నాగార్జున – రాజ శేఖర్ల మల్టీస్టారర్ ఎందుకు ఆగిపోయిందంటే..
February 8, 2023 / 05:36 PM IST
|Follow Us
సినిమా ఇండస్ట్రీలో ముందుగా ఒక కథ రాసుకుని, దానికి తగ్గ హీరోని వెతుక్కుని.. ఆ కాంబినేషన్‌కి సెట్ అయ్యే నిర్మాణ సంస్థ.. ఆ తర్వాత సాంకేతిక నిపుణులు, ఇతర తారాగణాన్ని సెలెక్ట్ చేసుకుని.. సదరు సినిమా కొబ్బరికాయ కొట్టిన దగ్గరి నుండి గుమ్మడికాయ కొట్టే వరకు.. దాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే వరకు తెరవెనుక దర్శక నిర్మాతలు పెద్ద యుద్ధమే చేయాల్సి ఉంటుంది.. అన్నీ అనుకున్నట్టే జరిగినా కానీ పలు కారణాలతో మధ్యలోనే ఆగిపోయినవి.. లేదా, ప్రారంభోత్సవం జరుపుకుని పట్టాలెక్కలేనివి చాలా చిత్రాలే ఉంటాయి.
అటువంటి వాటిలో.. ‘యువసామ్రాట్’ అక్కినేని నాగార్జున – ‘యాంగ్రీ యంగ్ మెన్’ డా. రాజ శేఖర్ల క్రేజీ కాంబోలో ఓపెనింగ్ జరుపుకున్న మూవీ కూడా ఒకటి.. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.. అప్పటికి నాగార్జున, రాజ శేఖర్ ఇద్దరూ ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ మీద నాగార్జున అన్నయ్య అక్కినేని వెంకట్ నిర్మాతగా.. నాగార్జున, సూపర్ స్టార్ కృష్ణలతో 1992లో ‘వారసుడు’ తర్వాత 1994లో ‘హలో బ్రదర్’ వంటి భారీ హిట్ ఇచ్చిన స్టార్ డైైరెక్టర్ ఈవీవీ సత్య నారాయణ దర్శకుడిగా ఓ భారీ మల్టీస్టారర్ ప్లాన్ చేశారు.
ఈవీవీతో రాజ శేఖర్ పనిచేయడం తొలిసారి.. కథ, కథనాలు సిద్ధమయ్యాయి. దీంతో పూజా కార్యక్రమాలతో ప్రారంభించాలని మూహూర్తం ఫిక్స్ చేశారు. 1994 నవంబర్ 30 రాత్రి 9 గంటలకు.. నాగ్ – రాజ శేఖర్ మీద కృష్ణ క్లాప్ నివ్వగా.. ’విక్టరీ’ వెంకటేష్ కెమెరా స్విచ్చాన్ చేశారు. ‘‘మనం చేసే ఈ మంచిపని సక్సెస్ అయ్యే తీరుతుంది.. ఓకేనా’’ అనే డైలాగ్‌ని హీరోలిద్దరూ ఒకరికొకరు చెప్పుకోవడాన్ని ముహూర్తం షాట్‌గా చిత్రీకరించారు.
ఆర్టిస్టుల కాల్షీట్లను బట్టి షూటింగ్ ఎప్పటినుండి కొనసాగిస్తామనేది త్వరలో తెలియజేస్తామని నిర్మాత అక్కినేని వెంకట్ చెప్పారు. తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. హీరోలిద్దరూ బిజీగా ఉండడం.. ఈవీవీకి వేరే సినిమాల కమిట్మెంట్ కారణమని చెప్తుంటారు. అలా మంచి కాంబినేషన్ మిస్ అయిపోయింది. కొంతకాలానికి ఈవీవీ.. నాగార్జునతో ‘ఆవిడా.. మా ఆవిడే’.. రాజ శేఖర్‌తో ‘నేటి గాంధీ’ సినిమాలను తెరకెక్కించారు.