Tollywood: మాటలు, ట్వీట్లు కాదు.. మూటలు కూడా ఇవ్వండి
May 8, 2021 / 05:03 PM IST
|Follow Us
ఒక సినిమా హిట్ అయ్యింది అంటే… అందులో రిపీట్ ఆడియన్స్‌ది కీలక పాత్ర అని చెప్పాలి. అంటే సినిమాను ఒకసారి మించి చూసేవాళ్లన్నమాట. అంటే సినిమాను ఒకసారి మించి థియేటర్లకు వెళ్లడి చూడటం వల్ల సినిమా ఫలితం ఆధారపడి ఉంటుంది అని. ఈ పని చేసేది ఎక్కువగా అభిమానులే అని చెప్పాలి. తటస్థులు ఒకసారి మాత్రమే చూస్తారు మరి. ఈ విషయం మన హీరోలందరికీ తెలుసు. అయితే వాళ్లకు మరో విషయం తెలియడం లేదా? అదే రిపీట్ సాయం.
కష్టంలో ఉన్నప్పుడు సాయం చేసేవాడికి కోట్ల ఆస్తులు ఉండాలని లేదు. పది రూపాయలు ఉంటే ఐదు రూపాయలు ఇవ్వొచ్చు. ఇంకా లేదంటే రూపాయి ఇవ్వొచ్చు. ఓ పది రోజుల పోతే మళ్లీ కష్టం వస్తే మిగిలిన ఐదు రూపాయలో, తొమ్మది రూపాయల నుండి ఇంకొంచెం సాయం చేయొచ్చు. కానీ ఒకసారి ఇచ్చేశాం కాబట్టి మళ్లీ ఇవ్వక్కర్లేదు అని అనుకుంటే ఎలా. స్టార్ హీరోలు, యువ స్టార్లుగా వెలుగొందుతున్న మన హీరోలకు ఈ విషయం అర్థం కావడం లేదా.
అయినవాడికి కష్టమొస్తే అర క్షణం ఆగను, తిరిగిచ్చేకపోతే లావైపోతారు, సాయం చేయడం మానవ ధర్మం లాంటి డైలాగ్‌లు చెప్పే హీరోలు… ధైర్యంగా ఉందాం, కరోనాను ఎదుర్కొందాం, కడుపు తరుక్కుపోతోంది అంటూ కన్నీళ్ల ట్వీట్లు పేరు నటులు మనకు కనిపిస్తున్నారు. మనిషి బతకడానికి అవసరమైన ఆక్సిజన్ సిలిండర్లు, మందులు, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, బెడ్లు లాంటివి ఇప్పిండచంలో ఎందుకు ముందుకు రావడం లేదు. మీ దగ్గర ఉన్నాయి కాబట్టి.. ఆ డబ్బు మొత్తం ఇచ్చేయమని ఎవరూ అడగడం లేదు.
మన శత్రుదేశమైన పాకిస్థాన్ కూడా కరోనా కష్టకాలంలో మన ముందుకు వచ్చింది. పేర్లు రాస్తే పెద్ద జాబితా అవుతుంది కానీ ఇలా మన కష్టకాలంలో స్నేహ హస్తం చాలా దేశాలు అందించాయి. అక్కడి భారతీయ సంతతి జనాలు కూడా తమ వంతు ఉడతా సాయం అందిస్తున్నారు. అవి విమానాల్లో మన దేశంలోకి వస్తున్నాయి. మరి మన దగ్గరే ఉండి సాయం అందించడానికి స్లార్లకు చేతులు రావడం లేదా? లేక ఫస్ట్ వేవ్ అప్పుడు ఇచ్చాం కదా అని ఊరుకుంటున్నారా?
మన తెలుగు సినిమాలు చూసేవారిలో తెలుగు వాళ్లే ఎక్కువ. కాబట్టి వాళ్ల కోసమైనా రెండు రాష్ట్రాల సీఎం సహాయ నిధికి ఏమైనా విరాళాలు ఇస్తున్నారా మన హీరోలు/ హీరోయిన్లు. అంటే ఈ మధ్య కాలంలో అలాంటి ఒక్క వార్త కనిపించలేదు. కష్ట కాలంలో ఆదుకున్నవాడిని దేవుడు అంటారు. అంటే ఒక్కసారి మాత్రమే ఆదుకోండి అని కాదు కదా. అలా అని ప్రతిసారి కష్టం వచ్చినప్పుడు వాళ్లే రావాలని అనుకోవడం లేదు. దేశంలో గత వందేళ్లలో మునుపెన్నడూ చూడని కష్టం, అందులోనూ తెలుగు రాష్ట్రాలు కరోనాతో బెంబేలెత్తిపోతున్న సమయం. ఇప్పుడు కూడా ముందుకు రాను అంటే ఎలా.
