Tollywood: ఓటీటీల విషయంలో మన హీరోలు ఇలా తయారయ్యారేంటి?
July 19, 2021 / 06:26 AM IST
|Follow Us
సినిమా ప్రచారంలో బాలీవుడ్, టాలీవుడ్‌కి చాలా తేడా ఉంది. బాలీవుడ్ వాళ్లు… తమ సినిమా ప్రచారం కోసం రకరకాల ఫీట్లు చేస్తుంటారు. ఎఫ్ఎం రేడియోలకు వెళ్లి ఇంటర్వ్యూలు కూడా ఇస్తుంటారు. అయితే మన హీరోలు అలాంటివి తక్కువే. ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్, ఇంటర్వ్యూలు… ఇంతే. అయితే ఇప్పుడు మనవాళ్లు అలాంటివి కూడా మానేశారు. కారణం సినిమాలు ఓటీటీలో వస్తుండటమే అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. థియేటర్లో వేసినా సినిమానే, ఓటీటీలో రిలీజ్ చేసినా సినిమానే. అయితే ఆ సినిమా వస్తోంది అని ప్రేక్షకులకు తెలియడానికి, సినిమాలో స్పెషల్ ఇది అని చెప్పడానికి ప్రచారం చేస్తుంటారు.
ఈ ప్రచారం మొత్తం నిర్మాతలే చూసుకుంటారు. ఇప్పుడు సినిమాలు ఓటీటీకి వస్తుంటే… నిర్మాతలు ఈ విషయాన్ని మరచిపోయినట్లు ఉంది. ఎందుకంటే సినిమా వస్తోంది అనగా పది రోజుల ముందే ప్రెస్ మీట్లు, ఫంక్షన్ల హడావుడి ఉండాలి. కానీ ఓ అగ్రహీరో సినిమా విడుదలకు మూడు రోజులు.. ఇంకా చెప్పాలంటే రెండే రోజులు ఉంది. కానీ పెద్దగా సందడి లేదు. కరోనా ఆంక్షలు తెలంగాణలో పూర్తిగా లేవు. నిబంధనలు, మార్గదర్శకాలు పాటించి ఏ కార్యక్రమమైనా చేసుకోవచ్చు. మరి ప్రచార కార్యక్రమాల విషయంలో ఎందుకు ముందుకు రావడం లేదో. ఇప్పటివరకు సినిమాకు జరిగిన ప్రచారం చూస్తే… ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు హీరో కుటుంబ సభ్యులంతా ఓ ట్వీట్ వేశారు. ఆ తర్వాత చప్పుడే లేదు. తాజాగా టీమ్ ఇంటర్వ్యూలు పెడుతున్నారు.
నిజానికి థియేటర్లో బొమ్మ పడినా ఇలానే జరుగుతుంది. దీంతోపాటు మరింత కార్యక్రమాలతో మరింత సందడి ఉంటుంది. ఓటీటీలకు అవేమీ కనిపించడం లేదు. తీసిన సినిమాను గుత్తగా అంత డబ్బు పెట్టుకుని కొనుక్కున్న సినిమాకు సాదాసీదాగా ప్రచారం చేస్తే ఎలా సరిపోతుంది. థియేట్రికల్ సినిమా అంటే పోస్టర్… టీవీ యాడ్ల వల్ల రీచ్ ఎక్కువగా ఉంటుంది. ఓటీటీ రిలీజ్‌కి ఇలాంటివేవీ ఉండవు. అందుకే ఇప్పటికీ తెలుగు సినిమాలు ఓటీటీ ద్వారా బీ, సీ సెంటర్లకు చేరడం లేదు. ఎందుకంటే వాళ్లకు ప్రచారం ఆ స్థాయిలో ఉండాలి. దీంతో మన తెలుగు సినిమా ఓటీటీ బిజినెస్ సరిగ్గా ఉండటం లేదనే విమర్శలు వస్తున్నాయి.