Vikram K Kumar: ఇంటర్వ్యూ : ‘దూత’ (వెబ్ సిరీస్) గురించి దర్శకుడు విక్రమ్ కె కుమార్ చెప్పిన ఆసక్తికర విషయాలు!
December 1, 2023 / 01:25 PM IST
|Follow Us
అక్కినేని నాగ చైతన్య ప్రధాన పాత్రలో ‘దూత’ అనే వెబ్ సిరిస్ రూపొందింది. విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ లో ప్రియా భవానీ శంకర్, పార్వతి తిరువోతు, ప్రాచీ దేశాయ్ వంటి వారు కీలక పాత్రలు పోషించారు. ‘నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్’ బ్యానర్ పై శరత్ మరార్ ఈ వెబ్ సిరీస్ ని నిర్మించారు. టీజర్, ట్రైలర్స్ ఆకట్టుకున్నాయి. డిసెంబర్ 1 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఇక ప్రమోషన్స్ లో భాగంగా దర్శకుడు విక్రమ్ కె కుమార్ పాల్గొని ‘దూత’ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చారు. అవి మీ కోసం :
ప్ర) విక్రమ్ కుమార్ నుండి ఓ ప్రాజెక్ట్ వస్తుందంటే సహజంగానే ప్రేక్షకులు యూనిక్ కాన్సెప్ట్, కొత్తదనం ఉంటుందని భావిస్తారు? ‘దూత’ వారు ఆశించినట్టు ఉంటుందా?
విక్రమ్ కుమార్ : ’13బి’ తర్వాత నేను సూపర్ నాచురల్ జోనర్ లో సినిమా చేయాలని అనుకున్నాను కానీ అది వర్కౌట్ అవ్వలేదు.ఇన్నాళ్లు ఆ జానర్ ని మిస్ అయ్యాను అనే ఫీలింగ్ ఉంది. వెబ్ సిరీస్ రూపంలో ఆ అవకాశం లభించింది. ప్రేక్షకుల అంచనాలకి ఏమాత్రం తీసిపోని విధంగా ఉంటుంది.
ప్ర) ‘దూత’ థీమ్ ఏంటి?
విక్రమ్ కుమార్ : ఇది టీజర్, ట్రైలర్ లో చెప్పాం. ‘దూత’ అంటే మెసేంజర్. ఒక సంఘటనని ప్రజల వద్దకు చేరవేసే జర్నలిస్ట్ కూడా దూతనే..! ఆ థీమ్ తోనే ఈ సిరీస్ రూపొందింది.
ప్ర) ‘దూత’ ని ముందుగా సినిమాగా తీయాలి అని ఎందుకు అనుకోలేదు?
విక్రమ్ కుమార్ : ‘దూత’ ఆలోచన చాలా కాలం నుండి ఉంది. స్క్రీన్ ప్లే గా రాసుకున్నప్పుడు నేను వెబ్ సిరీస్ ని దృష్టిలో పెట్టుకునే రాశాను. 2 గంటల్లో చెప్పే కథ కాదు ఇది. ఆడియన్స్ కి కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అనే ఉద్దేశంతో కూడా దీనిని సిరీస్ గా చెప్పాలి అనుకున్నాను.
ప్ర) సినిమా తీయడం వేరు వెబ్ సిరీస్ తీయడం వేరు. ప్రతి ఎపిసోడ్ కి ఒక హుక్ పాయింట్ ఉండాలి. ఈ విషయంలో మీకేమైనా కష్టమనిపించిందా?
విక్రమ్ కుమార్: సినిమా తీయడం, సిరీస్ తీయడం వేరు అని ఏమీ అనిపించలేదు. స్క్రిప్ట్ రాసుకుంటున్నప్పుడే అది మైండ్‌లో పెట్టుకుని డిజైన్ చేసుకున్నాను. ఈ రెండిటికంటే కూడా షార్ట్ ఫిలిం తీయడం ఇంకా కష్టం అని నా ఫీలింగ్. ఎందుకంటే అనుకున్న పాయింట్ ని 10,15 నిమిషాల్లో కన్విన్సింగ్ చెప్పడం అంత ఈజీ కాదు.
