Krishna Biopic: మహేష్ అప్పుడు చెప్పారు.. ఇప్పుడు చేస్తారా?
November 21, 2022 / 11:37 AM IST
|Follow Us
వివిధ రంగాల్లోని వ్యక్తుల బయోపిక్స్ సినిమాల్లో విరివిగా వస్తూ ఉంటాయి. వాళ్ల వాళ్ల రంగాల్లో సాధించిన ఘనతలు, వాళ్ల గొప్పతనాలను సినిమాల్లో చూపిస్తూ ఉంటారు. అయితే సినిమా వాళ్ల జీవితాన్ని బయోపిక్‌గా చూపించాలి అంటే మాత్రం అంత ఈజీగా కాదు. ఎందుకంటే వాళ్ల జీవితం అప్పటికే అందరికీ తెలిసి ఉంటుంది. దీంతో సినిమా వాళ్ల బయోపిక్స్ కత్తి మీద సాము అంటుంటారు. అయితే సినిమా రంగంలో డేరింగ్ అండ్ డాషింగ్‌గా పేరు తెచ్చుకుని, ప్రజా జీవితంలో మచ్చ లేనివారి జీవితాన్ని చూపించడం సులువే అని చెప్పాలి.
అలా ఇటీవల దివంగతులు అయిన ప్రముఖ నటుడు కృష్ణ బయోపిక్స్ ఎప్పుడు తీస్తారు అని ఓ ప్రశ్న వినిపిస్తోంది. ఘట్టమనేని కృష్ణగా కెరీర్‌ను ప్రారంభించి నటశేఖర, సూపర్ కృష్ణగా తనువుచాలించినంత వరకు ఆయన జీవితం ఎందరికో ఆదర్శం. ఉన్నతస్థానాలకు ఎదగాలనుకునేవారికి ఆయన జీవితం ఓ పాఠం. అందుకే ఆయన జీవిత కథను నేటి తరం కుర్రాళ్లకు, జనాలకు అందించాలనే వాదన వినిపిస్తోంది. అయితే, గతంలోనే దీని గురించి చర్చ వచ్చింది.
ఓ సందర్భంగా మహేష్‌బాబు మాట్లాడుతూ నాన్న బయోపిక్ చేస్తానంటే నేను నిర్మాతగా ఉంటాను అంటూ ముందస్తు ఆఫర్ ఇచ్చేశాడు. అయితే అప్పట్లో ఈ మాటలు కాస్త చర్చకు కారణమైనా.. ఆ తర్వాత మళ్లీ చర్చ రాలేదు. అయితే ఇప్పుడు కృష్ణ మనకు దూరమవడంతో ఆయన బయోపిక్ టాపిక్ వస్తోంది. అయితే కృష్ణ కథను చూపించాలంటే చాలా దమ్ము కావాలి. అలాంటి దమ్మున్న దర్శకుడు ఎవరు అనే విషయంలో మహేష్ జాగ్రత్తగా ఉండాలి.
ఎందుకంటే కృష్ణ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు, చర్చలు ఉపచర్చలు, డేరింగ్ నిర్ణయాలు, డాషింగ్ ఆలోచనలు ఉన్నాయి. వాటిని ఉన్నది ఉన్నట్లు చూపించాలి. ఏమాత్రం అతిశయోక్తి అనిపించినా, తక్కువగా అనిపించినా అభిమానులు ఒప్పుకోరు. దానికితోడు ఎన్టీఆర్ లాంటి నటుడితో ఆయన ముఖాముఖికి కూడా దిగారు. ఈ నేపథ్యంలో కృష్ణ జీవితాన్ని హుందాగా, పక్కాగా తీయగలిగే దర్శకుడు ఎవరో మహేష్ త్వరగా వెతికి పట్టుకోవాలి. అలాగే నటుణ్ని కూడా.