Chiranjeevi: చిరంజీవి ఆ విషయంలో అంత పక్కాగా ఎందుకబ్బా!
January 13, 2022 / 10:37 PM IST
|Follow Us
‘‘నేను టాలీవుడ్‌కి పెద్దగా ఉండాలనుకోవడం లేదు. ఇండస్ట్రీకి బిడ్డగానే ఉంటాను’’… కొన్ని రోజుల క్రితం చిరంజీవి మాట్లాడిన మాట ఇది. నేను పెద్దరికం తీసుకోను, అలాంటి ఆలోచన లేదు అంటూ ఆయన ఇంకాస్త గట్టిగా నిలబడ్డాడు. ఆ రోజు ఏదో ఫ్లోలో, లేకపోతే ఇంకేదో బాధతో అన్నారేమో అనుకున్నారు కొంతమంద చిరంజీవి అభిమానులు, సగటు ప్రేక్షకులు. అయితే ఆయన ఆ రోజు అన్నది ఏదో ఫ్లోలోనే, కోపంతోనో కాదు… పక్కాగా ఆ మాట మీద నిలబడి ఉన్నారు అనేది ఈ రోజు మరోసారి అర్థమైంది.
ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ రేట్లు, పరిశ్రమ సమస్యల గురించి ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డితో మాట్లాడటానికి చిరంజీవి ఈ రోజు తాడేపల్లి వెల్లిన విషయం తెలిసిందే. సమావేశం పూర్తయిన తర్వాత తిరిగి హైదరాబాద్ బయలుదేరే ముందు మీడియాతో మాట్లాడారు చిరంజీవి. ఈ సందర్భంగా ఆయన భేటీలో జరిగిన విషయాలు చెబుతూ… ఓ మాట అన్నారు. ఆ మాటే చిరంజీవి ‘పెద్ద’రికం విషయంలో ఎంత పక్కాగా ఉన్నారో తెలియజేస్తోంది. పరిశ్రమ సమస్యల్ని ఇండస్ట్రీ పెద్దగా కాదు, ఇండస్ట్రీ బిడ్డగా సీఎం జగన్‌తో మాట్లాడాను అని చెప్పారు.
టాలీవుడ్ పెద్దరికం గురించి గత కొన్నేళ్లుగా చర్చ నడుస్తోంది. దాసరి నారాయణరావు దివంగతులు అయినప్పటి నుండి ఈ చర్చ జరుగుతూనే ఉంది. ఎవరు అవుతారు, ఎవరికి ఆ అధికారం ఉంది అంటూ చిరంజీవి – మోహన్‌బాబు మధ్య అప్రకటిత పోరు నడుస్తోంది. చిరంజీవి తాజాగా ‘పెద్ద’రికం వద్దంటూ తెగేశారు. అయితే అంతగా ఎందుకు తెగేసి చెప్పారు అనేది ఇప్పుడు ప్రశ్న. చిరు మనసును అంతగా బాధపెట్టిన సందర్భం ఏంటి, మనిషి ఎవరు అనేదే ఆ చర్చ సారాంశం.
గత కొన్నేళ్లుగా టాలీవుడ్‌కి కష్టం వచ్చినప్పుడల్లా, అంతెందుకు ఇప్పుడు కూడా ఆ ఇద్దరిలో చిరంజీవే తొలుత ముందుకొచ్చారు. కానీ పెద్దరికం మాత్ర వద్దంటున్నారు. ‘ఈ వయసులో నాకెందుకు బరువు’ అనుకున్నారా? లేక ఎలాంటి బరువు లేకుండా సమస్యలు తీరిస్తే ఆటోమేటిగ్గా పెద్దరికం వచ్చేస్తుందని అనుకున్నారా? అనేది తెలియాల్సి ఉంది. కానీ ‘పెద్ద’రికం అనే మాట వింటే చిరంజీవి ‘నో’ అనడానికి కారణం ఆయన మరోసారి క్లారిటీ ఇస్తే బాగుండు.