ప్ర) ‘దూత’ కూడా పాన్ ఇండియా సినిమాలా 5 భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందా?
విక్రమ్ కుమార్: ఓటీటీకి అలాంటి ఓ గొప్ప సౌలభ్యం ఉంది. ‘దూత’ దాదాపు 240 దేశాల్లో స్ట్రీమింగ్ కానుంది. ప్రపంచంలో నలుమూలల ప్రేక్షకులు చూస్తారు.ఇన్నాళ్లు మనం కొరియన్, ఫారిన్ షోస్ చూశాం. మన తెలుగు షోని వాళ్ళు కూడా చూసి ప్రశంసిస్తే బాగుంటుంది కదా. దూత సూపర్ నాచురల్ జానర్. సో వరల్డ్ వైడ్ రీచ్ ఉంటుంది అనేది నా భావన.
ప్ర) వెబ్ సిరీస్ అంటే ఓ సెట్ ఆఫ్ ఆడియన్స్ .. అడల్ట్ కంటెంట్ తో ఉంటుంది అని భావిస్తారు. అలాంటి అభిప్రాయాన్ని ‘దూత’ మార్చే అవకాశం ఉందా?
విక్రమ్ కుమార్ : మనకి చాలా గొప్ప వెబ్ సిరీస్..లు వచ్చాయి. ‘స్కామ్’ ‘పాతాల్ లోక్’ వంటివి చాలా మంచి సిరీస్..లు. మనం కొత్తగా మార్చాల్సిన అవసరం లేదు. మనం ఏం చెప్పబోతున్నాం అనేది ముందుగా హింట్ ఇస్తే ఆడియన్స్ ప్రిపేర్ అయ్యి ఉంటారు.
ప్ర) నాగ చైతన్య గారికి ఈ కథ చెప్పినప్పుడు ఆయన రియాక్షన్ ఏంటి ?
విక్రమ్ కుమార్: నేను, చైతు మంచి ఫ్రెండ్స్. మూడోసారి కలిసి పని చేశాం. ‘మనం’ చేసిన సమయంలోనే చైతుకి ఓ హారర్ కథ వినిపించాను. అయితే తనకు ఘోస్ట్ స్టోరీస్ అంటే భయం. ‘హారర్ కథలు వద్దురా నాకు భయం’ అన్నారు. ‘దూత’ కథ మాత్రం తనకు చాలా నచ్చింది.
ప్ర) ‘థాంక్యూ’ లుక్ ను ‘తండేల్’ కోసం వాడుతున్నట్టు ఆయన చెప్పారు.. నిజమేనా?
విక్రమ్ కుమార్: జర్నలిస్టు పాత్ర అంటే గడ్డం అది ఉండాలని నేను మొదట అనుకున్నాను. చైతన్యకి కూడా అదే చెప్పాను. కానీ లేదు నేను చెప్పిన లుక్ ఒకసారి చూడు, కాదు అంటే మళ్ళీ గడ్డం పెంచుతా అన్నాడు. అతను చెప్పినట్టు క్లీన్ షేవ్ చేసుకుని.. మీసాలు కొంచెం వాళ్ళ తాతగారి(అక్కినేని నాగేశ్వరరావు) స్టైల్లో చేసుకుని ఫోటో తీసుకుని నాకు పంపాడు. తాను చెప్పింది కరెక్ట్ అనిపించింది. అందుకే ఇక దానికే ఓటేశాను.
ప్ర) టాలీవుడ్ లో ‘దూత’నే బిగ్గెస్ట్ వెబ్ సిరిస్ అనుకోవచ్చు. ప్రమోషన్స్ కూడా అవే రేంజ్ లో వున్నాయి. ప్రేక్షకుల్లో అంచనాలు కూడా అవే స్థాయిలో వున్నాయి.. మీకు ఈ విషయంలో ఎలా అనిపిస్తుంది ?
విక్రమ్ కుమార్: సినిమా విడుదలైతే శుక్రవారం మొదటి ఆటకే దాని ఫలితం ఏంటో తెలుస్తుంది. కానీ వెబ్ సిరిస్ ది మాత్రం ప్రత్యేకమైన పరిస్థితి. జనాలకు నచ్చిందా లేదా అని తెలుసుకోవడానికి కొంత సమయం పడుతుంది. సినిమాతో పోల్చుకుంటే ఈ విషయంలో ఒత్తిడి కాస్త తక్కువగానే ఉంది.
