K Vishwanath: కళాతపస్వి విశ్వనాథ్ అంత్యక్రియలు అలా ఎందుకు చేశారు?
February 4, 2023 / 04:59 PM IST
|Follow Us
టాలీవుడ్ దర్శకుల్లో కళాతపస్వి కె.విశ్వనాథ్ శైలే వేరు. ఆయన సినిమాలకు మిగిలిన సినిమాలకు ఎలాంటి సంబంధం ఉండదు. లాంటి దిగ్దర్శకుడు ఇటీవల కన్నుమూశారు. ఆర్థశతాబ్దానికిపైగా కళామ్మతల్లి సేవలో తరించిన కె.విశ్వనాథ్ తొమ్మిది పదులు దాటిన వయసులో శివైక్యం పొందారు. అయితే ఆయన అంత్యక్రియల విషయంలో జరిగిన పనుల గురించి మాట్లాడుకుంటారు. ఆయనకు సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు జరిగినా.. ఇతర బ్రాహ్మణుల్లా కుండా ఖననం చేయడం గురించి మాట్లాడుతున్నారు. విశ్వనాథ్ అంత్యక్రియలు హైదరాబాద్లో ఇటీవల జరిగాయి.
బ్రాహ్మణ సంప్రదాయం ప్రకారం అయితే.. శివైక్యం పొందిన పార్థివ దేహాన్ని దహనం చేస్తారు. ఆ తర్వాత అస్తికలను నదుల్లో నిమజ్జనం చేస్తారు. కానీ విశ్వనాథ్ పార్థివ దేహాన్ని కూర్చోబెట్టి ఖననం చేశారు. దీని వెనుక కారణమేంటి అని చూస్తే.. విశ్వనాథ్ పూర్వీకులు కర్ణాటక నుండి వచ్చిన వీరశైవ ఆరాధ్యులు అని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల బ్రాహ్మణులతో పోలిస్తే.. వారికి ప్రత్యేక సంప్రదాయాలు ఉంటాయి. ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో వీరశైవ ఆరాధ్యులు ఎక్కువగా కనిపిస్తుంటారు.
అయితే వీరంతా ఆ తర్వాతి రోజుల్లో నియోగి బ్రాహ్మలతో వివాహ బంధాలు ఏర్పరచుకుని మిగిలిన బ్రాహ్మణులతో కలసిపోయారు. వీర శైవులను స్థానికంగా లింగధారులని కూడా పిలుస్తారు. అందుకే చనిపోయినప్పుడు అంత్యక్రియల సమయంలో దేహంపై ఉన్న శివలింగాన్ని తొలగించరు అని చెబుతుంటారు. పార్థివ దేహాన్ని దహనం చేయకుండా… ఖననం చేస్తారు అని చెబుతుంటారు. శివలింగం చెక్కుచెదరకుండా ఉండేందుకు వారిని ఖననం చేస్తారని సమాచారం.
కె.విశ్వనాథ్ విషయంలోనూ ఇదే జరిగింది అని చెబుతున్నారు. అంతేకాదు గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చనిపోయినప్పుడు కూడా ఆయనకు ఇదే సంప్రదాయంలో అంత్యక్రియలు నిర్వహించారు అని అంటున్నారు. దీంతో వీరి అంత్యక్రియల విషయంలో వస్తున్న వార్తలను నమ్మొద్దని కె.విశ్వనాథ్, ఎస్పీ బాలు సన్నిహితులు అంటున్నారట. ఎందుకంటే ఒకే వర్గం అయినా.. ఎవరి సంప్రదాయాలు వారికి ఉంటాయి అని గుర్తుంచుకోవాలని చెబుతున్నారు.