Johnny Depp: జానీ డెప్ ఆ ఫ్రాంచైజీలో నటిస్తాడా? లేదా?
June 28, 2022 / 12:27 PM IST
|Follow Us
‘పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్’ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు జానీ డెప్. అయితే అదే స్థాయిలో ప్రపంచం ముందు దోషిలా నిలబడ్డాడు. భార్య అంబర్ హెరాల్డ్ అతనిపై చేసిన ఆరోపణలే దానికి కారణం. అయితే ఇప్పుడు అంతా తేలిపోయింది. అంబర్ చెప్పినట్లు జానీ డెప్ ఎలాంటి తప్పు చేయలేదని న్యాయస్థానం తేల్చింది. దీంతో జానీకి దూరమైన ఫ్రాంచైజీలు, సినిమాలు వెనక్కి వస్తున్నాయి. ఈ క్రమంలో జానీ డెప్‌కి రూ.2355 కోట్ల ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది.
జానీ తన కెరీర్లో దూసుకుపోతున్న సమయంలోనే అంబర్ హెరాల్డ్‌తో విబేధాలు వచ్చాయి. ఆ తర్వాత విడాకులు కూడా తీసుకున్నారు. అయితే ఈ క్రమంలో అంబర్, జానీ డెప్ ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకున్నారు. అది అక్కడితో ఆగకుండా.. కోర్టు మెట్లెక్కారు. చాలా రోజులు వాదనలు విన్నాక ఈ కేసులో ఫైనల్ గా జానీ డెప్ విజయం సాధించారు. అయితే ఈ లోపు జానీ కెరీర్లో అనుకోని కష్టాలు వచ్చాయి. డిస్నీ లాంటి బడా నిర్మాణ సంస్థలు జానీతో సినిమాలు చేయడానికి నిరాకరించాయి.
అయితే కోర్టులో జానీ నిరపరాధి అని తేలేసరికి తిరిగి అతడితో సినిమా చేయడానికి పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు రెడీ అవుతున్నాయి. ఈ క్రమంలోనే క్షమాపణ కోరుతూ జానీ డెప్‌కు డిస్నీ టీమ్ లేఖ పంపించినట్లు సమాచారం. అంతేకాదు.. కరేబియన్ ఫ్రాంచైజీలో నటించాలంటూ రూ.2,355 కోట్లు ఆఫర్ చేసినట్లు వార్తలొస్తున్నాయి. మరి జానీ వారిని క్షమిస్తాడా, తనకు ఇంత పాపులారిటీ తీసుకొచ్చిన ఆ ఫ్రాంచైజీలో నటిస్తాడా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.
2015లో జానీ డెప్, అంబర్ వివాహం జరిగింది. పెళ్లైన ఏడాదికే ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో 2017లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత అంబర్ రాసిన సెక్సువల్ వయలెన్స్ ఆర్టికల్ తన పరువుకి భంగం కలిగించేలా ఉందంటూ 2019 ఫిబ్రవరిలో కేసు పెట్టాడు జానీ డెప్. అంబర్ నుండి 50 మిలియన్ డాలర్ల నష్టపరిహారం ఇప్పించాలని కోర్టుని కోరాడు జానీ. అయితే తనకు గృహ హింస జరిగిందంటూ అంబర్ 100 మిలియన్ డాలర్లకు దావా వేసింది. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం జానీ డెప్‌కి అనుకూలంగా తీర్పునిచ్చింది.