Yevam Review in Telugu: యేవమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
June 14, 2024 / 09:00 PM IST
|Follow Us
Cast & Crew
వశిష్ట సింహా (Hero)
చాందిని చౌదరి (Heroine)
జై భరత్ రాజ్, అషు రెడ్డి తదితరులు (Cast)
ప్రకాశ్ దంతులూరి (Director)
నవదీప్, పవన్ గోపరాజు (Producer)
కీర్తన శేష్, నీలేష్ మాండలపు (Music)
ఎస్వి. విశ్వేశ్వర్ (Cinematography)
తెలుగమ్మాయి చాందిని చౌదరి ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం “యేవమ్”. నవదీప్ నిర్మాణ సారథ్యంలో తెరకక్కిన ఈ చిత్రానికి ప్రకాష్ దంతులూరి దర్శకుడు. 2010లో వచ్చిన “ఓం శాంతి” తర్వాత ప్రకాష్ దంతులూరి దర్శకత్వం వహించిన సినిమా ఇదే కావడం గమనార్హం. మరి ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ప్రేక్షకుల్ని ఏమేరకు అలరించిందో చూద్దాం..!!
కథ: వికారాబాద్ పోలీస్ స్టేషన్లో కొత్తగా జాయినవుతుంది సౌమ్య (చాందిని చౌదరి). అసలు ఆడపిల్లలు కష్టపడడానికి పనికిరారు అనే మైండ్ సెట్ మధ్య పెరిగి.. తనను తాను నిరూపించుకోవడం కోసమే పోలీస్ ఉద్యోగం సాధిస్తుంది.
సరిగ్గా సౌమ్య డ్యూటీలో చేరినప్పటినుండి.. వికారాబాద్ పరిసర ప్రాంతాల్లో సినిమా హీరోల పేర్ల మీద యువతులను మోసం చేయడం, చంపడం గట్రా జరుగుతుంటాయి. ఈ కేస్ ను ఇన్స్పెక్టర్ అభిరామ్ (జై భరత్ రాజ్)తో కలిసి ఇన్వెస్టిగేట్ చేయడం మొదలెడుతుంది. ఈ క్రమంలో అభిరామ్ గురించి, ఈ తప్పులన్నీ చేస్తున్న యుగంధర్ (వశిష్ట సింహా) గురించి కొన్ని నమ్మలేని విషయాలు తెలుసుకొంటుంది.
అసలు ఎవరీ యుగంధర్? ఎందుకని వయసుకు వచ్చిన అమ్మాయిలను టార్గెట్ చేస్తున్నాడు? ఆ యుగంధర్ ను సౌమ్య పట్టుకోగలిగిందా? వంటి ప్రశ్నలకు సమాధానం “యేవమ్”.
నటీనటుల పనితీరు: చాందిని చౌదరి ఈ చిత్రంలో మొదటిసారి పోలీస్ ఆఫీసర్ గా నటించి, ఇంటెన్స్ యాక్షన్ సీన్స్ లో పర్వాలేదు అనిపించుకుంది. అయితే.. ఏమాత్రం దానికే “రీ-ఇంట్రడ్యూసింగ్” అనే టైటిల్ కార్డ్ వేయాల్సిన అవసరం ఏముందో అర్థం కాదు. జై భరత్ రాజ్ నటించడానికి ప్రయత్నించాడు కానీ.. పాత్రను పండించలేకపోయాడు.
వశిష్ట సింహా ఈ సినిమాకి అసలైన హీరో అని చెప్పాలి. నెగిటివ్ రోల్ అయినప్పటికీ.. వశిష్ట సింహా తనదైన నటన, బాడీ లాంగ్వేజ్ తో విశేషంగా అలరించాడు. ముఖ్యంగా డైలాగ్ డెలివరీతో వశిష్ట సింహా యుగంధర్ పాత్రను అద్భుతంగా పండించాడు. గోపరాజు రమణ సహాయ పాత్రలో పర్వాలేదనిపించుకున్నాడు.
సాంకేతికవర్గం పనితీరు: కీర్తన శేష్ – నీలేష్ మండలపు ద్వయం అందించిన సంగీతం సినిమాకి ఏకైక ఎస్సెట్ అని చెప్పాలి. ముఖ్యంగా నేపథ్య సంగీతం చాలా బాగుంది. సన్నివేశంలోని ఎమోషన్ ను ఎలివేట్ చేస్తూ చక్కని సాహిత్యంతో కూడిన నేపథ్య సంగీతం సినిమాను ఎలివేట్ చేయడానికి చాలా ప్రయత్నించింది.
దర్శకుడు ప్రకాష్ దంతులూరి రాసుకున్న కథ “బ్రీత్” అనే హిందీ వెబ్ సిరీస్ ను మరికొన్ని బెంగాలీ సినిమాలను గుర్తుచేస్తుంది. అయితే.. కథనం రాసుకున్న విధానం మాత్రం కనీస స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఒక్క క్లైమాక్స్ సీన్ తప్ప ఒక్కటంటే ఒక్క ఆకట్టుకునే అంశం కూడా సినిమాలో లేకపోవడం గమనార్హం. ప్రొడక్షన్ డిజైన్, ఆర్ట్ వర్క్ గట్రా టెక్నికల్ అంశాల గురించి పెద్దగా చెప్పుకోవాల్సింది ఏమీ లేదు.
విశ్లేషణ: ఒక థ్రిల్లర్ సినిమా.. అది కూడా స్ప్లిట్ పర్సనాలిటీ నేపథ్యం అంటే నవ్యత చాలా ముఖ్యం. పాయింట్ ఒక్కటే కాదు.. ఆ పాయింట్ ను డీల్ చేసే విధానం కూడా బాగుండాలి. ఈ విషయాన్ని దర్శకుడు సీరియస్ గా తీసుకోకపోవడంతో “యేవమ్” శుక్రవారం వచ్చి.. సోమవారానికి జనాలు మర్చిపోయే సినిమాగా మిగిలిపోయింది. అయితే.. వశిష్ట సింహా కెరీర్ కి మాత్రం ఈ సినిమాలోని సన్నివేశాలు ఒక చక్కని పోర్ట్ ఫోలియోలా పనిచేస్తాయి.
ఫోకస్ పాయింట్: యేవమ్ మహా కష్టమ్!
రేటింగ్: 1.5/5
Rating
1.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus