Manchu Vishnu: ‘మా’ అధ్యక్షుడు అయ్యాక… ఏదో చేస్తారు అనుకుంటే..?
December 27, 2021 / 04:56 PM IST
|Follow Us
ఒక సంఘానికి అధ్యక్షుడిగా ఉంటే… ఏం చేయాలి? ఆ సంఘంలో ఎవరికే కష్టం వచ్చినప్పుడు వెన్నంటే ఉండాలి. ఆ సంఘానికి అవసరమైనప్పుడు అన్నీ తానై ముందు నిలవాలి. ఈ రెండూ చేయనప్పుడు ఏం చేయాలి. ఇక ఆ సంఘం సభ్యులే తమకు దిక్కున్న చోటకు వెళ్లాలి. ఇప్పుడు ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్’ పరిస్థితి ఇలానే తయారైందా? అవుననే అంటున్నారు సినిమా రంగ పరిశీలకులు. కారణం కొత్తగా ‘మా’ కిరీటం పెట్టుకున్న వ్యక్తి ఇప్పుడు అందుబాటులో లేకపోవడమే.
నాయకుడు ఎక్కడున్నా, ఏం చేసినా… ఆఖరిగా ఆ సంఘం సభ్యులకు మంచి జరగాలి. లేదంటే మంచి జరుగుతుంది అని హామీ ఇచ్చేలా అయినా ఉండాలి. కానీ సినిమా నటుల పరిస్థితి అలా లేదనే చెప్పొచ్చు. గత కొన్ని రోజుల క్రితం వరకు అన్నీ తానై ఇండస్ట్రీని నడిపిస్తా అంటూ అనధికారిక నాయకుడిగా నిలిచిన వ్యక్తి చిరంజీవి. అయితే ‘మా’ ఎన్నికల తర్వాత ఆయన నెమ్మదించారు. ఫలితాల ప్రభావమో ఇంకొకటో కానీ… ఆయన కామ్ అయ్యారు. ఇప్పుడు మళ్లీ యాక్టివ్ అవుతున్నారని టాక్ వస్తున్నా, నో క్లారిటీ.
కొత్తగా ఎంపికైన అధ్యక్షుడు వచ్చిన కొత్తలో వరుస పథకాలు, ప్రాజెక్టులు, ఎంపికలు, కమిటీలు వేశారు. దీంతో ‘మా’ పరుగులు పెడుతుంది అనుకున్నారు. ఈలోగా రిజైన్ చేసిన ప్రకాశ్‌రాజ్ ప్యానల్ సభ్యుల రాజీనామాలు ఆమోదించి ఆ పని పూర్తి చేశారు. కొత్త వాళ్లను తీసుకోవడమూ ఓకే. ఇదంతా ఆయన ప్యానల్, ‘మా’ వరకు. మరి ‘మా’ సభ్యులు హీరోలుగా, నటులుగా చేస్తున్న సినిమాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒంటెద్దు పోకడల వల్ల ఇబ్బందులు పడుతున్నాయి. మరి దీని సంగతి తేల్చేదెవరు.
అప్పడెప్పుడో సినిమా టికెట్ ధరలపై స్పందించిన పవన్ కల్యాణ్ మీద స్పందించిన పవన్ కల్యాణ్ మీద ఏపీ మంత్రులు విమర్శల జడివాన కురిపించారు. ఇటీవల నాని కూడా అలానే స్పందిస్తే… ఏపీ మంత్రులు తమ పాత ధోరణిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో నానికి కూడా సపోర్టు లేదు. పక్క పరిశ్రమ నుండి సిద్ధార్థ్ స్పందించాడు కానీ… ఇంకే హీరో కూడా రాలేదు. ‘మా’ నాయకుడే ముందుకు రాలేదు… మేమెంత అనుకున్నారో ఇంకేం అనుకున్నారో తెలియదు.
నిర్మాతల మండలి వైపు నుండి ఇదే పరిస్థితి. శోభు యార్లగడ్డ తప్ప ఇంకెవరూ స్పందించలేదు. మిగిలిన వాళ్ల సినిమాల విడుదలలు ఉన్నాయి కాబట్టి స్పందించలేదేం అనుకోవాలా? లేక ఇంకేంటో తెలియడం లేదు. అలా అయితే ఇప్పుడు నాని ఎందుకు స్పందించినట్లు. ఆయన సినిమా విడుదలకు ముందు రోజే అన్నాడు మాటలు పడ్డాడు. ఇదంతా పక్కన పెడితే… మనవాళ్లను ఒక మాటంటే పడేది లేదు, మాటకు మాట, చేతకు చేత అన్న నాయకుడు… ఇన్నేసి మాటల బరువు ఎందుకు మోస్తున్నారో? ఎప్పుడు బరువుకు దించి, మాట్లాడతారో… సారూ మాట్లాడితే ముత్యాలు రాలిపోతాయా?