స్టార్ డమ్ కోసం పరుగులు పెట్టాలనుకోవడం లేదు : విశ్వక్ సేన్

  • July 8, 2020 / 12:04 PM IST

సాధారణంగా ఒక మంచి హిట్ కొట్టిన హీరోలెవరైనా సరే.. సినిమా నేపధ్యం నుంచి వచ్చిన వారు కావచ్చు లేదా ఎలాంటి సపోర్ట్ లేకుండా ఎదిగినవారు కావచ్చు, ఫస్ట్ సక్సెస్ తర్వాత ఇమ్మీడియట్ గా ఇంకో హిట్ కొట్టాలని కంగారుపడుతుంటారు. కానీ.. “ఈ నగరానికి ఏమైంది”తో సూపర్ హిట్ అందుకొన్న విశ్వక్ సేన్ మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా కనిపిస్తున్నాడు.

“ఇప్పుడు నా ఏజ్ 23, నాకు కార్ లోన్, హౌస్ లోన్ కట్టాల్సిన కంగారు లేదు, ఇంకో అయిదేళ్ళ వరకూ డబ్బుల కోసం కాకుండా కేవలం నటుడిగా నన్ను నేను సంతృప్తిపరుచుకోవడం కోసం సినిమాలు చేస్తాను. ఏడాదికి నాలుగైదు సినిమాలు చేయాలన్న తపన లేదు, ఒక సినిమా చేసినా.. నిబద్ధతతో పనిచేయాలన్న ఆశ మాత్రమే ఉంది” అని సమాధానం చెబుతున్నప్పుడు విశ్వక్ సేన్ కళ్ళల్లో నిజాయితీ, అతడి మొండి ధైర్యం చూసి అరనిమిషం పాటు ఆశ్చర్యపోయాను.

అసలు తన జర్నీ ఎప్పుడు మొదలైంది, తాను ఎదుర్కొన్న ఇబ్బందులేమిటి, సాధించింది ఏమిటి, ఇంకా సాధించాల్సింది ఏమిటి? వంటి విషయాల గురించి విశ్వక్ పంచుకొన్న ఆసక్తికరమైన అనుభవాలు, అనుభూతులు, భవిష్యత్ ప్రణాళికలు ఏంటో ఈ స్పెషల్ ఇంటర్వ్యూ చదివి తెలుసుకోండి..!!

‘వెళ్లిపోమాకే’ టు ‘ఈ నగరానికి ఏమైంది?’ వయా ‘అంగామలై డైరీస్’..
“వెళ్లిపోమాకే” ఫస్ట్ కాపీ రెడీ అయిపోయింది కానీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే విషయంలో క్లారిటీ లేకుండే. నెక్స్ట్ మంత్ అంటున్నారు కానీ ఆ ‘నెక్స్ట్ మంత్” ఎప్పుడు అనేది ఎవరికీ అర్ధం కానీ పరిస్థితిలో ఉన్నాం. ఆ టైమ్ లో నేను మలయాళంలో సూపర్ హిట్ అయిన “అంగామలై డైరీస్” అనే సినిమా తెలుగు రీమేక్ రైట్స్ కొనుక్కొని స్క్రిప్ట్ వర్క్ మొదలుపెట్టాను. మొదట వేరే దర్శకులతో చేద్దామనుకొన్నాను కానీ.. నేను కలిసిన దర్శకులెవరికీ హైద్రాబాద్ కల్చర్ గురించి ఐడియా లేదు. ఈ సినిమా రీమేక్ కు నేటివిటీ చాలా ఇంపార్టెంట్, అందుకే నేనే డైరెక్ట్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఆ తర్వాత అనుకోకుండా ఒకసారి తరుణ్ భాస్కర్ ని కలవడం జరిగింది. అప్పటికే తను నా ఫోటో పట్టుకొని నా నెంబర్ కోసం ట్రై చేస్తున్నాడు. వెంటనే “ఈ నగరానికి ఏమైంది?” స్క్రిప్ట్ చేతికిచ్చి చదవమని చెప్పాడు. అలా నేను “ఈ నగరానికి ఏమైంది?” టీమ్ లో జాయిన్ అయ్యాను.

ముందే తెలుసు కానీ..
నిజానికి “ఈ నగరానికి ఏమైంది?” సినిమా ఆడిషన్ కి నేను ఎప్పుడో వెళ్దామనుకొన్నాను. కానీ.. “లీడ్ యాక్టర్”కి తరుణ్ అప్పటికే ఎవరో ఒకర్ని ఫిక్స్ చేసి ఉంటాడులే నేను ట్రై చేయడం వేస్ట్ అనుకొన్నాను. కానీ.. క్వార్ణ్ ఏజెన్సీకి వెళ్లినప్పుడు తరుణ్ నా కోసం వెతుకుతున్నాడు అని తెలిసి ఆశ్చర్యపోయాను.

