తెలుగు వాడైన విశాల్ తమిళనాట హీరోగా స్థిరపడ్డాడు. తెలుగు వాడినని చెప్పుకుంటూ అనువాద సినిమాలతో తెలుగు ప్రేక్షకులను సైతం తన వశం చేసుకున్నాడు. వరుస సినిమాలు చేస్తూ ఆ సినిమాల విజయాలతో రెండు చోట్ల మార్కెట్ పెంచుకుంటున్న ఈ నల్లనయ్య నటించిన తాజా చిత్రం ‘కత్తిసండై’. ఈ సినిమాని హరి పిక్చర్స్ బ్యానర్ పై హరి గుజ్జలపూడి ‘ఒక్కడొచ్చాడు’ పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పుడు సమస్య అంతా ఈ సినిమా విడుదలతోనే. పెద్ద నోట్లను రద్దు చేసిన నేపథ్యంలో సినిమా పూర్తయినా విడుదల కానీ సినిమాల్లో ఇదొకటి. నిజానికి దీపావళి లక్ష్యంగా ఈ సినిమాని మొదలెట్టారు.
పలు కారణాల వల్ల ఆలస్యమై నవంబర్ నెలకు ఖాయం చేసుకుంది. సరిగ్గా అప్పుడే మోడీ ఎఫెక్ట్ పడింది. దాంతో చేసేది లేక థియేటర్ గేట్ నుండి వెనుదిరిగిన విశాల్ సంక్రాంతి పండగను తన సినిమాకి సరైన సీజన్ అని భావిస్తున్నాడు. తమిళంలో ‘పొంగల్ రిలీజ్’ అని ప్రకటించాడు కూడా. సాధారణంగా ఇటువంటి సినిమాలు తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో విడుదలవుతుంటాయి. ఈ సినిమాకి అదే పద్దతి వర్తిస్తే ఇబ్బందులు మొదలయినట్టే. ఇప్పటికే ‘ఖైదీ నెం150’, ‘గౌతమీపుత్ర శాతకర్ణి’, ‘శతమానం భవతి’ సినిమాలు పెద్ద పండుగ రేసులో ఉన్నాయి. ‘నమో వెంకటేశాయ’, ‘గురు’ కూడా కాస్త అటుఇటుగా అప్పుడే తెరపైకి వచ్చే అవకాశముంది. అంచేత థియేటర్ల కొరత తద్వారా కలెక్షన్ల కోత ఎదురవుతుంది. ఈ పరిస్థితుల్లో విశాల్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో మరి..!
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.