ప్ర) ‘దూత’ కి సీక్వెల్ చేసే ఆలోచన ఉందా?
విక్రమ్ కుమార్ : ‘దూత 2’ మాత్రమే కాదు ‘దూత 3’ ఆలోచన కూడా ఉంది. కానీ ఐడియా వరకు మాత్రమే ఉంది. డెవలప్ చేసి స్క్రిప్ట్ రెడీ చేయాలి.
ప్ర) ‘దూత’ విషయంలో నాగార్జున గారు మీకు ఏమైనా సలహాలు ఇచ్చారా ?
విక్రమ్ కుమార్ : ఏదైనా కొత్తగా ప్రయత్నిస్తే నాగార్జున గారు అభినందిస్తారు. ఈ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ఒకసారి కలిశాను… చాలా పాజిటివ్ గా మాట్లాడి ‘ఆల్ ది బెస్ట్’ చెప్పారు.
ప్ర) ఈ వెబ్ సిరిస్ ఇంత లేట్ గా రావడానికి కారణం ఏంటి?
విక్రమ్ కుమార్: షూటింగ్ త్వరగానే పూర్తి చేశాం. అయితే చాలా హెవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరిగింది. టెక్నికల్ వర్క్ బ్రిలియంట్ గా ఉండాలి అనే ఉద్దేశంతో కొంచెం ఎక్కువ టైం తీసుకున్నాం. 8 ఎపిసోడ్స్ వరకు ఎంగేజ్ చేయాలంటే ఎడిటింగ్ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. దాని కోసం కూడా ఎక్కువ టైం పట్టింది.
ప్ర) ‘దూత’ని అమెజాన్ వారు ‘గోవా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్’ లో ప్రదర్శించడం ఎలా అనిపించింది ?
విక్రమ్ కుమార్ : అది చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండీ. ఒక ఎపిసోడ్ ని స్క్రీన్ చేశాం. అందరికీ చాలా నచ్చింది.
ప్ర) నిర్మాత శరత్ మరార్ గారి సపోర్ట్ ఎలా ఉంది?
విక్రమ్ కుమార్: ఈ సిరీస్ చూస్తే ఆయన ప్యాషన్ అర్ధమవుతుంది. శరత్ మరార్ గారి సపోర్ట్ లేకపోతే ఇంత బాగా సిరీస్ వచ్చేది కాదేమో. 3 సినిమాల నిడివి వున్న కంటెంట్ ఇది. దాదాపు సన్నివేశాలన్నీ వర్షంలోనే చిత్రీకరీంచాం. నా గత సినిమాల్లో 2,3 రోజులు మాత్రమే రెయిన్ ని వాడేవాడని. ఇందులో వందరోజుల వాడాల్సి వచ్చింది. శరత్ మరార్ కాకుండా వేరే నిర్మాత అయితే నా పై ఒత్తిడి ఎక్కువగా ఉండేది.
ప్ర) శుక్రవారం రోజున కొత్త సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవుతాయి. మరి ఇలాంటి పెద్ద వెబ్ సిరీస్ లు కూడా అదే రోజు ఓటీటీలో రిలీజ్ అవుతుంటే..థియేట్రికల్ బిజినెస్ దెబ్బతింటుంది కదా?
విక్రమ్ కుమార్: అలా ఆలోచించడం చాలా తప్పు. ఎందుకంటే.. ఓటీటీ కంటెంట్ ని ప్రేక్షకులు ఏ టైంలో అయినా చూడొచ్చు. ఆ క్లారిటీ కూడా వాళ్లకి ఉంది. వీకెండ్ కి ఒక్క సినిమా మాత్రమే చూడాలని వారు అనుకోవడం లేదు. శుక్రవారం రాత్రి నుండి ఆదివారం వరకు సాధ్యమైనంత వరకు ఎక్కువ కంటెంట్ చూడాలనే వారు అనుకుంటున్నారు.