కృష్ణ, విజయ నిర్మల ఇద్దరికీ కలగానే మిగిలిపోయిన ఆ పాన్ ఇండియా ఫిలిం ఏదంటే..?
February 17, 2023 / 01:18 PM IST
|Follow Us
నట శేఖర, సూపర్ స్టార్ కృష్ణ.. తెలుగు సినిమాకి ఆయన చేసిన సేవలు ఎనలేనివి.. నటుడిగానే కాకుండా.. దర్శక నిర్మాత, స్క్రీన్‌ప్లే రైటర్, ఎడిటింగ్, స్టూడియో అధినేతగా సత్తా చాటిన బహుముఖ ప్రజ్ఞాశాలి.. ఫస్ట్ కౌబాయ్, జేమ్స్ బాండ్, తొలి సినిమా స్కోప్, 70 ఎమ్ఎమ్, డీటీఎస్, సినిమా స్కోప్ వంటి సాంకేతికతను తెలుగు చిత్ర రంగానికి పరిచయం చేశారు.. నటరత్న ఎన్టీఆర్ ‘అల్లూరి సీతా రామ రాజు’ మూవీ చేయాలని సందేహిస్తుండగానే.. చేసి చూపించి.. తెలుగు ప్రేక్షకాభిమానుల చేత శభాష్ అనిపించుకున్నారు..
100వ చిత్రం ‘అల్లూరి సీతా రామ రాజు’ (1974), 200వ సినిమా ‘ఈనాడు’ (1982), 300వ మూవీ ‘తెలుగు వీర లేవరా’ (1995) తో సంచలనం సృష్టించారు సూపర్ స్టార్.. ‘సింహాసనం’ లో నటించి దర్శకత్వం వహిస్తూ.. తెలుగుతో పాటు ఏకకాలంలో హిందీలోనూ తెరకెక్కించిన డేర్ అండ్ డాషింగ్ హీరో కృష్ణ.. విజయ నిర్మల దర్శకత్వంలో ఆయన పలు విజయవంతమైన చిత్రాలు చేశారు.. హీరో హీరోయిన్లుగానూ వీరిది సూపర్ జోడీ..
అయితే కృష్ణ – విజయ నిర్మల ఇద్దరికీ ఓ సినిమా డ్రీమ్ ప్రాజెక్ట్‌గా మిగిలిపోయింది.. అదే ‘ఛత్రపతి శివాజీ’.. విజయ నిర్మల దర్శకత్వంలో కృష్ణ నటిస్తున్న ‘ముఖ్యమంత్రి’ అనే మూవీ ఫైట్ షూటింగ్ గ్యాప్‌లో ఈ సినిమా గురించి పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారామె.. విజయవాడలో విలేఖరులతో మాట్లాడుతున్నప్పుడు.. తాను నటిస్తూ, నిర్మించబోయే ‘ఛత్రపతి శివాజీ’ చిత్రానికి విజయ నిర్మల దర్శకురాలు అని చెప్పారు.. వాస్తవానికి ఆ విషయం అప్పటికి ఆమెకు తెలియదు..
విజయ నిర్మల మాట్లాడుతూ.. ‘‘కృష్ణ గారు విలేఖరులతో చెప్పేవరకు నాక్కూడా ఆ విషయం తెలియదు.. కానీ వెంటనే ఆనంద పడ్డాను.. కనీసం నూరు చిత్రాలకు దర్శకత్వం వహించాలనేది నా జీవితాశయం.. అయితే ‘ఛత్రపతి శివాజీ’ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నానని విన్నప్పుడు ఈ ఒక్క చిత్రంతోనే వంద చిత్రాలను పూర్తి చేసిన అనుభూతి కలిగింది.. ఈ స్క్రిప్ట్ కోసం ఆరు నెలల సమయం కేటాయించాను’’ అని చెప్పుకొచ్చారు..
అలాగే అప్పటికి దర్శకురాలిగా 25 సినిమాలు చేశారామె (రక్త సంబధం 25వ చిత్రం).. అప్పటికి ఇండియాలో అన్ని మూవీస్ తీసిన దర్శకురాలిగా ఆమే టాప్.. ఇక ‘ఛత్రపతి శివాజీ’ కథని తెలుగుతో పాటు హిందీ, తమిళంలోనూ తియ్యాలనుకున్నారట కృష్ణ.. మూడు భాషలంటే ఒక రకంగా అప్పటికది పాన్ ఇండియా మూవీనే.. పలు కారణాలతో ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్క లేదు.. అలా ‘ఛత్రపతి శివాజీ’ సినిమా కృష్ణ – విజయ నిర్మల ఇద్దరికీ కలగానే మిగిలిపోయింది..