ట్రోలింగ్ దెబ్బకి యూట్యూబ్ లో సాంగ్ డిలీట్ చేసిన విజయ్
July 27, 2018 / 04:29 AM IST
|Follow Us
నటనతో అలరించడం వేరు, పాటతో పులకరింపజేయడం వేరు. సినిమాలో రెండున్నర గంటలసేపు ఏదో ఒకటి చేసి ఆకట్టుకోవచ్చేమో కానీ.. అయిదు నిమిషాల పాట విషయంలో మాత్రం ఎలాంటి జిమ్మీక్కులు పనికిరావు. లిరిక్స్ ఎంత అద్భుతంగా ఉన్నా.. ఆ లిరిక్స్ శ్రోతలను ఆకట్టుకోనేలా చేయాల్సిన గళం బాగోకపోతే మాత్రం ఆ పాట అటకెక్కినట్లే. అలా ఇప్పుడు అటకెక్కిన తాజా పాట “What the F”. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా తెరకెక్కుతున్న “గీత గోవిందం” సినిమాలోని ఒక పాటను విజయ్ స్వయంగా పాడాడు, శ్రీమణి లిరిక్స్ అందించిన ఈ పాట నిన్న ఉదయం విడుదలైంది.
అయితే.. ఫైన్ ట్యూనింగ్ చేయకపోవడం వల్లనో ఏమో కానీ ఎవ్వరూ ఎక్స్ పెక్ట్ చేయనట్లుగా ఈ పాటలో విజయ్ దేవరకొండ గొంతు ఏదో కంకరు రోడ్డు మీద తారుడబ్బాతో గీకినట్లుగా వినబడింది. దాంతో.. సాధారణ శ్రోతలు మాత్రమే కాదు విజయ్ దేవరకొండ వీరాభిమానులు కూడా “ఎందుకు సార్ మా మీద హత్యా ప్రయత్నాలు” అంటూ సోషల్ మీడియాలో వీరలెవల్లో ట్రోలింగ్ చేశారు. సాధారణంగా ఈ తరహా ట్రోలింగ్ ను పబ్లిసిటీ కోసం ఉపయోగించుకొనే విజయ్ విజయ్ దేవరకొండ పాపం తన హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా ట్రోల్ చేయడంతో బాగా ఫీలైనట్లున్నాడు. అందుకే అర్జెంట్ గా ఆ పాటను యూట్యూబ్ నుంచి రిమూవ్ చేయించాడు. ప్రస్తుతం ఆ పాట యూట్యూబ్ లో కనిపించడం లేదు, అయితే.. సావన్ లాంటి మ్యూజిక్ యాప్స్ లో మాత్రం ఆ పాట ఇంకా అందుబాటులో ఉంది. మరి ఆ పాటను మళ్ళీ ఎవరితోనైనా పాడిస్తారో లేదా అనేది సినిమా విడుదలవరకూ వెయిట్ చేసి తెలుసుకోవాల్సిన విషయం.