క్లయిమాక్స్ కు ఇంత ప్రయోగం అవసరమా?

  • May 25, 2019 / 01:43 PM IST

మన తెలుగు సినిమాలు కొన్ని తమిళ్ లో రీమేక్ చేసుకుంటూ ఉంటారు ఇది చాలా సాదా సీదా విషయం. కానీ ఆ రీమేక్ చేసుకున్న సినిమాలు మళ్ళీ తెలుగులో డబ్ చేస్తారు… ఇది చాలా కామెడీగా అనిపించినా ఇది నిజం. గతంలో బాలయ్య సూపర్ హిట్ ‘నరసింహ నాయుడు’ చిత్రాన్ని ‘సింహబలుడు’ గా మళ్ళీ అర్జున్ తెలుగులోకి తెచ్చాడు. శింబు కూడా రవితేజ ‘భద్ర’ చిత్రాన్ని కూడా ‘యమ కేడి’ పేరుతో తెలుగులోకి తెచ్చాడు. అయితే ఆ చిత్రాల్ని జనాలు పెద్దగా పట్టించుకోలేదు.. టీవీల్లో మాత్రం ఆ సినిమాలు చూసి చాలా కామెడీ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఇలాంటి కామెడీ విశాల్ కూడా చేయబోతున్నాడట.

వివరాల్లోకి వెళితే.. ఎన్టీఆర్ సూపర్ హిట్ ‘టెంపర్’ హిందీ, తమిళ భాషల్లో రీమేక్ చేశారు. బాలీవుడ్ లో రణవీర్ సింగ్ నటించగా… తమిళంలో విశాల్ నటించాడు. ‘అయోగ్య’ అనే పేరుతో తెరకెక్కించిన ఈ చిత్రం ఇటీవల తమిళంలో విడుదలై సక్సెస్ అందుకుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాను తిరిగి తెలుగులో డబ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. దానికి కారణం తమిళ టెంపర్ చిత్రంలో చివరి అరగంటలో కొన్ని మార్పులు చేయడం. అందులో డ్రామా తగ్గించి ఫైట్ లేకుండా హీరో పాత్రకు ఊహించని క్లైమాక్స్ సెట్ చేశారట. ఇది తమిళంలో బాగా వర్కవుట్ అయ్యిందని సమాచారం. అందుకే ఇప్పుడు తెలుగులో కూడా ఆ కొత్త క్లైమాక్స్ ని ఎంజాయ్ చేస్తారని నిర్మాత మల్కాపురం శివకుమార్ ఈ డబ్బింగ్ హక్కులను కొనుక్కున్నారట. చివరి అరగంట తీసేస్తే మిగిలిన రెండు గంటలు ‘టెంపర్’ సినిమాకు మక్కికి మక్కి ఉంటుంది. అలాంటప్పుడు ఈ సినిమాను తెలుగులో డబ్ చేయడం సాహసమనే చెప్పాలి. ‘విశాల్ కు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది.. అలాంటప్పుడు ఇలా కామెడీ ప్రయోగాలు చేయడం అవసరమా’ అంటూ సోషల్ మీడియాలో కొందరు కామెంట్లు చేస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus