Vijay Devarakonda: అన్నేసి మాటలు అని ఊరుకుంటే ఎలా?
August 29, 2022 / 07:53 AM IST
|Follow Us
నోరా వీపునకు చేటు తేకే… అని అంటుంటారు పెద్దలు. మీకు కూడా ఈ విషయం తెలిసే ఉంటుంది. అంటే నోటితో ఏమన్నా అంటే.. ఆ తర్వాత దెబ్బ పడేది వీపు మీదే. కాబట్టి మాటలు జాగ్రత్తగా ఉంటే దెబ్బలు పడవు అని చెబుతుంటారు. దీన్ని సినిమాలకు అన్వయిస్తే.. ప్రచారంలో మన మాట్లాడే మాటలు.. ఆ తర్వాత సినిమా ఫలితం బట్టి రివర్స్‌లో బూమరాంగ్ అవుతాయి అని చెబుతుంటారు. ట్రోల్స్, మీమ్స్ కాలంలో హీరోలు, దర్శకులు, హీరోయిన్లు ఏదేదో మాట్లాడేస్తే ఆ తర్వాత సినిమా ఫలితం తేడా కొడితే అవి కత్తుల్లా వెనక్కి వస్తాయి.
‘లైగర్’ సినిమా విషయంలో విజయ్ దేవరకొండ మాట్లాడిన మాటలు ఇప్పుడు ఆయనకు నైట్ మేర్స్ అవుతున్నాయి అంటున్నారు. ‘ఆగస్టు 25న దేశాన్ని షేక్ చేస్తాం’ అంటూ ‘లైగర్’ సినిమా మీద హైప్ పెంచేలా మాట్లాడాడు విజయ్. ఒక దగ్గరే కాదు ఎక్కడికెళ్లినా ‘వాట్ లగాదేంగే’ అంటూ అదేదో యాంథమ్‌లా ఆలపిస్తూ వచ్చారు విజయ్ దేవరకొండ, ఛార్మి. ఇప్పుడు ‘లైగర్’ విడుదలయ్యాక ఒక్కరు మాట్లాడటం లేదు. సినిమా ఫలితం గురించి పీఆర్ టీమ్ కంఠశోష తప్ప ఇంకేం కనిపించడం లేదు.
తన సినిమా గురించి సోషల్ మీడియాలో రెచ్చిపోయి ప్రచారం చేసిన విజయ్.. ఇప్పుడు ఎలాంటి ఉలుకూ పలుకూ లేకుండా ఉన్నాడు. ‘‘సినిమా ఫలితం తేడా కొట్టింది కదా ఎలా మాట్లాడతాడు మీరు అడగడం కాకపోతే’’ అని అనొచ్చు. అయితే ‘లైగర్’ సినిమా ప్రచారంలో భాగంగా విజయ్ చూపించిన యాటిట్యూడ్, అన్న మాటలే ఈ ప్రశ్న వేసే అవకాశం ఇస్తున్నాయి. ‘‘గతంలో ‘సినిమా అదిరిపోతుంది’ అని అంటే.. తనను ఎవరూ పట్టించుకోలేదని, యాటిట్యూడ్ అన్నారని. కానీ నేను ఎప్పుడూ నిజాలే చెప్పాను’’ అని విజయ్ ఆ మధ్య అన్నాడు.
‘గీత గోవిందం’ తర్వాత విజయ్ ఎక్కడికెళ్లినా, ఏ సినిమా ప్రచారం చేసినా తన సినిమాలను ఆకాశానికెత్తే ప్రయత్నం చేశాడు. అప్పుడు అలానే రాసిన మీడియా.. ఆ తర్వాత ఆ సినిమా ఫలితం తిరగబడే సరికి ‘విజయ్ అలా అన్నాడు. కానీ ఇలా అయ్యింది’ అని రాశారు. దానికి హర్ట్ అయిన విజయ్.. అలా అన్నప్పుడు తన సినిమా ఫలితం గురించి తనే స్పష్టంగా చెప్పుకుంటే ఈ ఇబ్బంది ఉండదు కదా. కాబట్టి మనమేం అన్నామో.. ఆ మాటలు చుట్టూ తిరిగి మనకే వస్తాయి.