ఈ టికెట్ ధరలతో బతకలేం, రేట్లు పెంచాల్సిందే అంటూ పట్టుబట్టి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల దగ్గర పర్మిషన్ తెచ్చుకున్నారు టాలీవుడ్ సినీ పెద్దలు. ప్రేక్షకుల కష్టాలు, ఇబ్బందులు కూడా పట్టించుకోకుండా పెంచేశారు. థియేటర్లకు జనాలు రాక తగ్గడంతో ‘సాధారణ టికెట్ ధరలకే మీ అభిమాన సినిమా’ అంటూ టముకు వేసుకొని మళ్లీ పాత రేట్లకు వచ్చారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా? ఎందుకంటే మళ్లీ సంక్రాంతి వస్తోంది. ఈసారి కూడా టికెట్ రేట్లు పెంచుతారు అంటూ ఓ చిన్న లీక్ బయటకు వచ్చింది కాబట్టి.
గత సంక్రాంతి నుండి సమ్మర్ వరకు వరుసగా పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు అని చూడకుండా టికెట్ రేట్లు పెంచేశారు. అయితే గత కొంతకాలంగా వరుస సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నా టికెట్ రేట్లు మాత్రం పెంచడం లేదు. అయితే పెద్ద పెద్ద మల్టీప్లెక్స్‌లు మాత్రం భారీ ధరలకే అమ్మాయి అనుకోండి. ఇప్పుడు సంక్రాంతికి పెద్ద సినిమాలు వస్తున్న నేపథ్యంలో రేట్లు మళ్లీ పెంచొచ్చు అని అంటున్నారు. దీని కోసం ప్రభుత్వం కొత్తగా ఎలాంటి జీవోలు తీసుకురానక్కర్లేదు కూడా. గతంలోనే మీకు నచ్చినప్పుడు, నచ్చినట్లు పెంచుకోండి అని ఓ పత్రం బయటకు వచ్చింది.
ప్రస్తుతం మల్టీ ప్లెక్స్‌లలో టికెట్ ధర రూ.175 ఉండగా, సంక్రాంతి సినిమాలకు ఓ వంద రూపాయలు అదనంగా ప్రేక్షకుల మీద మోపే అవకాశం ఉందని చెబుతున్నారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లలోనూ ఈ పెంపు ఉంటుంది అని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో గరిష్ఠంగా రూ.50 వరకు ఈ పెంపు ఉండొచ్చని టాక్. తెలంగాణ సంగతి తేలడం లేదు. ప్రస్తుతం సంక్రాంతి చిత్రాలకు సంబంధించిన బుకింగ్స్ ఓపెన్ కాలేదు. అవి స్టార్ట్ అయితే ధరల విషయం తెలుస్తుంది.
స్పెషల్ షోల సంగతి కూడా అంతే. అయితే ఏపీలో స్పెషల్ షోస్ ఉండవు అని కూడా అంటున్నారు. అయితే ఈ లోపు సినీ పెద్దలు ఏపీ సీఎం జగన్‌ను కలసి రిక్వెస్ట్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. అయితే, సినీ పెద్దలు గమనించాల్సిన విషయం ఏంటంటే.. ధరలు పెంచుకోమని ప్రభుత్వాలు చెప్పినా, ప్రేక్షకుల గురించి ఆలోచించాల్సింది మీరే. కాబట్టి ధరాభారంతో బక్కచిక్కిన ప్రేక్షకుల మీద భారం పడకుండా మీరే చూడాలి. సార్లూ వింటున్నారా?