Chiranjeevi: గమ్మనుండమని ఏం సాధించారు చిరంజీవి గారూ..!
February 5, 2022 / 09:17 AM IST
|Follow Us
సినిమా టికెట్ల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒంటెద్దు పోకడలపై సినిమా పరిశ్రమ అప్పుడప్పుడే గొంతు విప్పుతున్న రోజులవి. పవన్ కల్యాణ్ గళమెత్తితే… నోరు కట్టేసుకున్న, కట్టేసిన సమయమది. నాని నోరెత్తితే… వైఎస్ఆర్సీపీ నాయకులు విమర్శలు ఎక్కుపెట్టిన రోజులవి. ఇక రెండు వర్గాల మధ్య మాటల యుద్ధం పక్కా… ఇదెక్కడికి దారి తీస్తుందో అని అందరూ అనుకుంటుండగా… చిరంజీవి రంగంలోకి దిగారు. ‘సినిమా బిడ్డను’ అంటూ ఏపీ సీఎంతో మాట్లాడారు. బయటకొచ్చి… ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పెద్దల్ని ఏమీ అనొద్దు. అన్నీ సవ్యంగా సాగుతాయి.
మనం ఆశించిన మంచి రోజులొస్తాయి అని చెప్పారు. కానీ ఆ మాట ఆయన చెప్పి 20 రోజులైంది. ఇప్పటివరకు నో ఛేంజ్. ‘‘ఇండస్ట్రీ వాళ్లు ఎవరూ వ్యక్తిగతంగా స్టేట్మెంట్లు ఇవ్వొద్దు. ఇది నేను ఇండస్ట్రీ పెద్దగా కాదు.. సినిమా బిడ్డగా విజ్ఞప్తి చేస్తున్నా. త్వరలోనే ఆమోదయోగ్యమైన జీవో వస్తుందనే నమ్మకం ఉంది. నేను ప్రస్తావించిన విషయాలన్నింటినీ సీఎం జగన్ అర్థం చేసుకోవడం ఆనందంగా ఉంది. ఈ చర్చ గురించి పరిశ్రమలోని పెద్దలకు వివరిస్తా.
వారు ఏమైనా సూచనలిస్తే వాటిని తీసుకుని మరోసారి సీఎంను కలుస్తా. త్వరలోనే అన్నింటికీ ఫుల్స్టాప్ పడుతుంది’’ చిరంజీవి ఈ మాటలు చెప్పిన 20 రోజులు అయ్యింది. ఈ విషయం మీకు గుర్తుండే ఉంటుంది. ఏపీ సీఎం జగన్, ఆయన సతీమణి భారతి చక్కటి ఆతిథ్యం ఇచ్చారని, సినిమా పరిశ్రమ కష్టాలన్నీ విన్నారని, దీనిపై కూలంకషంగా చర్చించి త్వరలో అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామని జగన్ అన్నారని చిరంజీవి చెప్పారు. అంతటితో ఆగకుండా.. జగన్ ప్రభుత్వాన్ని, జగన్ అనుచర గణాన్ని పల్లెత్తు మాట అనొద్దు అంటూ ఓ ఉచిత సలహా కూడా ఇచ్చారు చిరంజీవి.
ఆయన మాట అంటే గౌరవమో, ఇంకేంటో కానీ… ఇండస్ట్రీ నుండి ఆ తర్వాత ఎలాంటి కామెంట్లు రాలేదు. అన్నట్లు ప్రభుత్వ పెద్దలు, ప్రభుత్వ వ్యక్తుల నుండి కూడా కామెంట్లు రాలేదు. ఇక్కడివరకు ఓకే… చిరంజీవి చెప్పినట్లు ప్రభుత్వం నుండి టికెట్ రేట్ల విషయమై ఎలాంటి స్పందన కూడా లేకపోవడం గమనార్హం. జగన్ మంచే చేస్తారని చెప్పిన చిరంజీవి ఆ తర్వాత కరోనా బారిన పడి అందుబాటులో లేకపోయారు. ఇప్పుడు ఏపీలో ఏమో పీఆర్సీ – ఉద్యోగుల సమస్యలు ఉన్నాయి.
అవి తేలేంతవరకు ఇంకే విషయమూ అక్కడ చర్చకు వచ్చేలా లేదు. దీంతో టికెట్ ధరల విషయం కొలిక్కి వచ్చేలా లేదు. చిరంజీవి పరిశ్రమ నోరు కట్టేసినా పరిశ్రమ మంచి జరిగితే ఓకే. ఎలాంటి మంచి లేకపోగా ఇంకా తలనొప్పులు కొనసాగుతుండటం ఇబ్బందికరమే. పెద్దరికం తీసుకున్న చిరంజీవి మరోసారి అలాంటి ప్రయత్నం చేస్తారా? అనేది చూడాలి.