నా లైఫ్ నేను చదువుకున్నట్లు అనిపించింది..
తరుణ్ నాకు బైండెడ్ స్క్రిప్ట్ ఇచ్చిన తర్వాత ఒకరోజు మొత్తం కూర్చుని మొత్తం చదివాను. చాలా సన్నివేశాలు, సందర్భాలు నా జీవితంలో జరిగినవి, నేను ఎదుర్కొన్నవి. వెంటనే తరుణ్ కి కాల్ చేసి “ఈ స్క్రిప్ట్ లో 75% నా జీవితంలాగే ఉంది” అని చెప్పగానే తరుణ్ కూడా చాలా ఎగ్జైట్ అయిపోయి “రేపు వచ్చేయ్ మరి ఆడిషన్ చేద్దాం” అన్నాడు. వెంటనే నేను “రేపు కాదు, ఇంకోసారి స్క్రిప్ట్ చదువుకొని ఎల్లుండి వస్తాను” అని చెప్పాను.

టైమ్ అవుతుంటే రోడ్డు మీద వెతుక్కుంటూ తిరిగాను..
తరుణ్ నన్ను ఉదయం 10.00 గంటలకు ఆడిషన్ కోసం రమ్మన్నాడు. నేనేమో స్పెక్ట్స్ కోసం రోడ్డు మీద ఎక్కడ దొరుకుతాయా అని వెతుక్కుంటూ తిరిగుతున్నాను. మొత్తానికి ఒకచోట దొరికాయి. సినిమాలో సెకండాఫ్ లో వచ్చే జైల్ సీన్ ఆడిషన్ ఇద్దామని వెళ్ళాను. అందుకే.. ఒక లిప్ స్టిక్ తో ముఖానికి దెబ్బ తగిలినట్లిగా మేకప్ వేసుకొని మరీ స్టూడియోకి వెళ్ళాను. అక్కడ అందరూ నన్ను చాలా వింతగా చూస్తే.. ఏ సీన్ చేస్తున్నానో అర్ధం చేసుకొన్న తరుణ్ భాస్కర్ మాత్రం నవ్వుతూ దగ్గరికి వచ్చి “జైల్ సీన్ ఆడిషన్ ఇస్తున్నావా?” అని కౌగిలించుకొన్నాడు.

తెలంగాణ యాస అనేది నా ప్రత్యేకత కాదు..
మొదటి సినిమా “వెళ్లిపోమాకే”లో నాది పక్కా ఆంధ్ర అబ్బాయి పాత్ర. “ఈ నగరానికి ఏమైంది?” సినిమాలో తెలంగాణ కుర్రాడి క్యారెక్టర్. ఈ రెండు పాత్రలు పోషిస్తున్నప్పుడు పాత్రకి జీవం పోయాలన్న తాపత్రయం తప్ప వేరే ఆలోచన ఉండేది కాదు. సో, నేను తెలంగాణా కుర్రాడ్ని కాబట్టి నాకు తెలంగాణ యాస అనేది ప్రత్యేకత కాదు, బలం మాత్రమే. నెక్స్ట్ సినిమాలో కూడా పక్కా తెలంగాణ కుర్రాడిగా కనిపిస్తాను.

18 ఏళ్లకే హీరో అయ్యాను..
నేను అనుపమ్ ఖేర్ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ తో కోర్స్ కంప్లీట్ చేసి వచ్చాక. ఒక క్రేజీ ప్రొజెక్ట్ సెట్ అయ్యింది. సరిగ్గా పది రోజుల షూటింగ్ జరిగింది. ఆ తర్వాత ఒక్కొక్కరుగా టీమ్ నుంచి వెళ్లిపోవడం మొదలెట్టారు. అప్పటికి నా వయసు 18 ఏళ్ళు, సినిమా నుంచి వెళ్లిపోవాలా, లేదా. వెళ్తే నా కెరీర్ పరంగా ఏమైనా సమస్యలు వస్తాయా అని భయపడుతూ, ఇబ్బందిపడుతూ మొత్తానికి ఆ ప్రొజెక్ట్ పూర్తి చేశాం. తర్వాత డైరెక్టర్ & ప్రొడ్యూసర్ కి ప్రోబ్లమ్ వచ్చి ఆఖరికి నాతో డబ్బింగ్ కూడా చెప్పించలేదు. ఆ సినిమా పొరపాటున ఇప్పుడు ఎక్కడ విడుదలవుతుందో అని భయపడుతున్నాను.

