Simbu: శింబు సినిమా వద్దనుకున్నారా? చేయలేకపోతున్నారా?
June 21, 2022 / 11:58 AM IST
|Follow Us
కొన్ని సినిమాలు కొంతమంది దర్శకులే చేయాలి? కొన్ని ఇండస్ట్రీల్లో రావాలి? కొంతమందే నటించాలి? అని అంటుంటారు. వేరేవాళ్లు ట్రై చేస్తే అంత ఈజీగా అవ్వదు. మరీ గట్టిగా ప్రయత్నించి చేస్తే దెబ్బ కొట్టేసే అవకాశమూ ఉంది. ఇలాంటి డౌట్స్‌తోనే ఓ సినిమా టాలీవుడ్లో ఇంకా పట్టాలెక్కలేదా? ఏమో అదే డౌట్ అని అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఆ సినిమానే శింబు హీరోగా వచ్చి భారీ విజయం అందుకున్న ‘మానాడు’. తెలుగులో ‘లూప్’ అనే పేరుతో రిలీజ్ చేస్తాం అన్నారు కానీ అవ్వలేదు.
ప్రతి హీరో రీఎంట్రీకి ఎలాంటి హిట్ పడాలి అనుకుంటారో, అలాంటి హిట్ ‘మానాడు’తో వచ్చింది శింబుకి. థియేటర్లలో తెలుగులోనూ ఆ సినిమాను చూద్దాం అనుకునేవారికి… ముందు రోజు షాక్ ఇచ్చింది టీమ్. తెలుగులో సినిమా రిలీజ్ చేయడం లేదు అని చెప్పింది. దీంతో తమిళంలోనే చూశారు కొంతమంది. అయితే ఓటీటీలో మాత్రం తెలుగు వెర్షన్ ఉంచారు. ఎందుకిలా అని అనుకుంటుండగా, ఆ సినిమాను తెలుగులో ప్రముఖ నిర్మాణ సంస్థ రీమేక్ చేస్తోందని వార్తలొచ్చాయి. అయితే ఎవరెవరో కాదు, మా దగ్గరే రైట్స్ ఉన్నాయి అంటూ సురేశ్ ప్రొడక్షన్స్ ప్రకటన ఇచ్చింది.
అదే సమయంలో ‘మానాడు’ డైరక్టర్ వెంకట్ ప్రభుతో నాగచైతన్య సినిమా అని వార్తలొచ్చాయి. దీంతో ఆ సినిమా ఇదే అని అనుకున్నారు. కానీ ఇది వేరే కథ అని చెప్పేశారు. దీంతో ‘మానాడు’ సంగతి పక్కకు వెళ్లిపోయింది. అలా సైడైన సినిమా.. ఇంకా ముందుకు రాలేదు. రైట్స్ కొనేసి సినిమాను అలా మూలకు పెట్టేయడం వెనుక కారణమేంటో తెలియడం లేదు. ఇక్కడ ఆ సినిమాకు తగ్గ దర్శకుడు దొరకలేదా? లేక హీరోనే దొరకలేదా అనేది తెలియడం లేదు.
ఎందుకంటే ఈ సినిమా కాన్సెప్ట్. నార్మల్ కమర్షియల్ సినిమా స్టైల్లో ఆ సినిమా ఉండదు. టైమ్ లూప్‌లో సినిమా సాగుతుంటుంది. హీరోలో మల్టిపుల్ షేడ్స్ ఉంటాయి. సినిమాలో జరిగిందే జరుగుతూ ఉంటుంది. దీన్ని ఎంతో జాగ్రత్తగా చెబితే కానీ అర్థం కాదు. లేదంటే ఇదేంటి ఇలా ఉంది అని నవ్వొచ్చేస్తుంది. మరి తెలుగులో ఎప్పుడు లైవ్‌లోకి తెచ్చి సినిమా చేస్తారో చూడాలి.