Naga babu, Allu Arjun: నాగబాబు ట్వీట్… బన్నీని దూరం పెడతారా? బన్నీనే దూరంగా వెళ్తాడా?
May 14, 2024 / 08:05 PM IST
|Follow Us
మెగా కుటుంబంలో అంతా ఓకేనా? ఈ మాట తరచుగా వినిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అందరూ ఒకటే అనే ఆలోచన వచ్చినప్పుడల్లా ‘నేను కాదు’ అంటూ ఓ వాయిస్ బయటకు వస్తుంది. లేదంటే ఓ చేత బయటకు కనిపిస్తుంది. దీంతో మళ్లీ మెగా – అల్లు కాన్సెప్ట్ చర్చకు వస్తుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంగానూ ఇదే చర్చ మొదలైంది. దానికి తొలుత అల్లు అర్జున్ (Allu Arjun) చేసిన పని ఒక కారణమైతే.. ఆ తర్వాత నాగబాబు చేసిన ట్వీటు మరో కారణం.
ఏపీలో గొడవలు, దాడుల మధ్య అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి. అయితే దాడులు మాత్రం కొనసాగుతున్నాయి అనుకోండి. ఆ విషయం పక్కనపెడితే సోషల్ మీడియాలో మెగా, అల్లు ఫ్యాన్స్ దాడులు కూడా మొదలయ్యాయి. పైన చెప్పినట్లు దీనికి కూడా అల్లు అర్జున్, నాగబాబే (Naga Babu) కారణం. ఇందులో ఎవరు ముందుకు, ఎవరు వెనుక అనే చర్చ కన్నా.. అసలు ఈ పరిస్థితి ఎందుకొచ్చింది అనేదే ఆలోచించాల్సిన విషయం అని అంటున్నారు. అల్లు కుటుంబానికి, మెగా ఫ్యామిలీకి మధ్య ఉన్నాయి, లేవు అంటున్న పొరపొచ్చాలకు బన్నీ నంద్యాల విజిట్, నాగబాబు ట్వీటు కారణం.
బన్నీ పేరెత్తకుండా నాగబాబు ఓ ట్వీట్ వేశారు. ‘‘మాతో ఉంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మావాడైన పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైన మావాడే’’ అని నాగబాబు ఆ ట్వీట్‌తో రాసుకొచ్చారు. అందులో అల్లు అర్జున్ పేరెత్తలేదు కానీ అది ఆయన గురించే అంటున్నారు. పిఠాపురం అసెంబ్లీ స్థానానికి పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నాగబాబు సహా మెగా మేనల్లుళ్లు రంగంలోకి దిగి ప్రచారం చేశారు.
చిరంజీవి వీడియో సందేశం ఇవ్వగా, చివరి రోజున వదిన సురేఖ, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) పిఠాపురం వచ్చారు. అయితే బన్నీ ట్వీటు మాత్రమే వేశాడు. కానీ తన స్నేహితుడైన వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి కోసం నంద్యాల రావడం సంచలనంగా మారింది. పవన్ కల్యాణ్ కోసం పిఠాపురం వెళ్లడానికి బన్నీకి కుదర్లేదు కానీ.. నంద్యాల వెళ్లడానికి కుదిరిందా అంటూ ఇప్పటికే ఫ్యాన్స్ సన్నాయి నొక్కులు నొక్కుతుండగా.. నాగబాబు ఈ ట్వీటు వేయడం విషయాన్ని మరింత ముదిరేలా చేసింది.
మాతో ఉంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మావాడైన పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైన మావాడే…!