ఆ రిజెక్షన్ ఎక్స్ పెక్ట్ చేయలేదు..
నా మొదటి సినిమా షూట్ కంప్లీట్ అయిన తర్వాత వేరే ప్రొజెక్ట్ సెట్ అయ్యింది. కొత్త నిర్మాత, కొత్త దర్శకుడు. బట్ పెద్ద స్కేల్ లో ప్లాన్ చేశారు. అప్పటికే నాలుగైదుసార్లు ఆడిషన్ ఇచ్చాను. కానీ.. డైరెక్టర్ కి క్లారిటీ లేకపోవడం, ప్రొడ్యూసర్ ని వేరేవాళ్లు వేరే విధాలుగా అప్రోచ్ అవ్వడం వంటి కారణాలుగా ఆ సినిమా నుంచి నాకు తెలియకుండానే నేను రిజెక్ట్ చేయబడ్డాను.

అలా కంప్లైంట్ చేసిన రెండో వ్యక్తి మీరే..
సినిమా చూసినవాళ్ళందరూ నన్ను, నా నటనను, నా యాటిట్యూడ్ ను మెచ్చుకొన్నారు. కానీ.. ఒక్కడు మాత్రం “విజయ్ దేవరకొండను ఇమిటేట్ చేసినట్లు అనిపించింది” అన్నాడు. అతడి తర్వాత అలా చెప్పింది మీరే. నేను మాత్రం ఏదో “అర్జున్ రెడ్డి”లో విజయ్ క్యారెక్టర్ హిట్ అయ్యింది కాబట్టి అతడ్ని ఇమిటేట్ చేయాలి అని మాత్రం అనుకోలేదు. కానీ.. మీకు అలా అనిపించింది కాబట్టి నెక్స్ట్ సినిమాలో అలా రిపీట్ అవ్వకుండా, ముఖ్యంగా మీకు అలా అనిపించకుండా జాగ్రత్తపడతాను.

హైద్రాబాదీ సంస్కృతి, సాంప్రదాయాలు ప్రతిబింబించేలా..
“అంగమలై డైరీస్” తెలుగు రీమేక్ ను నేనే డైరెక్ట్ చేస్తూ లీడ్ రోల్ ప్లే చేస్తున్నాను. ఒక షెడ్యూల్ పూర్తైంది, ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ జరుగుతోంది. ఇండియాలోనే మనది బిగ్గెస్ట్ లాంబ్ బిజినెస్ (మటన్ సప్లై). ఆ నేపధ్యంలో మన హైద్రాబాద్ సంస్కృతిని బేస్ చేసుకొని, కుర్రాళ్ళ యాటిట్యూడ్ కీలకాంశంగా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాను. ఇప్పటివరకూ ఎవరూ చూపించనంత విభిన్నంగా, వైవిధ్యంగా చూపించబోతున్నాను.

స్టార్ హీరో అయిపోవాలన్న ఆశ లేదు..
ఇప్పటికిప్పుడు అర్జెంట్ గా ఓ నాలుగైదు సినిమాలు ఒప్పేసుకొని ఇమ్మీడియట్ గా ఒక స్టార్ హీరో అయిపోవాలనో, డబ్బులు సంపాదించేయాలనో నాకు అస్సలు లేదు. ఏడాదికి ఒక సినిమా చేసినా చాలు అనుకొంటున్నాను. నా మనసుకి నచ్చిన సినిమా చేస్తే చాలు.

నా యాటిట్యూడే నా ఉనికి..
ఏదో హిట్ వచ్చింది కాబట్టి ఇలా మాట్లాడుతున్నాను అని అనుకోకండి. చిన్నప్పట్నుంచి నేను ఇలాగే ఉండేవాడ్ని, ఇకపై కూడా ఇలానే ఉంటాను. రేపన్న రోజు ఒక పెద్ద డైరెక్టర్ వచ్చి ఎక్కువ డబ్బులు ఇస్తాను అని చెప్పిన తర్వాత కథ నచ్చకపోతే ఆ సినిమా చేయను. అదే ఒక చిన్న డైరెక్టర్ వచ్చి మంచి కథ చెబితే ఫ్రీగా యాక్ట్ చేస్తా, అవసరం అనుకొంటే నేను కూడా డబ్బులు పెడతాను.

– Dheeraj Babu

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus