Vishwak Sen: వాళ్లు కొన్నామంటున్నారు.. విశ్వక్ ఏంటి ఇలా అంటున్నాడు!
June 13, 2024 / 06:39 PM IST
|Follow Us
కంటెంట్ బాగుంటే సినిమా హిట్ అవుతుంది అనుకునేవాళ్లు కొందరు ఉంటారు. మరికొందరేమో దానికి కాస్త మసాలా యాడ్ అయ్యేలా ఏదో ఒక కాంట్రవర్శీ ఉండేలా చూసుకుంటారు. మొదటి విధానం ప్రకారం అంతా ప్రచారం రాకపోయినా రెండో స్టయిల్లో ప్రచారం వస్తుంది అని వారి ఆలోచన కావొచ్చు. ఇలాంటి డబుల్ ప్రమోషన్ సెటప్ పెట్టుకునే హీరోల్లో విశ్వక్సేన్ (Vishwak Sen) ఒకడు. ఆయన సినిమాల్లో చాలావరకు, ఇంకా చెప్పాలంటే విజయం సాధించిన సినిమాలు ఎక్కువగా కాంట్రవర్శీ యాడింగ్లానే వచ్చుంటాయి.
‘అశోకవనంలో అర్జున కల్యాణం’ (Ashoka Vanamlo Arjuna Kalyanam) , ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ (Gangs of Godavari) లాంటి రీసెంట్ మూవీస్ తీసుకున్నా.. ఏదో ఒక సమయంలో కాంట్రవర్శీని నమ్ముకున్నట్లు అర్థమవుతుంది. తొలి సినిమా పెళ్లికాని కుర్రాడు కాన్సెప్ట్.. రెండో సినిమా విషయంలో వరుస వాయిదాలు – ప్రచారానికి ఇక రాను కాన్సెప్ట్ పని చేశాయి. అయితే ఇప్పుడు మరోసారి ఆయన కొత్త సినిమా అదే కాన్సెప్ట్ ట్రై చేస్తున్నారా? లేక ఆయన సమాచారం లేక అలా మాట్లాడుతున్నాడా అనేది అర్థం కావడం లేదు.
ఎక్స్ (మాజీ ట్విటర్)లో విశ్వక్సేన్ రీసెంట్ పోస్ట్/ కామెంట్ చూస్తే మీకే విషయం తెలుస్తుంది. విష్వక్ సేన్ హీరోగా దర్శకుడు రవితేజ ముళ్లపూడి తెరకెక్కిస్తున్న చిత్రం ‘మెకానిక్ రాకీ’ (Mechanic Rocky) . ఈ సినిమా పంపిణీ హక్కుల గురించి ఒక నెటిజన్ ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. దానికి విశ్వక్ స్పందిస్తూ.. ‘మెకానిక్ రాకీ’ రైట్స్‌ను ఇంకా విక్రయించలేదని, వాస్తవాలు తెలుసుకోండి అంటూ రిప్లై ఇచ్చాడు. అయితే ఇక్కడే కన్ఫ్యూజ్ మొదలైంది.
‘మెకానిక్ రాకీ’ సినిమాను దేశవ్యాప్తంగా పంపిణీ చేసే హక్కులు తమ సొంతం అయినట్లు ఏషియన్ సురేశ్ ఎంటర్టైన్మెంట్ సంస్థ సోషల్ మీడియాలో మంగళవారం ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, తమిళనాడు కలిపి సుమారు రూ.8 కోట్లకు ఈ సినిమా పంపిణీ హక్కులను ఏషియన్ సురేశ్ ఎంటర్టైన్మెంట్ కొనుగోలు చేసిందనిన్ నెటిజన్ ట్వీట్ చేయగా విశ్వక్ ఇలా రియాక్ట్ అవ్వడం గమనార్హం.
ఒకవైపు సినిమా పంపిణీ హక్కులు పొందామని ఆ సంస్థ చెబుతుంటే విశ్వక్ ఇలా విక్రయించలేదనడంతో అభిమానులు, ప్రేక్షకుల్లో సందిగ్ధత నెలకొంది. ‘ఇదో కొత్త రకం ప్రచారం’ అని కొందరు నెటిజన్లు అంటుంటే, హీరోకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదా అని అంటున్నారు. మరి ఏమైందో ఎవరన్నా చెబుతారేమో చూడాలి.