లో మెయిన్ రన్ అయిపోయాక సినిమా గురించి తన అభిప్రాయాన్ని చెబుతుంటారు ఆయన. అలా ఇటీవల ‘ఖుషి’ సినిమా గురించి తన మనసులో మాట చెప్పారు. విభిన్న కుటుంబ నేపథ్యాలు ఉన్న రెండు కుటుంబాల్లోని పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకున్న ఓ జంట ఆ తర్వాత ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు అనే కథతో ‘ఖుషి’ తెరకెక్కిన విషయం తెలిసిదే.
పెళ్లయ్యాక ఆ జోడీ.. తమ పెద్దల మనస్తత్వాలను ఎలా మార్చారనే ఆసక్తికర అంశంతో ఈ సినిమాను శివ నిర్వాణ తెరకెక్కించారు. ఇదొక అద్భుతమైన కథ అని చెప్పిన పరుచూరి గోపాలకృష్ణ… ఇంకా మరికొన్ని విషయాలు చెప్పుకొచ్చారు. ‘ఖుషి’ సినిమా అనగానే విజయ్, పవన్ కల్యాణ్ సినిమాలు గుర్తుకు వస్తాయని… కానీ ఈ సినిమాను (Kushi) వాటికి ఏ మాత్రం దగ్గరగా కాకుండా కొత్త ఆలోచనతో తీశారని చెప్పారు.
ప్రేమకు ముందు.. ప్రేమలో ఉన్నప్పుడు.. పెళ్లి అయ్యాక అనే మూడు కాన్సెప్ట్‌లను సినిమాలో చూపించారని వివరిస్తూ… ఇదొక పాజిటివ్ ఫిల్మ్ అని మెచ్చుకున్నారు. ఒక అబ్బాయి – అమ్మాయి కథలా ఈ చిత్రాన్ని చెబుతూనే అబ్బాయి తండ్రీ – అమ్మాయి తండ్రీ కథగానూ తెరకెక్కించారు అని చెప్పారు. అయితే సెకండాఫ్‌లో కాస్త లాగ్ ఉందని కూడా తెలిపారు. ఈ సినిమా కథ చిన్నదే కానీ దాన్ని దాదాపు 2.40 గంటలు నడిపించడం సులభం కాదని, దర్శకుడు ఆ పని చేసి మెప్పించారని తెలిపారు.