యాత్ర

  • February 8, 2019 / 07:17 AM IST

దివంగత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, సమైక్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం “యాత్ర”. “పాఠశాల, ఆనందో బ్రహ్మ” చిత్రాల ఫేమ్ మహి వి.రాఘవ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో వై.ఎస్.ఆర్ గా మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రం నేడు విడుదలైంది. టీజర్, ట్రైలర్ తోనే విశేషంగా ఆకట్టుకున్న ఈ బయోపిక్ ప్రేక్షకులను ఏమేరకు మెప్పించ్చిందో చూద్దాం..!

కథ: 2004లో వచ్చిన మధ్యంతర ఎన్నికల సమయంలో వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి చేసిన పాదయాత్ర నేపధ్యంలో తెరకెక్కిన చిత్రమిది. ఆ యాత్రలో ఆయన ప్రజనలకు చేరువైనా తీరు మొదలుకొని 2004 మరియు 2009లో వరుసగా రెండుసార్లు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన విధానమే “యాత్ర” కథాంశం.

నటీనటుల పనితీరు: సాధారణంగా బయోపిక్ లు అనగానే.. సదరు వ్యక్తి ఆహార్యం, వేషధారణను సేమ్ టు సేమ్ దించేసి బయోపిక్ ను చూస్తున్న అనుభూతిని ప్రేక్షకులకు కలిగించడానికి చాలా ప్రయత్నిస్తుంటారు మన దర్శకులు, సదరు వ్యక్తిగా నటించే నటులు. కానీ.. మమ్ముట్టి మాత్రం కేవలం రాజశేఖర్ రెడ్డి వేషధారణను మాత్రమే పాటించి.. బాడీ లాంగ్వేజ్ లో ఆయన్ని అనుకరించకుండా తన ఓన్ మేనరిజమ్స్ తో పాత్రకు జీవం పోసాడు. సినిమా మొదలైనప్పుడు ఈయన రాజశేఖర్ రెడ్డిలా లేడే అనిపిస్తుంది, కొంతసేపయ్యాక చక్కగా నటిస్తున్నాడు అనిపిస్తుంది. సినిమా ముగిసే సమయానికి రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తిగా మమ్ముట్టి ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడనిపిస్తుంది. ఒక నటుడిగా ఆయన ప్రతిభను పొగడాల్సిన అవసరం లేదు, కానీ ఆయన ఈ సినిమా కోసం తెలుగు నేర్చుకోవడమే కాక సొంతంగా డబ్బింగ్ కూడా చెప్పుకోవడం అనేది అభినందనీయం. కాకపోతే.. వైఎస్ఆర్ లా ఎక్కడా రాయసీమ యాసలో మాట్లాడలేదనిపిస్తుంది తప్పితే.. వేరే మైనస్ మాత్రం కనిపించదు.

విజయమ్మగా ఆశ్రిత వేముల అచ్చుగుద్దినట్లుగా సరిపోయింది. కె.వి.పిగా రావురమేష్ సహజమైన నటనతో పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు. తండ్రి రాజారెడ్డిగా జగపతిబాబు, సబితా ఇంద్రారెడ్డిగా సుహాసిని ఇలా అందరూ పాత్రలకు పూర్తిస్థాయిలో న్యాయం చేశారు.

సాంకేతికవర్గం పనితీరు: దర్శకుడు మహి వి.రాఘవ సినిమాను స్టార్ట్ చేసిన పాయింట్ నుంచి ముగించిన విధానంలో ప్రేక్షకులకు ఒక మంచి సినిమా అందించాలన్న తపన కనిపించింది. కొన్ని చోట్ల ఎలివేషన్స్ కోసం సినిమాటిక్ లిబర్టీస్ మరీ ఎక్కువగా తీసుకున్నాడు అనిపించినా.. ఆ ఎలివేషన్ ను మరీ ఉచ్చస్థాయికి తీసుకెళ్లకుండా కేవలం వై.ఎస్.ఆర్ క్యారెక్టర్ ను ఎస్టాబ్లిష్ చేయడానికి మాత్రమే వినియోగించిన తీరు రాజకీయ పరిజ్ణానమ్ ఉన్నవారిని మాత్రమే కాక సగటు సినిమా అభిమానులకు కూడా నచ్చుతుంది. కాకపోతే.. ప్రస్తుతం జగన్ కాంగ్రెస్ నుంచి విడిపోయి సపరేట్ పార్టీ పెట్టాడు కాబట్టి రాజశేఖర్ రెడ్డి అప్పట్లో కాంగ్రెస్ పార్టీ పెద్దలకు ఎదురుతిరిగినట్లుగా, కొందరు లీడర్లను అవమానించినట్లుగా చూపించిన విధానం మాత్రం చరిత్ర తెలిసినవారికి మింగుడుపడదు.

ఇంకా చెప్పాలంటే.. పాలిటిక్స్ మీద పట్టు ఉన్నవారికి ఈ చిత్రం ఓ రాజకీయ కరపత్రంలా కనిపిస్తుంది. అందుకు కారణం సెకండాఫ్ మొత్తం వై.ఎస్.ఆర్ అవళంబించిన కొన్ని పధకాల పునాది ఎలా పడింది, కొన్ని అద్భుతమైన ఆలోచనలకు భీజం ఎక్కడపడింది అనేది మాత్రమే చూపిస్తూ వెళ్లిపోయాడు. ముఖ్యంగా.. తెలుగుదేశం పార్టీని మనదేశం పార్టీ అని చూపిస్తూ వారి రాజకీయ పద్ధతులను, వారి అధినాయకుడ్ని చులకనగా చూపించిన విధానం సినిమాకి కొన్ని సమస్యలు తీసుకురావచ్చు. మరీ ముఖ్యంగా వి.హనుమంతరావును మరీ కమెడియన్ గా చూపించడం మాత్రం బాధాకరమైన విషయం.

కె (కృష్ణకుమార్) సంగీతం, సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్, విజయ్ చిల్లా-శశి దేవిరెడ్డిల నిర్మాణ విలువలు.. ఇలా ప్రొడక్షన్ కి సంబంధించిన ప్రతి అంశం సినిమాకి ప్లస్ పాయింట్ గానే నిలిచింది.

విశ్లేషణ: రాజశేఖర్ రెడ్డి మరియు జగన్ అభిమానులకు, సగటు సినిమా అభిమానులకు విశేషంగా నచ్చే ఈ చిత్రం.. ఇతర రాజకీయ పార్టీ వారికి, చరిత్ర క్షుణ్ణంగా తెలిసినవారికి మాత్రం పెద్దగా నచ్చకపోవచ్చు. అయినప్పటికీ.. కొన్ని వక్రీకరణలు, ఇంకొన్ని అనవసరమైన ఎలివేషన్స్ ఉన్నప్పటికీ.. ఎమోషనల్ గా అందరినీ మెప్పించే కథనం, మమ్ముట్టి సహజమైన నటన ఉన్న సినిమా “యాత్ర”.

రేటింగ్: 3/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus