Janhvi Kapoor: జాన్వీ కపూర్ చుట్టూ ఏం జరుగుతోంది!
June 5, 2021 / 06:28 PM IST
|Follow Us
టాలీవుడ్లో యంగ్ స్టార్ హీరో కొత్త సినిమా మొదలవుతోంది అంటే చాలు… హీరోయిన్స్ లిస్ట్‌లో జాన్వి కపూర్ పేరు తప్పక వినిపించాల్సిందేనా? ఏమో ఇటీవల వస్తున్న వార్తలు, పుకార్లు చూస్తుంటే అవుననే అనాలనిపిస్తోంది. ఫలానా హీరో సినిమా అనగానే… ‘హీరోయిన్ పాత్రకు జాన్వి కపూర్ పేరు పరిశీలనలో’ అని ట్యాగ్ యాడ్ చేసేస్తున్నారు. అసలు ఈ దర్శకనిర్మాతలు జాన్వీ కపూర్‌ను అప్రోచ్ అవుతున్నారా? లేక హైప్ కోసం ఇలా అంటున్నారా?
బాలీవుడ్లో జాన్వి కపూర్ ఎంట్రీ ఇచ్చి… నాలుగేళ్లు అవుతోంది. ‘ధడక్’ సినిమాతో తెరంగేట్రం చేసిందీ జూనియర్ అతిలోకసుందరి. అప్పుడు మొదలైంది… ‘జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ’ టాపిక్. ఏ స్టార్ హీరో సినిమా హీరోయిన్ చర్చలు మొదలైనా ‘తగుదునమ్మా అంటూ జాన్వీ పేరు తెచ్చేస్తుంటారు’. అలా ఇప్పుడు ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ సినిమా కోసం జాన్వీ అంటూ కొత్త పుకారు తీసుకొచ్చారు. గతంలో కూడా ఎన్టీఆర్ – త్రివిక్రమ్ సినిమా కోసం జాన్వి అన్నారు. అప్పుడు అవ్వలేదు.. అసలు ఆ సినిమానే అవ్వలేదు అనుకోండి.
జాన్వీ తెలుగులో నటిస్తే చూడాలని ఎవరికి ఉండదు చెప్పండి. వాళ్ల నాన్న బోనీ కపూర్‌కి కూడా ఉంటుంది. అయితే ఆమెకు విజయ్ దేవరకొండ అంటే ఇష్టమని, అతనితోనే ఇక్క ఫస్ట్ సినిమా చేస్తుందని ఆ మధ్య వార్తలొచ్చాయి. అయితే విజయ్ వేరే హీరోయిన్లతో నటిస్తున్నాడు. అలాగే శ్రీదేవి కూతురుని త్రివిక్రమ్ తెలుగులో లాంచ్ చేస్తారని అని అన్నారు. ఆఖరికి మహేష్ సరసన జాన్వీ అని కూడా అనేశారు. ఇదంతా మాట్లాడే ముందు అసలు జాన్వీ తెలుగులోకి వస్తుందా… వస్తే ఎలా వస్తుంది అనేది ఆమెకే వదిలేద్దాం. ఏమంటారు.. కరెక్టే కదా!