Pushpa movie: రెండు పార్టులు ఓకే.. మరి లింక్ మాటేంటి?
May 13, 2021 / 01:03 PM IST
|Follow Us
అల్లు అర్జున్ పాన్ ఇండియా ఎంట్రీకి సిద్ధమవుతున్న చిత్రం ‘పుష్ప’. అయితే ఉన్నట్లుండి ఇటీవల రెండు పార్ట్‌ల పుకార్లు మొదలయ్యాయి. ఏదో బజ్ కోసం అంటున్నారేమో అని అందరూ అనుకున్నారు. అయితే ‘పుకార్లు నిజమే’ అంటూ నిర్మాత ప్రకటించేసరికి అందరికీ ‘అవునా!’ అంటూ ఆశ్చర్యపోతున్నారు. అభిమానులైతే భలే అనుకుంటున్నారు. అయితే ఇక్కడో కీలకమైన ప్రశ్న ఉంది. అదే సినిమాలో ‘కట్టప్ప’ ఎవరు అని. కట్టప్ప అంటే పాత్ర కాదు… ట్విస్ట్.
సినిమా ఒక పార్ట్ అయినప్పుడు ఇంటర్వెల్ బ్యాంగ్ బలంగా ఉండాలి అంటారు. అదే రెండు పార్టులు తీసినప్పుడు ఇంటర్వెల్ బ్యాంగ్తోపాటు, ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్ ఇంకా బలంగా ఉండాలి. రెండో పార్ట్ కోసం ప్రేక్షకులు ఆసక్తికగా ఎదురు చూడాలి అంటే తప్పదు మరి. ‘బాహుబలి’లో #WKKB అంటూ ఓ హ్యాష్‌ట్యాగ్ మెయింటైన్ చేశారు. అదే ‘బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు?’. ఈ మాటను సెలబ్రిటీలతో, వివిధ షోల్లో, ఇంటర్వ్యూల్లో మాట్లాడించి సినిమా మీద ఇంట్రెస్ట్‌ను పెంచారు.
‘పుష్ప’ సినిమా రెండు భాగాలుగా వస్తుంది అంటే… అలాంటి పాయింట్ ఏదో ఒకటి పట్టుకోవాలి. ఇలాంటి విషయాల్లో సుకుమార్‌కు మంచి టాలెంట్ ఉంది. కాబట్టి ఏదో ఒకటి చేసి… ఆ హుక్ పాయింట్ క్రియేట్ చేసుకుంటాడు. ఈ లెక్కన సినిమాలో ఇద్దరు విలన్లు ఉంటారని, ఫహద్ ఫాజిల్ సెకండ్ పార్ట్‌లోనే ఎక్కువగా ఉంటాడని అంటున్నారు. ఫస్ట్ పార్ట్ ఆఖరిలో వచ్చి… సినిమాను హైలో కూర్చోబెట్టి.. సెకండ్ పార్ట్‌లో నేనేంటో చూపిస్తా అని వెళ్లిపోతాడట. మరిది నిజమా… లెక్కల మాస్టారు సుక్కు ఏం ఆలోచిస్తున్నారు అనేది తెలియాలి.