మీరు సాయం చేయాలి అంటే… మాస్క్‌లు పెట్టుకొని బయటకు వచ్చి అందరికీ ఆక్సిజన్ సిలిండర్లు ఇమ్మనీ కాదు, ఆహార పొట్లాలు ఇవ్వమని కూడా కాదు. సోనూ సూద్‌లా మారండి చాలు. ఆయన కష్టం వచ్చిన ప్రతి కుటుంబాన్ని కలవడం లేదు కదా. ట్విటర్లో వేడుకుంటే చాలు.. ఆయన రియాక్ట్ అవుతున్నాడు. అలా అని ఆన్నీ అయనే చేయడం లేదు కదా. ఆయనంటే నచ్చినవారో, ఆయన మెచ్చినవారో కొంతమంది ఆయన తరఫున సాయం చేస్తున్నారు.
మీ సినిమాలకు దండలు వేసి, బ్యానర్లు కట్టి, పోస్టర్లకు బొట్లు పెట్టి, కొత్తగా ట్విటర్లో ట్రెండింగ్ పేరుతో యుద్ధాలు చేస్తున్న అభిమానులు ఉన్నారు కదా. వాళ్లకు ఒక్క మాట చెబితే చేస్తారు. మొన్నామధ్య ‘ట్రాఫిక్’ సినిమాలో సూర్య పిలుపిస్తే అభిమానులు ఎంతగా రియాక్ట్ అయ్యి గుండె ఆస్పత్రికి చేరడంలో హెల్ప్ చేశారు కదా. బయట హీరోలు/హీరోయిన్లు చెబితే చేయరా. ‘నా మాట వినని వాళ్లు నా అభిమానులు కాదు’ అని ఒక్క స్టేట్మెంట్ ఇవ్వని ఎందుకు వినరో చూద్దాం. అయితే ఆ సమయానికి డబ్బులు వాళ్లదగ్గర ఉండవు. మీరున్నారు, ఇస్తారనే నమ్మకం చాలు కదా వాళ్లు ఆ పని చేయడానికి.
రక్తదానం చేయండి చిరంజీవి చెబితే గత కొన్నేళ్లుగా ఏటా ఒకసారి అభిమానులు వచ్చి ఇస్తూనే ఉన్నారు. సంఘాలు పెట్టుకొని బ్రెడ్లు, పళ్లు పంచుకున్నవాళ్లూ ఉన్నారు. ఇదేదో ఒకరిద్దరి హీరోలు, హీరోయిన్లకు కాదు. చాలామంది స్టార్లకు ఇలాంటి అభిమానులు ఉన్నారు. వాళ్లంతట వాళ్లు ముందుకొచ్చే పరిస్థితులు లేవు. ఆ సంగతి హీరోలకూ తెలుసు. పిలుపిచ్చి, ఆర్థికంగా ఊతమిస్తే సాయం చేయని వారుంటారా? అందుకోనివారుంటారా?
దేశంలో ఆక్సిజన్ కోసం , టీకా కోసం జనాలు పడుతున్న కష్టం చూస్తూనే ఉన్నారు. మీరు చూడకపోయినా మీ సోషల్ మీడియా టీమ్ చూస్తూనే ఉంటుంది కదా. అన్నట్లు ఈ మధ్య నిర్మాతలు కలసి మీ కష్టం ట్వీట్ చేయండి సాయం చేస్తాం అన్నారు. తీరా ఆ సాయం ఏంటా అని చూస్తే ‘సాయం కోసం చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేయడం’. ఇదో విధంగా రిక్వెస్ట్ ఎక్కువమంది చేరడానికి ఉపయోగపడుంది. అంతేకానీ కష్టం తీర్చేది కాదు. కనీసం నిర్మాతలు ఆ పనైనా చేస్తున్నారు. స్టార్లు ఏం చేస్తున్నారని.
కరోనా బాధితులకు ఆహారం ఉచితంగా ఇస్తామంటూ ఎంతో మంది ముందుకొస్తున్నారు. వాళ్ల తాహతుకు తగ్గట్టుగా చేస్తున్నారు. మీరు తింటున్న తిండికి కారణం అభిమానులు కాదా. వాళ్లు టికెట్ తీసిన డబ్బులతోనే కదా మీకు పారితోషికం ఇస్తున్నారు. అందులో కొంతైనా ఈ కష్టం కాలంలో ఇవ్వలేరా? మీరు ఇచ్చే వినోదం ఎప్పుడూ అవసరమే… దేశంలో కష్టంలో ఉన్న తరుణంలో మీరు చేసే సాయం అంతే అవసరం. కష్టం చెప్పి రాదు… వచ్చాక చెబితే పోదు. అలాగే సాయం ఒక్కసారే చేయాలని లేదు… అవసరమైనప్పుడు చేస్తే సరి. మరి జనాల అవసరం కనిపించడం లేదా? స్టార్లూ.
ఆ మధ్య ఒకాయన సినిమా నటుల్ని హీరోలు అంటున్నాం. అసలు హీరోలు వీళ్లు కాదు బోర్డర్లో సైనికులు అని ఆ మధ్య ఎవరో సీనియర్ నటుడు ఒకాయన అన్నారు. ఆయన మాటల్ని నిజం చేయకుండా… అవసరమైనప్పుడు సాయంగా మేమున్నాం అని ముందుకు రాకూడదా?