అమితాబ్, చిరు, పవన్ లకు సీఎం కుర్చీ అందనిది అందుకే..!
March 12, 2020 / 04:28 PM IST
|Follow Us
సినిమా స్టార్స్ సీఎం కుర్చీ ఎక్కడం అనేది పాత ట్రెండ్. ట్రెండ్ పాతదైనప్పుడు దాని వలన వచ్చే ఫలితం కూడా నెగెటివ్ గానే ఉంటుంది. అందుకే బాలీవుడ్ లో అమితాబ్, టాలీవుడ్ లో చిరంజీవి లాంటి వాళ్ళు ప్రయత్నించి వల్ల కాక వదిలేశారు. ఇక పవన్ కళ్యాణ్ లాంటి వారు ఇంకా ఆ సీఎం కుర్చీ ఎక్కాలని పోరాడుతూనే ఉన్నారు. అనూహ్యంగా ఆయన మొదటిసారి పోటీ చేసిన రెండు చోట్ల పరాజయం పొంది అబాసుపాలయ్యారు. నన్ను సీఎం కాకుండా ఎవరు ఆపుతారో చూస్తానంటూ ప్రగల్బాలు పలికిన పవన్ కనీసం… ఎమ్ ఎల్ ఏ గా కూడా గెలవకపోవడం, సినిమా వాళ్లపై జనాలకు ఎలాంటి నమ్మకం ఉందో చెప్పడానికి ఒక నిదర్శనం.
ఇక మన పొరుగు రాష్ట్రం తమిళనాడులో సైతం ఇద్దరు టాప్ స్టార్స్ రాజకీయాలలోకి ప్రవేశించారు. అందులో ఒకరు కమల్ హాసన్ కాగా మరొకరు రజిని కాంత్. కమల్ ఇప్పటికే మక్కల్ నీది మయ్యన్ అనే పార్టీ పెట్టడంతో పాటు రాజకీయంగా క్రియాశీలకంగా ఉంటున్నారు. రజిని మాత్రం అటూఇటూ ఊగిసలాడుతున్నారు. ఇక తాజాగా ఆయన నాకు సీఎం కావాలని లేదు.. ఒకవేళ తన పార్టీ గెలిచినా ఓ విద్యావంతుడైన యువకుడిని సీఎం చేస్తాను అన్నారు. ఇది ఒకింత ఆయనకు నష్టం చేకూర్చే స్టేట్మెంట్ అనుకోవచ్చు. అన్ని విధాలుగా ఆయనకు తోడుండే వీరాభిమానులు ఆయన్నే సీఎంగా చూడాలని అనుకుంటారు.
తమిళనాట జయలలిత మరణం తరువాత రాజకీయ అనిశ్చితి నెలకొనివుంది. అధికార పక్షంలో చీలికలు ఉండగా ప్రతిపక్షం కూడా అంత బలంగా లేదు. రజిని లేదా కమల్ బాగా కష్టపడి ప్రజలని నమ్మించగలితే వీరిని ప్రత్యామ్నాయంగా భావించి ప్రజలు గెలిపించే అవకాశం కలదు. ఇది వారి ఎంట్రీ కి రైట్ టైమ్. చిరంజీవి రాంగ్ టైమ్ లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి విఫలం చెందారు. వై యస్ మరణం తరువాత వచ్చిన 2014 ఎలక్షన్స్ లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినట్లైతే ఫలితం వేరుగా ఉండేది. ఎన్టీఆర్ 9నెలల్లో సీఎం కావడానికి ప్రజలు కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయంగా టీడీపీ ని భావించడమే.
ఇక పవన్ పార్టీ ఆరంభమే అనైతిక పొత్తుతో మొదలైంది. జనసేన 2014ఎన్నికలలో టీడీపీ కి మద్దతుగా నిలిచి ఆ పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించింది. ప్రజా రాజ్యంలో ఉన్నప్పుడు టీడీపీ పై అనేక ఆరోపణలు చేసిన పవన్ టీడీపీ కి మద్దతుగా నిలవడం జనసేన… టీడీపీ, వైసీపీ కి ప్రత్యామ్నాయ పార్టీ కాదు.. ఇది టీడీపీ లో భాగమే అనే భావన జనాల్లోకి వెళ్ళింది. ఇక పార్టీ స్థాపించిన ఈ ఆరేళ్లలో ఆయన అనేక పార్టీలతో పెట్టుకున్న పొత్తుల కారణంగా పవన్ సిద్దాంతం ఏమిటో ఎవరికీ తెలియని పరిస్థితి. ఇలా అనేక కారణాల చేత స్టార్స్ ఆ సీఎం కుర్చీ ఎక్కలేకపోతున్నారు.