మెగా పద్మవిభూషణ్ ఈవెంట్ పక్కా… ఇండస్ట్రీ కలసి ముందుకొస్తుందా?
January 28, 2024 / 11:46 AM IST
|Follow Us
టాలీవుడ్లో కొందరిది ఒకదారి… చిరంజీవిది ఒక దారి అంటారు. ఎవరికైనా విజయం దక్కినా, పురస్కారం దక్కినా మెగాస్టార్ తక్షణం స్పందిస్తారు. తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. సినిమాలు మంచి విజయం అందుకున్నా ఆయన రియాక్షన్ ఇలానే ఉంటుంది. సినిమా పరిశ్రమ కోసం రెండు రాష్ట్ర ప్రభుత్వాల పెద్దలతో రాయబారం నడిపి మంచి చేసే ప్రయత్నం చేస్తారు. అయితే ఇటీవల ఆయన ‘నేను టాలీవుడ్ పెద్దను కాను’ అని షాకింగ్ కామెంట్ చేశారు. దాని వెనుక ఆయన మీద కొంతమంది చేసిన విమర్శలే అనే విషయం తెలిసిందే.
అయితే, ఇక్కడ ఇప్పుడు ఈ విషయం ఎందుకు చర్చకు వచ్చింది అంటే… ఆయనక తాజాగా పద్మవిభూషణ్ పురస్కారాన్ని కేంద్రం ప్రకటించింది. టాలీవుడ్లో ఈ గౌరవం అందుకున్న అతి కొద్ది మందిలో ఆయన ఒకరు. దీంతో చిరంజీవిని సత్కరించుకోవాలని టాలీవుడ్లో చర్చ నడుస్తోంది. ఈ మేరకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయబోతున్నట్లు తెలుగు సినిమా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు దిల్ రాజు చెప్పారు. త్వరలో వివరాలు చెబుతాం అని అన్నారు కూడా. అయితే ఇప్పుడు చర్చ డేట్ కాదు… ఎంతమంది కలిసొస్తారు అని.
టాలీవుడ్ అంతా ఒక్కటే అని బయటకు కనిపిస్తున్నా… ఎక్కడో వర్గాలుగా ఉంది అని అంటుంటారు. దీనికి నిదర్శనంగా ఇటీవల కాలంలో కొన్ని ఘటనలు కూడా జరిగాయి. గతంలో చిరంజీవికి వజ్రోత్సవాల్లో ఎదురైన అనుభవాల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చిరంజీవి పక్కనే ఉన్నాం అనేవాళ్లు కూడా ఆ రోజు సరిగ్గా స్పందించలేదు అనే విమర్శలు ఉన్నాయి. దీంతో ఇప్పుడు చిరంజీవి కోసం చేసే ఈవెంట్‌కి ఎంతమంది కలిసొస్తారు అనేది ప్రశ్న.
చిరంజీవి (Chiranjeevi) ఒక్కరే కాదు.. ఆ కుటుంబం నుండి ఎవరికైనా పురస్కారాలు వచ్చినా పరిశ్రమ నుండి సరైన స్పందన రాలేదు అనే చెప్పాలి. అల్లు అర్జున్‌కు జాతీయ అవార్డు వచ్చినప్పుడు.. చరణ్ సినిమా ‘ఆర్ఆర్ఆర్’లోని పాటకు అవార్డు వచ్చినప్పుడు కూడా సరైన స్పందన రాలేదు. దీంతో ఇప్పుడు ఈవెంట్ చేస్తే స్పందన ఎలా ఉంటుంది అనేది ప్రశ్న. కొత్త కుర్ర హీరోలు ముందుకొస్తారు అందులో పెద్ద మార్పు ఉండదు… అయితే పాత హీరోలు, నటులు కూడా ముందుకొస్తే ఇంకా బాగుంటుంది.