ధనుష్ స్వయంగా కథ-స్క్రీన్ ప్లే సమకూర్చడంతోపాటు టైటిల్ పాత్ర పోషించిన చిత్రం “విఐపి 2”. రజనీకాంత్ పెద్ద కుమార్తె సౌందర్య దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళనాట రెండు వారాల క్రితం విడుదలై మిశ్రమ స్పందన అందుకొంది. ప్రముఖ బాలీవుడ్ నటి కాజోల్ కీలకపాత్ర పోషించిన ఈ చిత్రం తెలుగులో ఆగస్ట్ 25న విడుదలైంది. మరి తమిళనాట విశ్లేషకులను ఏమాత్రం అలరించలేక ప్రేక్షకులను మాత్రం ఓ మోస్తరుగా ఆకట్టుకొన్న ఈ చిత్రం తెలుగువారిని ఏమేరకు రంజింపజేసిందో చూద్దాం..!!
కథ : 2015లో తెలుగులో విడుదలైన “రఘువరణ్ బీటెక్”కు తమిళ అనువాద చిత్రం “విఐపి”కి సీక్వెల్ గా రూపొందిన చిత్రం “విఐపి 2”. సరిగ్గా “విఐపి” ఎక్కడ ఎండ్ అయ్యిందో అక్కడ్నుంచే సినిమా మొదలవుతుంది. అనితా కన్స్ ట్రక్షన్స్ లో ఇంజనీర్ గా వర్క్ చేస్తున్న రఘువరణ్ (ధనుష్), ఒక ప్రోజెక్ట్ కోసం వసుంధర కనస్ట్రక్షన్స్ కంపెనీ ఎం.డి వసుంధర (కాజోల్)తో పోటీ పడాల్సి వస్తుంది. లక్కీగా ఆ ప్రోజెక్ట్ సొంతం చేసుకొన్నా.. వసుంధర కనస్ట్రక్షన్స్ కి సంఘంలో ఉన్న పరపతిని ఉపయోగించి అనితా కనస్ట్రక్షన్స్ ను సర్వనాశనం చేయడానికి పూనుకొంటుంది. కానీ.. తన వల్ల అనితా కనస్ట్రక్షన్స్ కు ఎలాంటి నష్టం వాటిల్లకూడదని తానే ఆ కంపెనీ నుండి తొలగిపోయి.. తన “విఐపి” టీం తో కలిసి “విఐపి కనస్ట్రక్షన్స్”ను స్టార్ట్ చేస్తాడు. అప్పటికే.. రఘువరణ్ పై పగబట్టిన వసుంధర “విఐపి కనస్ట్రక్షన్స్”ను ఎదగనివ్వదు. మరి.. వసుంధర డామినేషన్ ను తట్టుకొని రఘువరణ్ నిలదొక్కుకోగలిగాడా? చివరికి ఎవరు ఎవరిపై విజయం సాధించారు అనేది “విఐపి 2” కథాంశం.
నటీనటుల పనితీరు : రఘువరణ్ పాత్రలో ధనుష్ ఫస్ట్ పార్ట్ కంటే బెటర్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకోడానికి విశ్వ ప్రయత్నం చేశాడు. కానీ.. మునుపటి భాగం స్థాయిలో క్యారెక్టరైజేషన్ స్ట్రాంగ్ గా లేకపోవడంతో ఆడియన్స్ ఏ విధంగానూ అతడి క్యారెక్టర్ కు ఎట్రాక్ట్ అవ్వలేరు. సగటు మధ్యతరగతి గృహిణిగా అమలాపాల్ పాత్ర “కోవై సరళ” పాత్రను తలపిస్తుంది. భర్తపై ఎందుకు అరుస్తుందో తెలియదు, అదే విధంగా ఉన్నట్లుండి సపోర్టింగ్ ఎందుకు స్టార్ట్ చేస్తుందో అర్ధం కాదు. కాజోల్ ఈ సినిమాలో పొగరుబోతుగా ఫేస్ ఎక్స్ ప్రెషన్స్ అండ్ యాటిట్యూడ్ తో వసుంధర పాత్రను పండించింది. కాకపోతే.. సరైన క్యారెక్టరైజేషన్ లేకపోవడం వల్ల జస్టిఫై అవ్వలేదు. సముద్రఖని, వివేక్ లు రెగ్యులర్ క్యారెక్టర్స్ లో పర్వాలేదనిపించుకొన్నారు.
సాంకేతికవర్గం పనితీరు : సీన్ రోల్డన్ బాణీల్లో కొత్తదనం కనిపించలేదు, ఇక నేపధ్య సంగీతం దాదాపుగా ఫస్ట్ పార్ట్ లో అనిరుధ్ కంపోజ్ చేసిందే కావడంతో ఆ క్రెడిట్ సీన్ కు చెందదు. సమీర్ తాహిర్ సినిమాటోగ్రఫీ చాలా రెగ్యులర్ గా ఉంది. పైగా.. కలరింగ్ విషయంలో తప్ప ఎక్కడా పెద్దగా జాగ్రత్తలు తీసుకొన్నట్లు కనిపించదు. ధనుష్ స్వయంగా రాసుకొన్న కథలో ఎక్కడా కొత్తదనం కనిపించదు. ఫస్ట్ పార్ట్ లో ఉన్న కొన్ని సన్నివేశాలనే కాస్త ఎక్స్ టెండ్ చేశాడు తప్పితే తన రైటింగ్ స్కిల్స్ ను ఎక్కడా ప్రూవ్ చేసుకోడానికి ప్రయత్నించలేదు. పైపెచ్చు స్క్రీన్ ప్లే మరీ రొటీన్ గా సాగింది. ఇక క్లైమాక్స్ ను రాసుకొన్న విధానం ప్రేక్షకుల్ని ఇరిటేట్ చేస్తుంది. అసలు కాన్ఫ్లిక్ట్ పాయింట్ అనేది లేకుండా క్లైమాక్స్ లో కాంప్రమైజ్ ఎందుకు అవుతారో అనేదానికి జస్టీఫికేషన్ ఇవ్వలేదు. ఇక సౌందర్య రజనీకాంత్ దర్శకురాలిగా తనదైన మార్క్ ను ప్రూవ్ చేసుకోడానికి కనీస స్థాయి ప్రయత్నం కూడా చేయలేదు. ధనుష్ ని “విఐపి” సినిమాని ఫాలో అయిపోయింది. దాంతో.. “విఐపి”కి కొనసాగింపు సీరియల్ ను చూస్తున్న ఫీలింగ్ వస్తుందే తప్ప ఎక్కడా ఒక కొత్త సినిమా చూస్తున్నామన్న అనుభూతి ప్రేక్షకుడికి కలగదు.
విశ్లేషణ : ఒక సూపర్ హిట్ సినిమాకి సీక్వెల్ తీయాలన్న ఆలోచన తప్ప.. “విఐపి 2” సినిమా మొత్తంలో ఒక్కటంటే ఒక్క ప్లస్ పాయింట్ కూడా లేదు. పైపెచ్చు 90ల కాలంనాటి క్లైమాక్స్ ప్రేక్షకుడ్ని ఇరిటేట్ చేస్తుంది. తక్కువ బడ్జెట్ లో రూపొందడం వల్ల కమర్షియల్ గా సక్సెస్ సాధించవచ్చేమో కానీ.. ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేయడంలో మాత్రం సక్సెస్ సాధించలేదు.
రేటింగ్ : 1.5/5